belt shop and excise officials
-
‘బెల్ట్’ కిక్కు
జనగామ: గ్రామాల్లో ‘బెల్ట్’ కిక్కెక్కిస్తోంది. వేసవి ప్రభావంతో నీటికి కష్టాలు ప్రారంభమైనా.. మద్యం మాత్రం ఏరులై పారుతోంది. అనధికార సిట్టింగ్‌లు బార్లను తలపిస్తున్నాయి. ఫుల్ బాటిల్‌పై రూ. 100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గుడుంబా అమ్మకాలపై దృష్టి సారించిన ఎక్సైజ్ శాఖ బెల్ట్ దుకాణాలను చూసీచూడనట్లు వదిలేస్తోంది. దీంతో వారి ఇష్టారాజ్యం కొనసాగుతోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్ పూర్, పాలకుర్తి నియోజక వర్గాల పరిధిలోని 12 మండలాల్లో నాలుగు వేల వరకు బెల్ట్ దుకాణాలు ఉండొచ్చని అంచనా. బెల్ట్ దుకాణాల ద్వారా ప్రతి రోజు రూ.20 లక్షల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తుంది. జనగామ జిల్లా పరిధిలోని జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు గ్రామాల్లో బెల్ట్ దుకాణాల జోరు విచ్ఛలవిడిగా కొనసాగుతుంది. గతంలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకటించే వరకు బెల్ట్ షాపుల అమ్మకాలు గుట్టుగా సాగాయి. మద్యం దుకాణాలు ఊరికి దూరంగా.. రహదారులకు దగ్గరగా ఉండేవి. బెల్ట్‌షాపులు మాత్రం ఇళ్లకు దూరంగా.. రహదారులకు దగ్గరగా వచ్చేశాయి. 2017 జూలై ఒకటో తేదీ నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కార్పోరేషన్, మునిసిపల్ పరి ధిలో మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చింది. సుప్రీం ఆదేశాల మేరకు మండల, పట్టణ ప్రాం తాల్లో జాతీయ, రాష్ట్ర హైవేలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. మద్యం దుకాణాలు కనిపించక.... హైవేలపై ప్రయాణం చేసే సమయంలో చాలా మంది మద్యం సేవించి డ్రైవింగ్ చేసేవాళ్లు. రహదారిపై వైన్స్ కనిపించగానే మద్యం సేవించేవారు. సుప్రీం కోర్టు కఠినమైన నిబంధనలతో తీర్పు వెలువరించింది. దీంతో మద్యం దుకాణాలు హైవేల నుంచి గ్రామాల్లోకి వెళ్లినా, వాటి స్థానంలో కొత్తగా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి..వెలుస్తున్నాయి. బార్లను తలపిస్తున్న.. బెల్ట్ దుకాణాలు జిల్లాలోని అనేకచోట్ల బెల్ట్‌షాపుల నిర్వహణ బార్లను తలపిస్తున్నాయి. దీంతో ఎప్పటి లాగే హైవేలపై ప్రయాణించే వారు ఏ చీకూ చింతా లేకుండా ‘మత్తు’ లోకి దిగుతున్నారు. అనధికారిక ఆదేశాల మేరకు కొనసాగుతున్న బెల్ట్ దుకాణాలపై ఎక్సైజ్ శాఖ చూసిచూడనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత మండలాలకు చెందిన వైన్స్‌ల నుంచి కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకు వస్తున్నారు. అదనపు వడ్డింపు బెల్ట్ దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అదనపు వడ్డింపుతో మత్తును వదిలిస్తున్నారు. క్వార్టర్‌కు రూ. 20 నుంచి రూ.30 వరకు అదనంగా తీసుకుంటున్నారనే గొడవలు అంతటా జరుగుతున్నాయి. ఆయా మండలాల పరిధిలోని వైన్స్ దుకాణాల్లో కూడా ఎమ్మార్పీకంటే అదనంగా ధరలు తీసుకుంటుండడంతో.. నిత్యం మాటల యుద్ధం జరుగుతుంది. ఫిర్యాదు చేస్తే దాడులు చేస్తాం. బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తే చర్యలు త ప్పవు.ఎప్పటికప్పుడు దాడులు కొనసాగిస్తున్నాం. దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.వైన్స్‌ల్లో అదనపు ధరలకు విక్రయిస్తే..కేసులు నమోదు చేస్తాం. – సుధీర్, ఎస్సై ఎక్సైజ్ శాఖ, జనగామ -
తాగుడు.. ఊగుడు !
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. ప్రధానంగా బెల్టు షాపుల ద్వారానే అధిక మొత్తంలో విక్రయమవుతోంది. ఎక్సైజ్ నివేదికల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజుకు 20,416 కేసుల బ్రాందీ, విస్కీ.. 32,251 కేసుల బీరు విక్రయాలు జరుగుతున్నాయి. అంటే 4.5 లక్షల లీటర్ల మద్యం అమ్ముడుపోతోందన్న మాట. దీని విలువ రూ 13.05 కోట్లు. నిజానికి ఒక్క ఏ4 లైసెన్స్డ్ దుకాణాల ద్వారా మాత్రమే అయితే.. ఇంత మద్యం విక్రయించడం సాధ్యం కాదు. ఎక్సైజ్ అధికారులే పనిగట్టుకుని బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. గుడుంబాను నిర్మూలించే క్రమంలో గతంలో దానిపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కింద బెల్టు దుకాణాలనే సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు స్వయంగా ఎక్సైజ్ కమిషనరే బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు కారణాలతోనే ప్రతి పెద్ద గ్రామపంచాయితీలో సగటున 8 , చిన్న గ్రామాల్లో మూడు చొప్పున బెల్టు దుకాణాలు తెరుచుకున్నాయి. బెల్టుతోనే దందా.. ప్రస్తుతం గ్రామాల్లోని చిన్నచిన్న కిరాణం దుకాణాలు, చాయ్ కొట్లతో పాటు ప్రత్యేకంగా లిక్కర్ విక్రయాలకూ దుకా ణాలు తెరుచుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,708, పంచాయతీలు, 705 మదిర గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాలు, పట్టణాల్లో అధికారికంగా 265 అధీకృత మద్యం దుకాణాలు, 119 బార్లు ఉండగా.. వాటికి అనుసంధానంగా 15,779 బెల్టు దుకాణాలు నడుస్తున్నట్లు తేలింది. బెల్టు దుకాణాల్లో ప్రతి సీసాపై ఎమ్మార్పీ మీద రూ.20 నుంచి రూ.30 అదనంగా తీసుకుంటున్నారు. బీరు మీద రూ. 30 నుంచి రూ.40 వసూలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రోజు కు రూ.13 కోట్ల మద్యం వ్యాపారం సాగుతుండగా.. రూ.8.5 కోట్ల వ్యాపారం బెల్టు దుకాణాల ద్వారానే సాగుతున్నట్లు అంచనా. పాల వినియోగం అంతంతే.. ఉమ్మడి వరంగల్‌లో సుమారు 39 లక్షల జనాభా ఉంది. ప్రతి వ్యక్తి సగటున నిత్యం250 మిల్లీలీటర్ల పాలు తాగాలి. ఈ లెక్కన జిల్లాలో కనీసం 9.75 లక్షల లీటర్ల పాల వినియోగం జరుగాలి. జిల్లాలో పెద్ద డెయిరీలైన ముల్క నూరు, విజయ డెయిరీల నివేదికల ప్రకారం కనీసం లక్ష లీటర్ల పాల వినియోగం లేదు. జిల్లాలో విజయ, ముల్క నూరు, ఎన్ఎస్ఆర్, వీటీ, స్వకృషి తదితర డెయిరీలతో పాటు మరో 11 డెయిరీలు పాలను సరఫరా చేస్తున్నాయి. వీటిలో అత్యధికంగా ముల్కనూరు డెయిరీ నుంచి రోజుకు 45 వేల లీటర్లు, విజయ నుంచి 12 వేల లీటర్లు, మిగిలిన అన్ని డెయిరీలను కలుపుకుని 25 వేల లీటర్ల వరకు పాల వినియోగం జరుగుతోంది. ఈ లెక్కన ప్రజలు రోజుకు 82 వేల లీటర్ల పాలనే తాగుతున్నారు. పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు మొత్తం 90 వేల లీటర్లకు మించడం లేదని పశుసంవర్థక శాఖ నివేదికలు చెబు తున్నాయి. చాయ్, కాఫీలును కలుపుకుంటే మరో 75 వేల లీటర్ల మేరకు తాగుతున్నట్లు సమాచారం. మద్యం విక్రయాలు ఎక్కువగానే ఉన్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం విక్రయాలు ఎక్కువగానే ఉన్నాయి. బార్లు, వైన్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల విక్రయాల్లో హైదరాబాద్‌తో పోటీ పడుతోంది. ఎమ్మార్పీకే అమ్మకాలు సాగించడం విక్రయాల వృద్ధికి మరో కారణం. బెల్ట్ షాపుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బెల్ట్ షాపు నిర్వాహకులపై ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసులు పెడుతున్నాం. చేసిన కష్టం మందుకే.. గ్రామంలో విపరీతంగా బెల్ట్షాపులైనయి. పొద్దంతా పనిచేసిన పైసలను మాయదారి మందుకే పెడుతున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు షాపులను తెరిచే ఉంచుతున్నారు. మూసివేయించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పెరిగిపోతున్నాయి . – బోడ అరుణ, కోమటిపల్లి తండా,ఖానాపురం, వరంగల్ రూరల్ పాల కంటే మద్యానికే ప్రాముఖ్యత అత్యధిక శాతం మంది పౌష్టికాహారం కంటే మద్యానికి ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరం. భారత్‌లో పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో రోజుకు సగటున వ్యక్తి తన ఆహారంలో సుమారు 6 లీటర్ల మేర పాలు ,పాల ఉత్పత్తులను తీసుకుంటునట్లు సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో సగటు వ్యక్తి 100 నుంచి 150 మిల్లీలీటర్లు దాటడం లేదు. అందుకు పోషకాహారమైన పాలు, పాల ఉత్పత్తుల పై అవగాహన లోపమే కారణం. పాల ఉత్పత్తుల వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – పాత చంద్రశేఖర్, డీడీ, విజయ డెయిరీ, వరంగల్ రోజురోజుకూ పెరుగుతున్నాయి రోజురోజుకూ మా ఊళ్లో బెల్టుషాపులు పెరిగిపోతున్నాయి. ఇంతకు ముందు ఒకటి, రెండు ఉండేవి. ఇప్పుడు పది షాపుల పైనే ఉన్నాయి. దీంతో ఉద్దెరకు కూడా మద్యం అమ్ముతున్నారు. నా భర్త సంపాదించిన దాంట్లో సగం తాగుడుకే పోతోంది. దీంతో గొడవలు పెరుగుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా బెల్టుషాపులను మూసివేస్తే సంసారాలు బాగుపడుతాయి. – నక్క శాంత, గృహిణి,గుమ్మనూరు,మానుకోట -
