* కనీసం లక్ష ఎకరాలుండాలంటున్న నిపుణుల కమిటీ
* దొనకొండలో భారీగా భూములు.. నీటి లభ్యత ఉన్నాయన్న కమిటీ
* ఆంధ్రప్రదేశ్‌కు ఓ మూలకు ఉండటం విశాఖపట్నానికి ప్రతికూలం
* కాకినాడ-రాజమండ్రికి తుపాన్లు, ప్రకృతి విపత్తుల ముప్పు
* గుంటూరు- విజయవాడ మధ్య భూ సేకరణ అసాధ్యం
* పులిచింతలలో విపరీతమైన వేడి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని సీమాంధ్రలో ఏ ప్రాంతంలో ఏర్పాటు కానుంది? విశాఖ నుంచి తిరుపతి వరకు నాలుగైదు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర నిపుణుల కమిటీ తన నివేదికలో ఎటువంటి సిఫారసులు చేసింది? రాష్ట్రం జూన్ రెండో తేదీ నుంచి రెండుగా విడివడనున్న తరుణంలో ఇవే అంశాలపై అన్ని వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. కమిటీ తన నివేదికలో ఏ ప్రాంతాన్ని రాజధానికి అనువైనదిగా ప్రతిపాదించిందోనని పార్టీల నేతలు, ఇతర ముఖ్యులు, రియల్ ఎస్టేట్, ఇతర రంగాల వ్యాపారులు కూపీలాగే ప్రయత్నాల్లో పడ్డారు.
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తమ సన్నిహిత వర్గాల నుంచి కచ్చితంగా కాకున్నా రాజధాని నగరం ఎక్కడ వస్తుందో ఇదమిత్థంగానైనా తెలుసుకొనే పనిలో నిమగ్నమైన ఆ వర్గాల అంచనా ప్రకారం.. అటు రాయలసీమకు - ఇటు కోస్తాంధ్రకు సరిగ్గా మధ్యలో.. కనీసం లక్ష ఎకరాల భూమి అందుబాటులో ఉండే ప్రదేశం.. అందులోనూ నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు వంటి సానుకూలతలు గల ప్రదేశం కొత్త రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతమని సదరు కమిటీ తన సిఫారసుల్లో సూచించినట్లు చెప్తున్నారు.
పరిశ్రమలు, ఇతర ముఖ్యమైన సంస్థల ఏర్పాటుకు వీలుగా సుమారు లక్ష ఎకరాలు ఒకే ప్రాంతంలో ఉంటేనే రాజధానికి వీలవుతుందనేది ఒక వాదన. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు స్థలాన్ని చూపించే రాజధానిని ఏర్పాటు చేశారని ఉదహరిస్తున్నారు. రాష్ట్రానికి ఒక మూలకు అన్నట్లుగా ఉండటం విశాఖపట్నానికి, తుపాన్లు, ప్రకృతి విలయాలు రాజమండ్రి - కాకినాడ ప్రాంతానికి, భారీ స్థాయిలో భూములు సేకరించ గలిగే పరిస్థితి లేకపోవటం విజయవాడ - గుంటూరులకు, విపరీతమైన వేడి వాతావరణం పులిచింతల ప్రాంతానికి ప్రతికూలతలుగా కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో భూముల లభ్యతతో పాటు ఇతరత్రా సానుకూలతలు ఉన్నాయని పేర్కొన్న కమిటీ.. కొన్ని ప్రతికూలతలను కూడా వివరించినట్లు.. కమిటీ సిఫారసులపై ఆరా తీసిన నేతలు చెప్తున్నారు. కమిటీ సిఫారసులు ఏ ప్రాంతానికి సానుకూలంగా ఉన్నాయనే దానిపై ఆయా నేతల అంచనాలు ఇలా ఉన్నాయి...
* విశాఖ, రాజమండ్రి - కాకినాడ, విజయవాడ - గుంటూరు, గుంటూరు జిల్లా పులిచింతల, ప్రకాశం జిల్లాలోని దొనకొండ తదితర కొన్ని ప్రాంతాలపై కమిటీ నివేదికలో ప్రతిపాదనలున్నట్లు చెప్తున్నారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి అనుకూల ప్రతికూలాంశాలను కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
* విశాఖపట్నం రాజధానికి అనుకూల ప్రాంతమైనా అది రాష్ట్రానికి మధ్యలో కాకుండా ఓమూలకు ఉండడం ప్రతికూలంగా మారిందని కమిటీ అభిప్రాయపడ్డట్లు వినిపిస్తోంది.
