
సమరభేరి నేడే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లా పార్టీ నేతలు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏ ప్రభుత్వంపైనైనా సాధారణంగా ఏడాదికో, రెండేళ్లు దాటిన తర్వాతో ప్రజల నుంచి నిరసనలు రావడం సహజం. అయితే ఏపీలో చంద్రబాబు బూటకపు ప్రకటనలపై ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెళ్లకే విసుగెత్తిపోయారు.
దీంతో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ప్రజలను ఓదార్చేందుకు, భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్ సీపీ నేడు సమరశంఖం పూరించనుంది. ప్రజలకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు సిద్ధమైంది. ఎన్నికల హామీని గాలికొదిలేసిన నేతల్ని నిలదీసేందుకు అంతా తరలిరావాలని జిల్లా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డే స్వయంగా విశాఖ ధర్నాలో పాల్గొనేందుకు వస్తుండడంతో ఈ ప్రాంతంలోనూ ఆయన స్ఫూర్తితో భారీగా నిరసన వ్యక్తం చేసేందుకు అంతా సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్త వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొంటారని, ప్రజల కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని రెడ్డి శాంతి పిలుపునిచ్చారు.
ఇదీ ‘మహా ధర్నా’ షెడ్యూలు
శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు తరలివస్తారు. చంద్రబాబు మోసపూరిత హామీలు, ప్రస్తుత పరిస్థితిని ముఖ్య నాయకులు ప్రజలకు వివరిస్తారు. మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలతో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక కార్యక్రమాలపై చర్చా కార్యక్రమం ఉం టుంది. రెండు వేల ప్లకార్డులతో ఆందోళన, కేజీ బియ్యం రూపారుు, కిలో ఇసుక మాత్రం రూ.2 అంటూ పెరిగిన ఇసుక ధరల్ని ప్రస్తావిస్తూ ప్రత్యేక ఇసుక దుకాణం ఏర్పాటు చేస్తారు. ఇటుక, టైర్లు, నాటు బళ్లతో మధ్యాహ్నం 1గంట వరకు వివిధ రకాలగా ఆందోళన కార్యక్రమాలుంటాయి. కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్‌కు ప్రజల మద్దతుతో.. వైఎస్సార్‌సీపీ తరఫున ఓ వినతిపత్రాన్ని సమర్పిస్తారు.
హామీలు గాలికొదిలేశారు
ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ భృతి.. డ్వాక్రాసంఘాలకు సహా రైతులకు రుణమాఫీ, 24 గంటల విద్యుత్ సరఫరా, హెల్త్‌కార్డులు, ఎన్టీఆర్ సుజల స్రవంతి, పరిశ్రమల ఏర్పాటు, బెల్ట్‌దుకాణాల రద్దు.. అంటూ తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనెక్కి అనంతరం ప్రజల బాధల్ని గాలికొదిలేసింది. ఆరునెలలవుతోంది. హామీల ఊసే వదిలేశారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. తనకన్నీ తెలుసని చెప్పిన బాబు ఇప్పుడు ప్లేటు మార్చేశారు. ఎన్నికల తర్వాత ఐదేళ్ల వరకూ ప్రజలతో పనిలేదనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిని వైఎస్సార్ సీపీ ఖండిస్తోంది. ప్రజల మద్దతుతో శుక్రవారం కలెక్టరేట్ వద్ద బాబు ప్రభుత్వానికి బుద్ధొచ్చేలా, భారీ ఆందోళన చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాలనుంచీ ఇప్పటికే మద్దతు లభిస్తోంది.
-రెడ్డి శాంతి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ముందే విజయవంతం
జగన్ ధర్నాకు పిలుపునివ్వడంతో ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. ధర్నా భయంతోనే రుణమాఫీపై బాబు ఓ అరకొర ప్రకటనిచ్చేశారు. దీంతో ధర్నా, ఆందోళన కార్యాక్రమాలు ముందే విజయవంతమైనట్టయింది. వైఎస్సార్ సీపీ ధర్నాలపై ప్రజల్లోనూ చర్చ మొదలైంది. ఐదు సంతకాలంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఎన్నికల తర్వాత ప్రజల్ని మోసగించాలని ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాటి ఆందోళనకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వ్యవసాయదారులు, ఇసుక కూలీలు, ఆదర్శరైతులు, తాపీమేస్త్రీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సగంలో ఇళ్లు ఆగిపోయిన లబ్ధిదారులు, తుపాను బాధితులు, మహిళలు, పింఛను బాధితులు తదితర అన్నివర్గాలవారూ మనం కూడా వెళ్దామంటూ వైఎస్సార్‌సీపీకి మద్దతిస్తున్నారు. అన్ని గ్రామాల రైతులు తామే ధర్నాకు తరలివస్తామంటున్నారు. ప్రజల కోసమే ఈ ధర్నా.
- ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి