
పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సీపీ మహేష్‌చంద్ర లడ్డా
విశాఖ క్రైం: ‘ప్రజలు నన్ను ఎప్పుడైనా కలవొచ్చు. నేరుగా నా వద్దకు రావచ్చు. సమస్యలు చెప్పుకోవచ్చు. అంతేకాదు మీ ప్రాంతాలలో సమస్యలు ఉంటే వాట్సాప్ ద్వారా పంపొచ్చు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై వెంటనే చర్యలు ఉంటాయి’ అని విశాఖ నగర కొత్త పోలీసు కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా అన్నారు. సోమవారం ఉదయం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టి.యోగానంద్‌కు విజయవాడ అదనపు పోలీస్ కమిషనర్‌గా బదిలీ కావడంతో ఆ స్థానంలో లడ్డా నియమితులైన విషయం తెలిసిందే. పోలీస్ కమిషనరేట్‌కు వచ్చిన లడ్డాకు సిబ్బంది గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన ఛాంబర్‌కు వెళ్లి యోగానంద్ నుంచి లాంఛనంగా బాధ్యతలు తీసుకున్నారు. డీసీపీలు డి.నాగేంద్రకుమార్, ఫకీరప్ప, దామోదర్, మహేంద్రపాత్రుడు, రమేష్‌కుమార్, రామ్మోహనరావు, ఏసీపీలు అన్నెపు నర్సింహమూర్తి, కింజరాపు ప్రభాకర్, మూర్తి, రామచంద్రరావు, అర్జున్, చిట్టిబాబు, గోవిందరావు, ఏఆర్ డీసీపీ రామకృష్ణ తో పాటు పలువురు అధికారులు నూతన సీపీకి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖ ప్రశాంత నగరం
పోలీసు కమిషనరేట్‌లో బాధ్యతలు తీసుకున్న అనంతరం లడ్డా మీడియాతో మాట్లాడారు. ‘దేశంలోనే విశాఖ ప్రశాంత వాతావరణంతో కూడిన నగరం. దేశంలో మంచి గుర్తింపు ఉంది. నగరంలో నేరాలు నియంత్రించేందుకు పూర్తి దృష్టి పెడతా. పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాను. భూ దందాలు చేసేవారు, అరాచక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంటుంది. సీసీ కెమెరాలు, సైబర్ క్రైం, ట్రాఫిక్, లాఅండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టడం జరుగుతుంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారించడానికి చర్యలు తీసుకుంటాను. దీనిపై జీవీఎంసీ వుడా అధికారులతో చర్చిస్తాను. వారి సహకారంతో సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. క్రిమినల్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాం. తేడావస్తే కఠిన చర్యలు ఉంటాయి. నగరంలో గత రెండేళ్లుగా వ్యాపార, వాణిజ్య పరంగా వృద్ధి సాధిస్తోంది. దానిని దృష్టిలో పెట్టుకుని లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా చూస్తాను. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి. అందుకు అన్ని విధాలుగా కృషి చేస్తాను. భూదందాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు. ఇది నా హెచ్చరిక. సీసీ కెమెరాలు, బీట్స్, నేరాల అదుపునకు ప్రత్యేక టెక్నాలజీ రూపొందించడం జరుగుతుంది’ అని లడ్డా చెప్పారు.
చింతపల్లి ఏఎస్‌పీగా పనిచేశా
నేను మొదట చింతపల్లి ఏఎస్‌పీగా పనిచేశాను. అదే నా మొదటి పోస్టింగ్. అప్పటి నుంచి జిల్లాతో అనుబంధం ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ లక్ష్యంగా పనిచేస్తా. ఒంగోలులో విధులు నిర్వహిస్తున్న సమయంలో నా వాహనానికి ల్యాండ్ మైన్ పెట్టి పేల్చేశారు. దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశీస్సులతో బతికి బయటపడ్డాను. కానీ ముగ్గురు సిబ్బంది చనిపోయారు. అది నాకు చాలా బాధ కలిగించింది అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment