
కొత్త రాజధాని కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ
న్యూఢిల్లీ: సీమాంధ్ర నూతన రాజధాని ఎంపిక కోసం ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీ వేయనున్నట్టు జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. జీవోఎం భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనపై కేంద్రం తీసుకున్న చర్యలను ఇప్పటివరకు జీవోఎం సమీక్షించిందని వెల్లడించారు. జూన్ 2లోగా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన కోసం 19 కమిటీల ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉద్యోగుల కేటాయింపుల కోసం రెండు కమిటీలు వేశామన్నారు. మార్చి 31 లోగా కమిటీలు నివేదిక అందజేస్తాయని అన్నారు.
కృష్ణా, గోదావరి నదుల నిర్వహణకు వేర్వేరుగా సర్వోన్నత మండళ్లను రేపు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఏపీ రాజధాని కోసం ప్రణాళిక సంఘంలో ప్రత్యేక విభాగం ఏర్పాటయిందని జైరాం రమేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్... రాజధాని సెల్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. త్వరలో మరోసారి జీవోఎం భేటీ కానుంది.