కాజీపేట అర్బన్ :
మద్యం షాపుల ఎంపికను పారదర్శకంగా చేపట్టినట్లు కలెక్టర్ అమ్రపాలి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా ఎక్సైజ్‌అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ పి.బాలస్వామి, డిప్యూటీ కమిషనర్ సురేష్ రాథోడ్‌ల ఆధ్వర్యంలో హన్మకొండలోని ఎన్జీఓస్ కాలనీలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో జిల్లాలోని 59 రిటైల్ మద్యం షాపులను లాటరీ పద్ధతిలో శుక్రవారం ఎంపిక చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టామన్నారు.
అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుందన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు షాపుల ఎంపిక కొనసాగింది. 59 మద్యం షాపులకు గాను 1413 దరఖాస్తులు వచ్చిన విషయం విదితమే. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ డ్రా పాల్గొన్నారు. అయితే నరాలు తెగే ఉత్కంఠ మధ్య లాటరీ ప్రక్రియ కొనసాగింది. కార్యక్రమంలో నార్త్‌జోన్ డీసీపీ వేణుగోపాల్‌రావు, హన్మకొండ ఏసీపీ మురళీధర్‌రావు, ఎస్సైలు అనుముల శ్రీనివాస్ ,ప్రవీన్, రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
80లో పది..
రిటైల్ మద్యం షాపులను దక్కించుకునేందుకు వరంగల్‌కు చెందిన ఆరుగురు మిత్రులు సిండికేట్‌గా ఏర్పడి 80 దరఖాస్తులను సమర్పించి బరిలో నివలగా శుక్రవారం ఏర్పాటు చేసిన లాటరీ పద్ధతిలో 10 మద్యం షాపులను దక్కించుకున్నారు.
మంజీరా వైన్స్‌ను దక్కించుకున్న వెల్ది శ్రీధర్
జిల్లాలోని 59 రిటైల్ మద్యం షాపులలో హన్మకొండలోని పాత బస్ డిపో వద్దగల మంజీరా వైన్స్‌కు అత్యధికంగా 85 దరఖాస్తులు రాగా వరంగల్‌కు చెందిన వెల్ది శ్రీధర్ దక్కించుకున్నాడు. అలాగే వేలేరులోని వైన్స్‌షాపుకు 72 దరఖాస్తులు రాగా వటిపల్లి యాదగిరి, 61 దరఖాస్తులు వచ్చిన హన్మకొండలోని అదాలత్ సెంటర్‌లోని సంపూర్ణ తెలంగాణ వైన్స్‌ను ఆర్.సురేష్‌బాబు దక్కించుకున్నాడు.