* రాజమండ్రి-కాకినాడ ప్రాంతాల్ని పరిశీలించిన కమిటీ అక్కడ ఎయిర్‌పోర్టు ఉండడం, నీటి సరఫరాకు ఇబ్బంది లేకపోవడం వంటి అనుకూలాంశాలను గుర్తించినా.. తుపాన్లు. ప్రకృతి విలయాలు ప్రతికూలంగా ఉన్నట్లుగా సూచించిందని.. తుపాన్ ప్రభావిత ప్రాంతంలో రాజధాని నిర్మాణం అనుకూలం కాదని తేల్చిందని చెప్తున్నారు.
* గుంటూరు - విజయవాడ ప్రాంతం రాజధాని ఏర్పాటుకు అనువైనదే అయినా అక్కడ రాజధానికి అవసరమైన స్థలం లభ్యత ప్రతికూలంగా మారుతోందని.. ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన ఆ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో రాజధానికి అవసరమైన స్థలసేకరణ కష్టమేనని కమిటీ అభిప్రాయపడ్డట్లు తెలిసిందని పలువురు నేతలు చెప్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ వ్యవసాయభూములు అధికంగా ఉండటం కూడా ప్రతికూలాంశంగానే గుర్తించారని తెలుస్తోంది.
* గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు ఉన్న ప్రాంతం కూడా కమిటీ పరిశీలనలోకి వచ్చినట్లు చెప్తున్నారు. అక్కడ స్థలం అందుబాటులో ఉండడం, నీటి సమస్య లేకపోవడాన్ని కమిటీ పరిశీలనకు వచ్చిందని.. దాంతో పాటు అక్కడి వాతావరణ పరిస్థితులను కూడా కమిటీ తన నివేదికలో చర్చిం చిందని.. భౌగోళికంగా అనువైనప్పటికీ వాతావరణ పరిస్థితుల పరంగా ప్రతికూలంగా ఉంటుందని.. విపరీతమైన వేడి వాతావరణం రాజధానికి అనుకూలంగా ఉండదని కమిటీ అభిప్రాయపడ్డట్లు ఆరాతీసిన వర్గాలు వివరిస్తున్నాయి.
* ఇక ప్రకాశం జిల్లాలోని దొనకొండ మండలంతో పాటు మరికొన్ని ప్రాంతాలపై కూడా కమిటీ సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. అటు కోస్తా, ఇటు రాయలసీమ ప్రాంతాలకు సమాన దూరంలో ఉండడం, ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉండటం కూడా రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు చెప్తున్నారు. నీటి లభ్యత తదితర అంశాలను పరిశీలించి కమిటీ అక్కడ రాజధాని ఏర్పాటుకు సానుకూల, ప్రతికూలాంశాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
ఆకాశాన్నంటిన భూముల రేట్లు
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అనేకరకాల ప్రచారాలు సాగుతుండగా.. ఆయా ప్రాంతాల్లో భూముల రేట్లు అమాంతంగా పెరిగిపోతున్నాయి. సీమాంధ్రలో కమిటీ పర్యటించిన అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు భూముల ధరలు భగ్గుమంటున్నాయి. రాజధాని ఎక్కడ ఏర్పాటు అవుతుందో కానీ.. ఈ ప్రాంతాల్లో నిన్నటిదాకా వేలు, లక్షలు పలికే భూముల ధరలు ఇప్పుడు ఏకంగా కోట్లకు చేరుకున్నాయి. కొందరు రాజధాని నగరంపై రకరకాల ప్రచారాలు లేవదీస్తూ భూముల రేట్లు కృత్రిమంగా పెరిగేలా చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూముల రేట్లు భారీగా పెరిగాయి.
రాజధాని ప్రాంతంపై కచ్చితమైన నిర్ణయమేదీ కేంద్రం నుంచి వెలువడకున్నా వేలం వెర్రిగా అమ్మకాలు, కొనుగోళ్లు జరిగిపోతున్నాయి. వాస్తవానికి కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ తాను పరిశీలించిన ప్రాంతాలపై ప్రాధమిక నివేదికను మాత్రమే కేంద్రానికి సమర్పించింది. దానిపై మరింత లోతుగా పరిశీలన పూర్తిచేసి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాకనే కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని నిపుణులు చెప్తున్నారు.
రాజధాని రూటెటు!
Published Thu, May 29 2014 1:59 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement