రేపల్లె/నిజాంపట్నం : నిజాంపట్నం మండలం ఆముదాలపల్లి పంచాయతీ చింతరేవులో 15.13 ఎకరాల అటవీశాఖ భూమిని అధికార టీడీపీ నాయకులు ఆక్రమించుకున్న ఉదంతంపై ‘సాక్షి’ లో ‘దేశం’దురాక్రమణ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనం స్థానికంగా సంచలనం కలిగించింది. 15.13 ఎకరాల అటవీశాఖ భూమికి టీడీపీ నాయకులు పట్టాలు సంపాదించిన గుట్టురట్టయిన సంగతి తెలిసిందే. సాక్షి కథనంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల తహశీల్దారు మోహన్‌కృష్ణ అటవీశాఖ ఆధీనంలోని సర్వే నంబరు 583 భూ వివరాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అటవీ భూముల వివరాలపై విచారణ నిర్వహించారు.
గతంలో పనిచేసిన తహశీల్దారు రవికుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరణ తీసుకున్నారు. రేపల్లె ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి అటవీభూములకు పట్టాలు పొందిన అంశంపై చర్చించడం, వారి నుంచి నివేదికను కోరారు. అటవీ భూముల పట్టాలు పొందిన అంశంపై రెవెన్యూ అధికార యంత్రాంగం రికార్డుల తనిఖీల్లో నిమగ్నమైంది. టీడీపీ నాయకులు పట్టాలు పొందిన భూమి అటవీ శాఖదేనని తేల్చేశారు. ఈ సందర్భంగా మోహనకృష్ణ ‘సాక్షి’తో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు చెప్పారు.
అటవీశాఖ భూమికి పట్టాలు జారీచేసిన విషయంపై పూర్తిస్థాయిలో విచారించే నిమిత్తం ముందుగా రికార్డులను పరిశీలించామని, సంబంధిత భూములను గురువారం రెవెన్యూ అధికారులు పరిశీలించనున్నట్లు తెలిపారు. అటవీశాఖ భూమిని పంపిణీచేసే అధికారం ఎవరికి లేదని, పట్టాలను రద్దుచేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. పట్టాలు పొందిన వారిని విచారించి వివరాలు తీసుకోవాల్సి ఉందన్నారు. రెండురోజుల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందించేందుకు తహశీల్దారు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
అధికారవర్గాల్లో ఆందోళన..
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలంటూ వస్తున్న ఒత్తిళ్లతో చేసేదిలేక ఎక్కడపడితే అక్కడ సంతకాలు చేయాల్సిన దుస్థితి వస్తోందని అధికారవర్గాల్లో ఆందోళన మొదలయ్యింది. చేసే అవినీతి పనుల్లో తమను భాగస్వాములను చేస్తున్నారనే గుసగుసలు మొదలయ్యాయి.
అవినీతి కార్యక్రమాలు బయటపడుతున్న సమయంలో నెపం మొత్తం తమపై నెట్టి నాయకులు తప్పించుకుంటున్నారని అధికారులు ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. టీడీపీ పాలకులు, నాయకులు అడ్డగోలు వ్యవహారల్లో తలదూరిస్తే నష్టం వాటిల్లక తప్పదని అటువంటి అడ్డగోలు వ్యవహారాలకు దూరంగా ఉండాలని లేకుంటే నియోజకవర్గం నుంచి అయినా ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వెళ్లిపోవాలని పలువురు అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ నాయకుల దురాగతాలకు అడ్డూఅదుపు లేకుడా పోతోందనే ఆరోపణలు వినవస్తున్నాయి.
కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
Published Thu, Dec 4 2014 2:26 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement