బందరు పోర్టు.. నిర్మించి తీరుతాం
- భూసేకరణే కీలకం
- బెల్ట్‌షాపులను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్
- మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం : బందరు పోర్టు పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తామని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మచిలీపట్నం వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో బందరు పోర్టు అభివృద్ధి అంశం ప్రస్తావనకు వచ్చిందని గుర్తుచేశారు. ఇది పోర్టు పనులు ప్రారంభించడానికి శుభసూచకమని తెలిపారు.
కేబినెట్ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి తీసుకునే చర్యల్లో భాగంగా పోర్టు అభివృద్ధి అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారని చెప్పారు. బందరు పోర్టు అభివృద్ధికి భూసేకరణ కీలకంగా మారిందన్నారు. త్వరలో ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, పనులు త్వరితగతిన ప్రారంభించే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
బెల్ట్‌షాపులను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్...
రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల మద్యం దుకాణాలు ఉన్నాయని, వాటి పరిధిలో నడుస్తున్న బెల్ట్‌షాపులను తొలగించేందుకు ప్రత్యేక టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అన్ని జిల్లాల్లోనూ ఎంఆర్‌పీ ధరలకే మద్యం విక్రయించాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. బెల్ట్‌షాపులను నిర్మూలించేందుకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కమిటీల నియామకం పూర్తయ్యాక బెల్ట్‌షాపుల తొలగింపు తదితర అంశాలపై నిత్యం నివేదికలు రప్పించుకుని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బెల్ట్ షాపులను తొలగించే ప్రక్రియ జరుగుతోందని, దీనిని మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. ఎక్సైజ్ అధికారులు ఎక్కడైనా మెతక వైఖరి అవలంబిస్తే, అలాంటి చోట్ల టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని పంపి బెల్ట్‌షాపులను మూసివేయిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 564 బెల్ట్ షాపులపై దాడులు చేసి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఉయ్యూరులో ఒక కేసు, జగ్గయ్యపేటలో 11 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
మద్యం పాలసీలో స్వల్ప మార్పులే...
రాష్ట్ర ఆదాయానికి భంగం కలగకుండా నూతన మద్యం పాలసీ ఉంటుందని మంత్రి రవీంద్ర తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానంపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. అక్కడి లోపాలు, అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని సముచిత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే మద్యం పాలసీకి సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల లెసైన్సు గడువు ఈ నెల 30 నాటికి పూర్తవుతుందన్నారు. దాదాపు మద్యం పాలసీకి సంబంధించి పాత పద్ధతులలోనే కొద్దిపాటి మార్పులు చేసి అమలు చేసే అవకాశం ఉందన్నారు. తమిళనాడులో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతోందని, ఈ పద్ధతిని మన రాష్ట్రంలో అమలు చేయాలంటే దాదాపు 25 వేల మంది సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని చెప్పారు.
ఫీజ్ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు రూ.1500 కోట్లు...
రాష్ట్రవ్యాప్తంగా బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద రూ.1500 కోట్ల బకాయిలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఏదైనా కళాశాల యాజమాన్యం విద్యార్థులు ఫీజులు చెల్లించాలనే కారణంతో విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా జాప్యం చేస్తే అలాంటివాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతు రుణమాఫీని సక్రమంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో రైతు రుణమాఫీ, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో బందరు జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్, టీడీపీ నాయకులు మోటమర్రి వెంకట బాబాప్రసాద్, గొర్రెపాటి గోపీచంద్, గోపు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.