Sai Lakshmi
-
ఎంత ఖర్చయినా వైద్యం చేయించండి: సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారి సాయిలక్ష్మీచంద్రకు ప్రభుత్వం పూర్తివైద్యం చేయిస్తుందని ఆమె తల్లి ఆరుద్రకు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన శుక్రవారం కాకినాడకు చెందిన రాజులపూడి ఆరుద్రతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. అనారోగ్యానికి గురైన తన కుమార్తెను ఆదుకోవాలంటూ రెండురోజుల కిందట ఆరుద్ర సీఎం కార్యాలయానికి విన్నవించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ పరామర్శించి వివరాలు తెలుసుకుని సీఎంకు నివేదించారు. దీంతో మరోసారి ఆమెతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని సీఎం జగన్ తన కార్యదర్శి ధనుంజయరెడ్డిని ఆదేశించారు. కలెక్టర్ డిల్లీరావు స్వయంగా ఆరుద్రను సీఎం కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయిలక్ష్మీచంద్ర వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని, ఈమేరకు సీఎం ఆదేశాలు జారీచేశారని ధనుంజయరెడ్డి ఆమెకు వివరించారు. జీవనోపాధి కోసం ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి.. ఆమె సమక్షంలోనే కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. స్థిరాస్తిని అమ్ముకునే క్రమంలోను ఎవరైనా ఇబ్బందిపెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీకి సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని, నిరాశకు గురికావద్దని ధైర్యం చెప్పారు. అనంతరం ఆరుద్ర మాట్లాడుతూ తనలాంటి నిస్సహాయులకు సీఎం అండగా నిలుస్తారనే ధైర్యం, నమ్మకంతోనే ఇక్కడికి వచ్చానన్నారు. తన కుమార్తెకు వైద్యం చేయించడంతోపాటు తనకు ఉద్యోగం ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రెండురోజులుగా అధికారులు ఎప్పటికప్పుడు తన యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. -
సమగ్ర యాజమాన్య పద్ధతులతో దిగుబడులు మెండు
చాగల్లు : వరి సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి అన్నారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని మల్లవరం, చంద్రవరం గ్రామాల్లో మంగళవారం జరిగిన రైతు సదస్సుల్లో ఆమె మాట్లాడారు. రైతులు ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, కాంప్లెక్స్ ఎరువుల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు ఈపాస్ యంత్రాల ద్వారా ఎరువులు విక్రయిస్తారని, దీనిలో భాగంగా చాగల్లు మండలానికి 19 యంత్రాలు అందించామన్నారు. వ్యవసాయశాఖ ఏడీ∙ఎస్జెవిజే రామోహన్‌రావు మాట్లాడుతూ కలుపు నివారణ, నీటి యాజమాన్యం, తెగుళ్లనివారణ సకాలంలో చేపట్టడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. మండల వ్యవసాయ అధికారి కె.ఏసుబాబు మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఎంటీయూ 1121 వరి వంగడాలను పరిశీలించారు. అధికారులు ఎన్.శ్రీనివాస్, కె.వాణిసర్వశ్రీ పాల్గొన్నారు -
అండర్–19 క్రికెట్‌కు జిల్లా విద్యార్థిని
లింగసముద్రం: ఇటీవల అనంతపురంలో జరిగిన బాలికల అండర్–19 క్రికెట్ పోటీల్లో పెదపవని భళేరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సజ్జ సాయిలక్ష్మి విశేష ప్రతిభ కనపరిచి సౌత్‌జోన్ జట్టుకు ఎంపికైనట్లు హెచ్ఎం యు. మాధవరావు తెలిపారు. ఈ నెల 27 నుంచి విజయనగరంలో జరిగే అండర్–19 రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నట్లు చెప్పారు. -
'జగనన్నకు అండగా నిలుద్దాం'
కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే మనకు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని జగ్గంపేటకు చెందిన విద్యార్థిని సాయిలక్ష్మీ స్పష్టం చేశారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని అంబేద్కర్ ఆడిటోరియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదాపై యువభేరీ పేరిట విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలక్ష్మీ మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా తప్పకుండా రావాలని ఆమె ఆకాంక్షించారు. ప్రత్యేక హోదా కోసం మన తరఫున పోరాడుతున్న జగనన్నకు అండగా నిలుద్దామని ఈ సందర్భంగా ప్రజలకు సాయిలక్ష్మీ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా దక్కే వరకు వెనకడుగు వేయొద్దు అంటూ ప్రజలకు సాయిలక్ష్మీ సూచించారు. -
భర్త నుంచి రక్షణ కల్పించండి
=కట్నం రూ.20 లక్షలు తేవాలంటూ భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు =తేకుంటే వ్యభిచారం కేసు కింద అరెస్టు చేయిస్తానని బెదిరింపు =కేసు పెట్టి, ఎస్పీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఓ మహిళ వేడుకోలు తిరుపతి, న్యూస్‌లైన్ : ‘మెడలోంచి తాళి బొట్టు తీసేయ్.. నీవు విధవగా ఉంటేనే బాగుంటావు’ అంటూ తాళికట్టిన భర్త చిత్ర హింసలు పెడుతున్నాడని ఓ మహిళ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే ఆమె శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఐద్వా నాయకురాలు లక్ష్మి, సాయిలక్ష్మితో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లో.. మాది కడప జిల్లా, నందలూరు. నాన్న ఏఎస్ఐగా ఉద్యోగ విరమణ పొందారు. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా. ప్రస్తుతం తిరుపతి స్పెషల్ బ్రాంచిలో ఎస్ఐగా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌తో 2012లో నాకు వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం తరచూ వేధించేవాడు. ‘రూ.60 లక్షలు కట్నం ఇస్తామన్న సంబంధం వచ్చినా నిన్ను చేసుకుని తప్పు చేశాను, మీనాన్న రూ.4 లక్షలు ఇచ్చి నిన్ను వదిలించుకున్నాడు, నల్లపూసల దండ, గాజులు తీపించుకో, లేదా వాటికి సరపడా డబ్బులు తీసుకురా’ అంటూ అసభ్యకరంగా వేధిస్తున్నాడు. నా రెండు ఏటీఎంలను లాక్కుని రూ.44 వేలు వాడుకున్నాడు. ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే వీధి చివరకు రమ్మనే వాడు. నన్ను పుట్టింటికి పంపించి మరో యువతితో తిరుమలలో ఉండేవాడు. ఆడబిడ్డ పుట్టిందని నానా దుర్భాషలాడాడు. మా అత్త నన్ను కొట్టి నా భర్తను తీసుకెళ్లిపోయింది. ఈ విషయమై గత మార్చి 23వ తేదీన స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ విమలకుమారికి ఫిర్యాదు చేస్తే మా ఇద్దరికి కౌన్సిలింగ్ చేశారు. అయినా నా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. అతని తమ్ముడు మరి కొందరితో కలిసి టీటీడీ క్వార్టర్స్‌లో ఉన్న మా ఇంటిపై దౌర్జన్యం చేశారు. ఇంటి తలుపు బద్దలుకొట్టి రూ.82 వేల విలువైన వస్తువులను దొంగిలించారు. దీనిపై క్రైమ్ సీఐ వెంకటరవికి ఫిర్యాదు చేశాను. పైగా మా ఇద్దరికీ కౌన్సిలింగ్ చేసి వేరే చోట కాపురం ఉండేలా సీఐ ఒప్పించారు. ఎన్నిసార్లు అడిగినా నా భర్త ఇంటికి తీసుకెళ్లలేదు. గత జూలై 19న నా కూతుర్ని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. కట్నం తేకుంటే పాపను తొట్టిలో వేసి చంపేస్తానని, లేకుంటే విడాకులు ఇవ్వాలని బెదిరించాడు. ఆఖరికి నేను పనిచేస్తున్న కార్యాలయం వద్దకు వచ్చి అసభ్యకరంగా మాట్లాడాడు. విడాకులు ఇవ్వకుంటే నిన్ను వ్యభిచారం కేసు కింద అరెస్టు చేయిస్తానని బెదిరించాడు. ఈ ఘటనపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశా. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు.