- ఎమ్మెల్సీ రేసులో తెలుగు తమ్ముళ్లు
- ఎస్టీ కోటాలో మణికుమారి పేరు ఖరారు!
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు శని వారం లేక్‌వ్యూ అతిథి గృహానికి క్యూ కట్టారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ అక్కడ ఉన్న పార్టీ అధినేత, సీఎం చంద్రబాబును కలసి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాల్సిందిగా కోరారు.
బాబును కలసిన వారిలో శాసనమండలిలో చీఫ్‌విప్ న న్నపనేని రాజకుమారి, మాజీ మంత్రులు ఎన్‌ఎండీ ఫారూఖ్, జేఆర్ పుష్పరాజ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ షరీఫ్, మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాందువ్వ శ్రీను (మంతెన వెంకట సత్యనారాయణ రాజు), పార్టీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ తదితరులున్నారు. వీరందరూ ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీ లించాల్సిందిగా కోరారు.
గతంలో తమకు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా బాబుకు గుర్తుచేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్న జూపూడి ప్రభాకరరావును తిరిగి అదే కోటాలో నామినేట్ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలో చేరి, ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయి.. మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ పదవీ కాలం ముగుస్తుందనగా టీడీపీలో చేరిన వ్యక్తికి ఎలా అవకాశం కల్పిస్తారని పలువురు ఆశావహులు సీనియర్ల ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు అనేక మంది పార్టీలో ఎంతోకాలంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు. కాగా, ఎస్టీ కోటాలో మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి పేరును ఖరారు చేసి ఆమెకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
అయితే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైనారిటీలకు చాన్స్ దక్కడం కొంచెం కష్టమే. గవర్నర్ కోటాతో కలుపుకొని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఇపు డు టీడీపీకి దక్కే అవకాశం ఉంది. ఆ సమయంలో మైనారిటీకి అవకాశం కల్పించాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో టీడీపీ 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండగా ఇప్పటికే వీవీవీ చౌదరి పేరు ఖరారు చేశారు. గత ఎన్నికల్లో తమ విజయానికి కృషి చేసిన వారికి టికెట్లు ఇవ్వాలని పలువురు మంత్రులు సీఎంను కలసి కోరారు.