'రాజధాని ఏదనేది ముందుగా నిర్ణయించుకుని రాలేదు'
రాజధాని ఏదనేది ముందుగా నిర్ణయించుకుని రాలేదని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రతన్ రాయ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికలో భాగంగా ఆదివారం రాజమండ్రి వచ్చిన ఆ కమిటీ సభ్యులు జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో కమిటీ సభ్యులలో ఒకరైన రతన్రాయ్ మాట్లాడారు.
రాజధానిపై తుది నివేదిక ఆగస్టు 31 నాటికి కేంద్ర హోంశాఖకు అందజేస్తామన్నారు. రాజమండ్రిలోని ప్రభుత్వ భూములు, నీటి లభ్యత తదితర అంశాలను పరిశీలించినట్లు చెప్పారు. కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ అనారోగ్యం కారణంగానే రాలేదని రతన్ రాయ్ విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై ఏర్పాటు అయిన శివరామకృష్ణన్ కమిటీ శనివారం విశాఖపట్నంలో పర్యటించింది. అనంతరం ఆ జిల్లా ఉన్నతాధికారులలో సమావేశమై పలు అంశాలపై చర్చింది. అయితే ఆ కమిటీ సభ్యుల పర్యటన అంతా చాలా గోప్యంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం విశాఖపట్నం నుంచి కమిటీ సభ్యులు రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి నగరంలో పర్యటించిన అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. అనంతరం ఆ కమిటీ సాయంత్రం విజయవాడ చేరుకోనుంది.