
ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికలలో మాగుంట గెలుపు
ప్రకాశం: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి మాగుంట శ్రీవాసులురెడ్డి విజయం సాధించారు. 711 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా మాగుంట ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి అట్ల చినవెంకటరెడ్డికి 13 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా చెల్లని ఓట్లు 17 అని అధికారులు తెలిపారు.
ఇదిలాఉండగా ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను వైఎస్ఆర్సీపీ బహిష్కరించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అవసరమైన మెజారిటీ లేకపోయినా పోటీకి దిగిన టీడీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ నేతలను ప్రలోభాలకు గురిచేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఎంపీటీసీలతో ఇతర రాష్ట్రాల్లో క్యాంపు నిర్వహించడం, దీనిపై అధికార యంత్రాంగం, ఎన్నికల అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. దీంతో ఓటింగ్ ఏకపక్షంగా మారినట్లు తెలుస్తోంది.