బందరు పోర్టు.. నిర్మించి తీరుతాం
భూసేకరణే కీలకం బెల్ట్‌షాపులను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం : బందరు పోర్టు పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తామని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మచిలీపట్నం వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో బందరు పోర్టు అభివృద్ధి అంశం ప్రస్తావనకు వచ్చిందని గుర్తుచేశారు. ఇది పోర్టు పనులు ప్రారంభించడానికి శుభసూచకమని తెలిపారు. కేబినెట్ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి తీసుకునే చర్యల్లో భాగంగా పోర్టు అభివృద్ధి అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారని చెప్పారు. బందరు పోర్టు అభివృద్ధికి భూసేకరణ కీలకంగా మారిందన్నారు. త్వరలో ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, పనులు త్వరితగతిన ప్రారంభించే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బెల్ట్‌షాపులను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్... రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల మద్యం దుకాణాలు ఉన్నాయని, వాటి పరిధిలో నడుస్తున్న బెల్ట్‌షాపులను తొలగించేందుకు ప్రత్యేక టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అన్ని జిల్లాల్లోనూ ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. బెల్ట్‌షాపులను నిర్మూలించేందుకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కమిటీల నియామకం పూర్తయ్యాక బెల్ట్‌షాపుల తొలగింపు తదితర అంశాలపై నిత్యం నివేదికలు రప్పించుకుని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బెల్ట్ షాపులను తొలగించే ప్రక్రియ జరుగుతోందని, దీనిని మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. ఎక్సైజ్ అధికారులు ఎక్కడైనా మెతక వైఖరి అవలంబిస్తే, అలాంటి చోట్ల టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని పంపి బెల్ట్‌షాపులను మూసివేయిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 564 బెల్ట్ షాపులపై దాడులు చేసి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఉయ్యూరులో ఒక కేసు, జగ్గయ్యపేటలో 11 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మద్యం పాలసీలో స్వల్ప మార్పులే... రాష్ట్ర ఆదాయానికి భంగం కలగకుండా నూతన మద్యం పాలసీ ఉంటుందని మంత్రి రవీంద్ర తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానంపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. అక్కడి లోపాలు, అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని సముచిత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే మద్యం పాలసీకి సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల లెసైన్సు గడువు ఈ నెల 30 నాటికి పూర్తవుతుందన్నారు. దాదాపు మద్యం పాలసీకి సంబంధించి పాత పద్ధతులలోనే కొద్దిపాటి మార్పులు చేసి అమలు చేసే అవకాశం ఉందన్నారు. తమిళనాడులో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతోందని, ఈ పద్ధతిని మన రాష్ట్రంలో అమలు చేయాలంటే దాదాపు 25 వేల మంది సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని చెప్పారు. ఫీజ్ రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు రూ.1500 కోట్లు... రాష్ట్రవ్యాప్తంగా బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద రూ.1500 కోట్ల బకాయిలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఏదైనా కళాశాల యాజమాన్యం విద్యార్థులు ఫీజులు చెల్లించాలనే కారణంతో విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా జాప్యం చేస్తే అలాంటివాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతు రుణమాఫీని సక్రమంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో రైతు రుణమాఫీ, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో బందరు జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్, టీడీపీ నాయకులు మోటమర్రి వెంకట బాబాప్రసాద్, గొర్రెపాటి గోపీచంద్, గోపు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.