అడవి బిడ్డల అరణ్య రోదన | Madanapalle Agency People Suffering With Transport System | Sakshi
Sakshi News home page

అడవి బిడ్డల అరణ్య రోదన

Published Wed, Mar 27 2019 11:28 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Madanapalle Agency People Suffering With Transport System - Sakshi

పూరిపాకలే దిక్కాయే..పోతపోలుగ్రామం వలసమూలలో దర్శనమిస్తున్న పూరిల్లు

ఎవరిని తప్పుపట్టగలం.. ఎవరిని నిందించగలం..70 ఏళ్ల స్వతంత్ర భారతంలో సాధిం చింది ఏదైనా ఉందంటే.. పాలించిన పాలకులకు, అధికారులకే తెలియాలి. అన్నీ సాధించామని జబ్బలు చరుచుకుంటున్న పాలకులు, అధికారులు ఒక్కసారి ఆ గిరిజన, అడవిబిడ్డల బతుకులు చూస్తే తెలుస్తుంది. మారుమూలన ఉండే ఆ కుగ్రామాల వైపు వెళ్లుంటే తెలుస్తుంది ఏం సాధించామని ? ఇప్పటికీ అడవి బిడ్డలకు సంక్షేమం అంటే తెలియదు. రోగమొస్తే ఆస్పత్రికి వెళ్లే అవకాశం లేక నాటువైద్యం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ దుస్థితి ఎక్కడో కాదు. దేశంలో నే అతి పెద్ద రెవెన్యూ డివిజన్‌గా పేరుగాంచిన మదనపల్లె మండలంలో..

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె మండలంలో మొత్తం 16 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 384 చిన్న చిన్న పల్లెలు ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2.92 లక్షలకుపైగా జనాభా ఉంది. మదనపల్లె చుట్టూవున్న పల్లెల్లో చాలా వరకు రోడ్డు మార్గం కూడా లేక అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా చీకలబైలు దగ్గరున్న దొనబైలు, మేడిపల్లె, ఎగువమిట్టామర్రి, దిగువ మిట్టా మర్రి, పనసమాకులపల్లె, జోలపాళ్యం, వేంపల్లె సమీపంలోని కొండమీదపల్లె తండా, జంగాలపల్లె, మాలేపాడు దొనబైలు, పచ్చార్లపల్లె, ఆవులపల్లె, క్రిష్ణాపురం, నలరాజుగారిపల్లె నేటికీ రోడ్డు సౌకర్యం లేదు. ఆవులపల్లె 30 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దున అడవుల్లోని మాలేపాడులో ఉంది.

వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామానికి చేరుకోవాలంటే మదనపల్లె నుంచి రామసముద్రం మండలం చెంబకూరుకు బస్సులో వెళ్లాలి. అక్కడి నుంచి 12 కిలోమీటర్లు నడిస్తే గ్రామానికి చేరుకోవచ్చు. ప్రజలు పండించిన పంటలను పట్టణాలకు తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లే దిక్కు. అదేవిధంగా బెంగళూరు రోడ్డులోని చీకలబైలు గ్రామంలో ఎగవ దొనబైలు ఎత్తైన కొండల్లో ఉంది. 200 కుటుంబాల ప్రజలు గొర్రెలు, మేకలు, పశువులను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం లేదు. కాలినడకన 7 కిలోమీటర్లు కొండదిగి చీకలబైలుకు రావాలి. ఇదే గ్రామంలోనే  మేడిపల్లె, జోళపాళెం ఉంది. ఈ పల్లెలకు బస్సు మార్గం లేదు. ఏదైనా రోగం వస్తే జోలి కట్టాల్సిందే. ఇక పొన్నేటిపాళ్యం, కోళ్లబైలు, ఎగువ కొండామర్రి, మేకలవారిపల్లె ఇలా చెప్పుకుంటూ పోతే 300లకు పైగా పల్లెలకు బస్సు సౌకర్యమే లేదు. ఇక్కడి జనం తూనికాకు, సీతాఫలాలు, అల్లనేరేడు, కలప అమ్ముకుని రోజుకు రూ.50 సంపాదించుకుంటున్నట్టు అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు.

బస్సులు లేక ఆటోలో వేలాడుతూ వస్తున్న మేడిపల్లె ప్రజలు
’మాలేడు పంచాయతి ఆవులపల్లె సమీపంలోని కృష్ణాపురానికి చెందినరమణ కుమారుడు తేజ(11) స్కూలుకు వెళ్లి వస్తుండగా పాముకాటుకుగురయ్యాడు. రోడ్డు, బస్సు సౌకర్యం లేకపోవడంతో బాలుడిని ద్విచక్రవాహనంలో వ్యయప్రయాసలకు ఓర్చి మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఒక్కగానొక్క బిడ్డచనిపోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. ఇది ఒక్క కృష్ణాపురమే కాదు అడవి తల్లి ఒడిలో ఉన్న అనేక కుగ్రామాల ప్రజలు నిత్యం అనుభవిస్తున్నదయనీయ పరిస్థితి.

రోడ్డులేక అల్లాడుతున్నాం
ఎగువదొనబైలుకు మాతాతల ముత్తాల కాలం నుంచి రోడ్డు లేదు. అడవి మార్గం గుండా కాలినడక సాగిస్తున్నాం. ఏదైనా అత్యవసరమైతే ఇక అంతే. ఇప్పుడు పురుగుల మందులు కొట్టిన ఆహార పదార్థాలు తింటుండడంతో రోగాలు అధికంగా వస్తున్నాయి. నాటు వైద్యంతో రోగాలు తగ్గడం లేదు. రోడ్లు ఉంటే ఆస్పత్రులకు ఏదోలా రాగలం.     – వెంకటప్ప, దొనబైలు, మదనపల్లె

నాటువైద్యంతో సరిపెట్టుకుంటున్నాం
ఎలాంటి జబ్బుచేసినా ఆస్పత్రికి వెళ్లాలంటే కష్టంగా ఉంటోంది. నాటు వైద్యంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రోడ్లు, బస్సు సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నాం. ఎంతమంది నాయకులు మారినా ప్రయోజనం లేదు. పంటలు పండించుకున్నా మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు కూడా వీలు కావడం లేదు.– పెద్దన్న, మేడిపల్లె, మదనపల్లె

అభివృద్ధికి నోచుకోలేకున్నాం
నాయకులు, అధికారులు మా గురించి పట్టించుకోవడం లేదు. మేము అభివృద్ధికి నోచుకోలేకున్నాం. పట్టణాలకు ఆనుకుని ఉన్న అన్ని పల్లెల్లో అభివృద్ధి పనులు చేశారు. మా ఖర్మ ఏమో మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. కనీసం రోడ్డు వేయాలని కోరినా వేయడం లేదు. పూరి గుడిసెల్లోనే కాలం వెల్లదీస్తున్నాం.– సుధాకర్, బొంతలవారిపల్లె, మదనపల్లె

మాకు చదువుల తల్లి వంట పట్టదు
మారుమూల కుగ్రామాల్లో ఐదవ తరగతి వరకే పాఠశాలలు ఉన్నాయి. ఆపై ఉన్నత చదువులు చదవడానికి అడవిగుండా గంటల ప్రయాణం చేయాలి. వర్షాకాలంలో రోడ్లు బురదమయమై ఉంటాయి. అక్కడక్కడా మోకాళ్లలోతు నీరు ఉండడంతో చిన్నపిల్లలు స్కూళ్లకు వెళ్లడానికి నిరాకరిస్తారు. రాత్రి వేళ విద్యుత్‌ సౌకర్యం అంతంతమాత్రమే. అందుకే మా పిల్లలకు ఉన్నత చదువులు లేకుండా పోతున్నాయి. నాలుగేళ్ల క్రితం నాకూతుర్ని చదువుమాన్పించేశాను.     – రాజమ్మ, నలరాజుగారిపల్లె, మదనపల్లె

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement