హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్న డీసీపీ మల్లారెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్: కట్టుకున్న భర్తను కర్కశంగా, అతికిరాతకంగా తలవెనుక భాగాన భార్య రాడ్డుతో కొట్టి దారుణంగా చంపిన సంఘటన మండలంలోని శివునిపల్లి శివారులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, సీఐ రావుల నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన రాయపురం ధర్మయ్య(56) రైల్వేలో గ్యాంగ్‌మన్ (మొకద్దం)గా పనిచేస్తున్నాడు. ధర్మయ్యకు ఇద్దరు భార్యలు. మొదట శాంతమ్మను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే భార్య, భర్తల మధ్య మనస్పర్థలు, గొడవల కారణంతో దాదాపు 20 ఏళ్ల క్రితం ఆమెను వదిలి వెంకటలక్ష్మీని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యతో కలిసి ధర్మయ్య స్థానిక రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. అతని రెండో భార్యకు ఇద్దరు కొడుకులు. అయితే ఇద్దరు భార్యల పిల్లలు, ధర్మయ్య రెండో భార్య వెంకటలక్ష్మీ ధర్మయ్యతో స్థానిక రైల్వే క్వార్టర్స్‌లోనే ఉంటారు. మొదటి భార్య శాంతమ్మ శివునిపల్లి శివారులో పాత హరికృష్ణ థియేటర్ సమీప కాలనీలో ఒంటరిగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె శివునిపల్లి మూడో వార్డు సభ్యురాలిగా పనిచేస్తుంది.
మొదటి భార్యకు మెయింటనెన్స్ కింద ప్రతీ నెల రూ.10 వేలు ధర్మయ్య వేతనం నుంచి వస్తాయి. కాగా ధర్మయ్య కుమార్తె స్వప్న 2012 సెప్టెంబర్ 12న ఘన్‌పూర్‌కు చెందిన ముదిరాజ్ కులస్తుడు శ్రీనివాస్‌ను ప్రేమవివాహం చేసుకుంది. శ్రీనివాస్ ఛత్తీస్‌గడ్‌లో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం సాఫీగా సాగిన వారి దాంపత్య జీవితంలో గొడవలు ప్రారంభమయ్యాయి. స్వప్నతో మనస్పర్థలు రావడంతో శ్రీనివాస్ ఆమెను కాపురానికి తీసుకెళ్లడం లేదు. ఈ క్రమంలో పలుమార్లు కుల పెద్దలతో పంచాయితీలు అయ్యాయి. అయితే పంచాయితీలకు స్వప్న తల్లి అయిన ధర్మయ్య మొదటి భార్య ఎందుకు రావడం లేదని శ్రీనివాస్ పదే పదే అడుగుతుండగా పంచాయితీలు వాయిదా పడేవి. తిరిగి ఆదివారం (ఈనెల 22న) పంచాయతీ నిర్వహించారు.
తిరిగి బుధవారానికి పంచాయితీని వాయిదా వేశారు. అయితే పంచాయతీ అనంతరం ధర్మయ్య మద్యం సేవించాడు. రాత్రి రైల్వేక్వార్టర్స్‌లోని రెండో భార్య ఇంటికి కాకుండా మొదటి భార్య శాంతమ్మ ఇంటికి వెళ్లాడు. అతని వెంట మద్యం, బీరు బాటిళ్లు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి భార్యాభర్తలు మద్యం సేవించారని, రాత్రి మాటమాట పెరిగి గొడవ పడినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఆమె రాడ్డుతో అతని తల వెనుక భాగాన రెండు చోట్ల గట్టిగా కొట్టడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా హంతకురాలు పోలీసుస్టేషన్‌లో లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ రావుల నరేందర్, ఎస్సైలు రవి, విద్యాసాగర్ సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ వెంకటేశ్వబాబు అక్కడకు చేరుకుని హత్య జరిగిన తీరుపై విచారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
డీసీపీ విచారణ
ఈ ఘటనపై స్థానిక ఏసీపీ కార్యాలయంలో డీసీపీ మల్లారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. హత్య ఘటనపై ధర్మయ్య రెండో భార్య వెంకటలక్ష్మీ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. కుటుంబ కలహాలు, మద్యం మత్తుతో మొదటి భార్య హత్య చేసిందని నిర్ధారించినట్లు తెలిపారు. అయితే ఈ హత్య ఆమె ఒక్కతే చేసిందా, లేదా ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా శివునిపల్లిలో హత్య జరిగిన సంఘటన గ్రామంలో కలకలంరేపింది. గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment