సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. ప్రధానంగా బెల్టు షాపుల ద్వారానే అధిక మొత్తంలో విక్రయమవుతోంది. ఎక్సైజ్ నివేదికల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజుకు 20,416 కేసుల బ్రాందీ, విస్కీ.. 32,251 కేసుల బీరు విక్రయాలు జరుగుతున్నాయి. అంటే 4.5 లక్షల లీటర్ల మద్యం అమ్ముడుపోతోందన్న మాట. దీని విలువ రూ 13.05 కోట్లు. నిజానికి ఒక్క ఏ4 లైసెన్స్‌డ్ దుకాణాల ద్వారా మాత్రమే అయితే.. ఇంత మద్యం విక్రయించడం సాధ్యం కాదు.
ఎక్సైజ్ అధికారులే పనిగట్టుకుని బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. గుడుంబాను నిర్మూలించే క్రమంలో గతంలో దానిపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కింద బెల్టు దుకాణాలనే సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు స్వయంగా ఎక్సైజ్ కమిషనరే బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు కారణాలతోనే ప్రతి పెద్ద గ్రామపంచాయితీలో సగటున 8 , చిన్న గ్రామాల్లో మూడు చొప్పున బెల్టు దుకాణాలు తెరుచుకున్నాయి.
బెల్టుతోనే దందా..
ప్రస్తుతం గ్రామాల్లోని చిన్నచిన్న కిరాణం దుకాణాలు, చాయ్ కొట్లతో పాటు ప్రత్యేకంగా లిక్కర్ విక్రయాలకూ దుకా ణాలు తెరుచుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,708, పంచాయతీలు, 705 మదిర గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాలు, పట్టణాల్లో అధికారికంగా 265 అధీకృత మద్యం దుకాణాలు, 119 బార్లు ఉండగా.. వాటికి అనుసంధానంగా 15,779 బెల్టు దుకాణాలు నడుస్తున్నట్లు తేలింది. బెల్టు దుకాణాల్లో ప్రతి సీసాపై ఎమ్మార్పీ మీద రూ.20 నుంచి రూ.30 అదనంగా తీసుకుంటున్నారు. బీరు మీద రూ. 30 నుంచి రూ.40 వసూలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రోజు కు రూ.13 కోట్ల మద్యం వ్యాపారం సాగుతుండగా.. రూ.8.5 కోట్ల వ్యాపారం బెల్టు దుకాణాల ద్వారానే సాగుతున్నట్లు అంచనా.
పాల వినియోగం అంతంతే..
ఉమ్మడి వరంగల్‌లో సుమారు 39 లక్షల జనాభా ఉంది. ప్రతి వ్యక్తి సగటున నిత్యం250 మిల్లీలీటర్ల పాలు తాగాలి. ఈ లెక్కన జిల్లాలో కనీసం 9.75 లక్షల లీటర్ల పాల వినియోగం జరుగాలి. జిల్లాలో పెద్ద డెయిరీలైన ముల్క నూరు, విజయ డెయిరీల నివేదికల ప్రకారం కనీసం లక్ష లీటర్ల పాల వినియోగం లేదు. జిల్లాలో విజయ, ముల్క నూరు, ఎన్‌ఎస్‌ఆర్, వీటీ, స్వకృషి తదితర డెయిరీలతో పాటు మరో 11 డెయిరీలు పాలను సరఫరా చేస్తున్నాయి.
వీటిలో అత్యధికంగా ముల్కనూరు డెయిరీ నుంచి రోజుకు 45 వేల లీటర్లు, విజయ నుంచి 12 వేల లీటర్లు, మిగిలిన అన్ని డెయిరీలను కలుపుకుని 25 వేల లీటర్ల వరకు పాల వినియోగం జరుగుతోంది. ఈ లెక్కన ప్రజలు రోజుకు 82 వేల లీటర్ల పాలనే తాగుతున్నారు. పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు మొత్తం 90 వేల లీటర్లకు మించడం లేదని పశుసంవర్థక శాఖ నివేదికలు చెబు తున్నాయి. చాయ్, కాఫీలును కలుపుకుంటే మరో 75 వేల లీటర్ల మేరకు తాగుతున్నట్లు సమాచారం.
మద్యం విక్రయాలు ఎక్కువగానే ఉన్నాయి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం విక్రయాలు ఎక్కువగానే ఉన్నాయి. బార్లు, వైన్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల విక్రయాల్లో హైదరాబాద్‌తో పోటీ పడుతోంది. ఎమ్మార్పీకే అమ్మకాలు సాగించడం విక్రయాల వృద్ధికి మరో కారణం. బెల్ట్ షాపుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బెల్ట్ షాపు నిర్వాహకులపై ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసులు పెడుతున్నాం.
చేసిన కష్టం మందుకే..
గ్రామంలో విపరీతంగా బెల్ట్‌షాపులైనయి. పొద్దంతా పనిచేసిన పైసలను మాయదారి మందుకే పెడుతున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు షాపులను తెరిచే ఉంచుతున్నారు. మూసివేయించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పెరిగిపోతున్నాయి . – బోడ అరుణ, కోమటిపల్లి తండా,ఖానాపురం, వరంగల్ రూరల్
పాల కంటే మద్యానికే ప్రాముఖ్యత
అత్యధిక శాతం మంది పౌష్టికాహారం కంటే మద్యానికి ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరం. భారత్‌లో పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో రోజుకు సగటున వ్యక్తి తన ఆహారంలో సుమారు 6 లీటర్ల మేర పాలు ,పాల ఉత్పత్తులను తీసుకుంటునట్లు సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో సగటు వ్యక్తి 100 నుంచి 150 మిల్లీలీటర్లు దాటడం లేదు. అందుకు పోషకాహారమైన పాలు, పాల ఉత్పత్తుల పై అవగాహన లోపమే కారణం. పాల ఉత్పత్తుల వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – పాత చంద్రశేఖర్, డీడీ, విజయ డెయిరీ, వరంగల్
రోజురోజుకూ పెరుగుతున్నాయి
రోజురోజుకూ మా ఊళ్లో బెల్టుషాపులు పెరిగిపోతున్నాయి. ఇంతకు ముందు ఒకటి, రెండు ఉండేవి. ఇప్పుడు పది షాపుల పైనే ఉన్నాయి. దీంతో ఉద్దెరకు కూడా మద్యం అమ్ముతున్నారు. నా భర్త సంపాదించిన దాంట్లో సగం తాగుడుకే పోతోంది. దీంతో గొడవలు పెరుగుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా బెల్టుషాపులను మూసివేస్తే సంసారాలు బాగుపడుతాయి. – నక్క శాంత, గృహిణి,గుమ్మనూరు,మానుకోట
Comments
Please login to add a commentAdd a comment