ఎంత ఖర్చయినా వైద్యం చేయించండి: సీఎం జగన్‌ ఆదేశం | AP Government Assurance to Sailakshmi Chandra Treatment | Sakshi

ఎంత ఖర్చయినా వైద్యం చేయించండి: సీఎం జగన్‌ ఆదేశం

Nov 5 2022 9:15 AM | Updated on Nov 5 2022 9:22 AM

AP Government Assurance to Sailakshmi Chandra Treatment - Sakshi

సీఎం క్యాంపు కార్యాలయంలో ఆరుద్రతో మాట్లాడుతున్న ధనుంజయరెడ్డి, పక్కన డిల్లీరావు 

సాక్షి, అమరావతి: వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారి సాయిలక్ష్మీచంద్రకు ప్రభుత్వం పూర్తివైద్యం చేయిస్తుందని ఆమె తల్లి ఆరుద్రకు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన శుక్రవారం కాకినాడకు చెందిన రాజులపూడి ఆరుద్రతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. అనారోగ్యానికి గురైన తన కుమార్తెను ఆదుకోవాలంటూ రెండురోజుల కిందట ఆరుద్ర సీఎం కార్యాలయానికి విన్నవించారు.

ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ పరామర్శించి వివరాలు తెలుసుకుని సీఎంకు నివేదించారు. దీంతో మరోసారి ఆమెతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని సీఎం జగన్‌ తన కార్యదర్శి ధనుంజయరెడ్డిని ఆదేశించారు. కలెక్టర్‌ డిల్లీరావు స్వయంగా ఆరుద్రను సీఎం కార్యాలయానికి తీసుకొచ్చారు.

సాయిలక్ష్మీచంద్ర వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని, ఈమేరకు సీఎం ఆదేశాలు జారీచేశారని ధనుంజయరెడ్డి ఆమెకు వివరించారు. జీవనోపాధి కోసం ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి.. ఆమె సమక్షంలోనే కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. స్థిరాస్తిని అమ్ముకునే క్రమంలోను ఎవరైనా ఇబ్బందిపెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీకి సూచించారు.

ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని, నిరాశకు గురికావద్దని ధైర్యం చెప్పారు. అనంతరం ఆరుద్ర మాట్లాడుతూ తనలాంటి నిస్సహాయులకు సీఎం అండగా నిలుస్తారనే ధైర్యం, నమ్మకంతోనే ఇక్కడికి వచ్చానన్నారు. తన కుమార్తెకు వైద్యం చేయించడంతోపాటు తనకు ఉద్యోగం ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రెండురోజులుగా అధికారులు ఎప్పటికప్పుడు తన యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement