=కట్నం రూ.20 లక్షలు తేవాలంటూ భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు
=తేకుంటే వ్యభిచారం కేసు కింద అరెస్టు చేయిస్తానని బెదిరింపు
=కేసు పెట్టి, ఎస్పీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఓ మహిళ వేడుకోలు
తిరుపతి, న్యూస్‌లైన్ : ‘మెడలోంచి తాళి బొట్టు తీసేయ్.. నీవు విధవగా ఉంటేనే బాగుంటావు’ అంటూ తాళికట్టిన భర్త చిత్ర హింసలు పెడుతున్నాడని ఓ మహిళ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే ఆమె శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఐద్వా నాయకురాలు లక్ష్మి, సాయిలక్ష్మితో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
ఆ వివరాలు ఆమె మాటల్లో.. మాది కడప జిల్లా, నందలూరు. నాన్న ఏఎస్‌ఐగా ఉద్యోగ విరమణ పొందారు. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా. ప్రస్తుతం తిరుపతి స్పెషల్ బ్రాంచిలో ఎస్‌ఐగా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌తో 2012లో నాకు వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం తరచూ వేధించేవాడు. ‘రూ.60 లక్షలు కట్నం ఇస్తామన్న సంబంధం వచ్చినా నిన్ను చేసుకుని తప్పు చేశాను, మీనాన్న రూ.4 లక్షలు ఇచ్చి నిన్ను వదిలించుకున్నాడు, నల్లపూసల దండ, గాజులు తీపించుకో, లేదా వాటికి సరపడా డబ్బులు తీసుకురా’ అంటూ అసభ్యకరంగా వేధిస్తున్నాడు.
నా రెండు ఏటీఎంలను లాక్కుని రూ.44 వేలు వాడుకున్నాడు. ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే వీధి చివరకు రమ్మనే వాడు. నన్ను పుట్టింటికి పంపించి మరో యువతితో తిరుమలలో ఉండేవాడు. ఆడబిడ్డ పుట్టిందని నానా దుర్భాషలాడాడు. మా అత్త నన్ను కొట్టి నా భర్తను తీసుకెళ్లిపోయింది. ఈ విషయమై గత మార్చి 23వ తేదీన స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ విమలకుమారికి ఫిర్యాదు చేస్తే మా ఇద్దరికి కౌన్సిలింగ్ చేశారు.
అయినా నా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. అతని తమ్ముడు మరి కొందరితో కలిసి టీటీడీ క్వార్టర్స్‌లో ఉన్న మా ఇంటిపై దౌర్జన్యం చేశారు. ఇంటి తలుపు బద్దలుకొట్టి రూ.82 వేల విలువైన వస్తువులను దొంగిలించారు. దీనిపై క్రైమ్ సీఐ వెంకటరవికి ఫిర్యాదు చేశాను. పైగా మా ఇద్దరికీ కౌన్సిలింగ్ చేసి వేరే చోట కాపురం ఉండేలా సీఐ ఒప్పించారు. ఎన్నిసార్లు అడిగినా నా భర్త ఇంటికి తీసుకెళ్లలేదు.
గత జూలై 19న నా కూతుర్ని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. కట్నం తేకుంటే పాపను తొట్టిలో వేసి చంపేస్తానని, లేకుంటే విడాకులు ఇవ్వాలని బెదిరించాడు. ఆఖరికి నేను పనిచేస్తున్న కార్యాలయం వద్దకు వచ్చి అసభ్యకరంగా మాట్లాడాడు. విడాకులు ఇవ్వకుంటే నిన్ను వ్యభిచారం కేసు కింద అరెస్టు చేయిస్తానని బెదిరించాడు. ఈ ఘటనపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశా. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు.