
సెప్టెంబర్‌లో కొత్త రాజధాని: జైరాం
ఒంగోలు / నెల్లూరు, న్యూస్‌లైన్: సీమాంధ్ర రాజధాని సెప్టెం బర్‌లో ఖరారు కానున్నట్లు కేంద్రమంత్రి జైరాం రమేష్ వెల్లడించారు. బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో వేర్వేరుగా విలేకరులతో ఆయన మాట్లాడారు. సీమాం ధ్రలో కొత్త రాజధాని ఏర్పాటు కోసం గుంటూరు, విజయవాడ, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి అంతా జరగడంతో సమస్య ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇకపై ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు.
సీమాంధ్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు చెప్పిన మాటలను పట్టించుకోలేదనేది పూర్తి అవాస్తవమని, హైదరాబాద్‌ను యూటీ చేయాలనే ఒకే ఒక్క విషయాన్ని తప్ప అన్ని విషయాలను అంగీకరించామని ఆయన వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను వీడి వెళుతున్నవారు లగడపాటి, రాయపాటిలాంటి వ్యాపారవేత్తలే తప్ప.. మిగిలిన వారు కాదన్నారు. అటువంటి వారు పార్టీని వీడినా ఎటువంటి నష్టం ఉండదన్నారు. బెర్లిన్ గోడ కిరణ్ చేతిలో కాదని ఆయన మైండ్‌లో ఉందని విమర్శించారు. ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించలేదని, రెండేళ్ల తర్వాత అభివృద్ధి ప్యాకేజీలను అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకొచ్చినా.. సీమాంధ్ర ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పురందేశ్వరి బీజేపీపై ఉన్న ప్రేమతో కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. రాజ్యసభలో చిరంజీవి మాట్లాడటం సెల్ఫ్‌గోల్ వేసిన విధంగా ఉందన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని జైరాం జోస్యం చెప్పారు.