ఎన్నో వనరుల సిరి..రాజధానిగా ఇదే సరి..
సాక్షి, రాజమండ్రి :‘విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిగా రాజమండ్రి అన్నివిధాలా అనువైన ప్రాంతం. ఉన్నత విద్యావకాశాలు, జాతీయ రహదారి, సమృద్ధిగా నదీ వనరులు, విద్యా, ఉపాధి అవకాశాలు, సముద్ర తీరం అన్ని అందుబాటులో ఉన్నాయ’ంటున్నారు మేధావులు. ఇవే అంశాలను విశదీకరిస్తూ, జిల్లాకు ఆదివారం రానున్న ‘రాజధాని’ కమిటీకి నివేదికలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర రాజధానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయడం కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం రాజమండ్రి వస్తుండడంతో ఈ ప్రాంతవాసుల్లో కొండంత ఆశలు నెలకొన్నాయి. కొత్త రాజధానిగా రాజమండ్రిని ప్రతిపాదించాలని కమిటీని కోరేందుకు ప్రముఖులు, ఆ దిశగా ప్రతిపాదనలు ఇచ్చేందుకు అధికారులు ఉద్యుక్తులయ్యారు.
రాజమండ్రియే ఎందుకంటే..
రాజమండ్రి నగరం తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు రాజధాని వంటిది. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధాన వాణిజ్య నగరం.
రాజమండ్రిలో అత్యాధునిక సదుపాయాలతో విమానాశ్రయం ఉంది. అంతర్జాతీయ స్థాయికి విస్తరించే వనరులున్నాయి.
హౌరా, చెన్నై, హైదరాబాద్‌కు ప్రధాన రైలు మార్గం ఉంది.
కోల్‌కతా-చెన్నైను కలిపే 16వ నంబరు జాతీయ రహదారి ఆనుకుని ఉంది. రాష్ట్రంలోని రెండో అతి పెద్ద సీపోర్టు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని కాకినాడలో ఉంది.
రాజమండ్రి శివారులో రాజధాని నిర్మాణానికి కావాల్సిన ఆరు వేల ఎక రాల అటవీ భూములున్నాయి. రాజధాని నిర్మాణానికి వీటిని డీనోటిఫై చేయడానికి ప్రభుత్వం సమ్మతం కూడా ఉంది.
ఉన్నత విద్యాలయాలు, రాజమండ్రికి 60 కిలోమీటర్ల వైశాల్యంలో ఎన్నో ఉన్నాయి.ప్రతిష్టాత్మకమైన నన్నయ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, కాకినాడలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఉన్నాయి.
దేశ అవసరాలను తీర్చే అపార చమురు నిక్షేపాలు జిల్లాలో ఉన్నాయి.
మూడు వేల మెగావాట్లకు పైగా విద్యుదుత్పత్తి చేయగల గ్యాస్ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలున్నాయి.
రాష్ట్రంలోనే సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంది. దేశంలోనే పెద్ద నదీ పర్యాటకానికి రాజమండ్రి కేంద్ర స్థానం వంటిది. ఇంతకన్నా అనువైన ప్రాంతం రాష్ట్రంలో మరెక్కడా ఉందని వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
స్థానికుల్లో నిరాశ
కాగా కమిటీ చైర్మన్ అయిన శివరామకృష్ణన్ లేకుండానే కమిటీ పర్యటన జరుగుతోందని తెలుస్తోంది. ఆయన స్థానంలో ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ డెరైక్టర్ డాక్టర్ రతన్‌రాయ్ ఈ కమిటీకి ఆధ్వర్యం వహిస్తున్నారు. రాజధానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించేందుకు కమిటీ రాజమండ్రికి ఒక గంట మాత్రమే కేటాయించడంపై జిల్లావాసుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పర్యటన సాగేదిలా..
రాజధాని కమిటీ విశాఖపట్నం నుంచి ఉదయం 9 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. హోటల్ రివర్‌బేలో అరగంట విశ్రమించిన అనంతరం 10 నుంచి 11 గంటల వరకు కలెక్టర్ నీతూ ప్రసాద్, రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబుతో సమావేశమవుతారు. అనంతరం రోడ్డుమార్గంలో విజయవాడ బయలుదేరి వెళతారు. కమిటీలో రతన్‌రాయ్‌తో పాటు బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్‌కు చెందిన అరోమర్ రవి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అర్బన్ ఎఫైర్స్ డెరైక్టర్ జగన్‌షా, న్యూఢి ల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ పూర్వపు డీన్ కేటీ రవీంద్రన్ ఉంటారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ పి.తిమ్మారెడ్డి కూడా పర్యటిస్తున్నారు. రాజమండ్రి పర్యటన అనంతరం కమిటీ విజయవాడ, గుంటూరుల్లో పర్యటిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.