సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిజాలు నిగ్గు తేల్చాలని అడిగితే సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు సిగ్గుమాలిన ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ ధ్వజమెత్తారు. దుండగుడి హత్యాయత్నంతో గాయపడిన వై.ఎస్.జగన్‌ను కనీసం పరామర్శించాల్సిన ఇంగితజ్ఞానం కూడా ముఖ్యమంత్రికి లేకపోవడం విచారకరమన్నారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ నగర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతపై చంద్రబాబు తీరు చూస్తుంటే రాష్ట్రంలో నరరూప పాలన సాగుతున్నట్టు ఉందంటూ రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో ఈ నెల 25న మధ్యాహ్నం 12.38 గంటలకు ఫ్యూజన్ ఫుడ్ వర్కర్ చేతిలో హత్యాయత్నానికి గురైన జగన్ ప్రథమ చికిత్స అనంతరం ఇండిగో విమానంలో హైదరాబాద్ బయలుదేరారని, ఆయన ఇంకా హైదరాబాదు చేరుకొనేలోపే మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర డీజీపీ ప్రెస్‌మీట్ మెట్టి జగన్ అభిమానే కత్తితో దాడికి పాల్పడ్డారంటూ ప్రకటించడంలో అంతర్థామేమిటని మళ్ల ప్రశ్నించారు. ఆ రోజు సాయంత్రం 4.30 గంటల వరకు హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోనే ఉండగా.. డీజీపీ ఏ ఆధారాలతో మీడియాతో అలా చెప్పారని ఆయన నిలదీశారు. జననేతపై దాడి జరిగిన ప్రాంతం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడంలో పరమార్థం ఏంటో రాష్ట్ర ప్రజలకు స్పష్టమైందన్నారు. ఇదే విషయాన్ని పదేపదే చెబుతూ, ఏకంగా ఢిల్లీకి వెళ్లి తన చేతకాని తనాన్ని బాహటంగా చంద్రబాబు చెప్పుకుని ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారని మండిపడ్డారు. జగన్‌పై హత్యాయత్నం కేసును జ్యూడీషియల్ విచారణకు ఆదేశించి, ఇందులో ఎవరి పాత్ర ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు.
నిందితుడికి ఎన్‌వోసీ ఇప్పించింది ఎవరు?
విమానాశ్రయంలోని ఫ్యూజన్ రెస్టారెంట్‌లో పని చేయడానికి నేర చరిత్ర ఉన్న శ్రీనివాసరావుకు నోఅబ్జెక్షన్ సర్టిఫికేటు(ఎన్‌వోసీ) ఇప్పించింది ఎవరని మళ్ల ప్రశ్నించారు. అత్యంత భద్రత ఉం డే వీఐపీ లాంజ్‌లో ఫ్యూజన్ ఫుడ్స్‌లో కుక్‌గా పని చేసే శ్రీనివాసరావు వెయిటర్‌గా ఆ రోజు అవతారం ఎత్తడానికి కారణం ఏమిటి అన్న దానిపై విచారణ చేస్తున్నారో లేదో చెప్పకుండా సిట్ అధికారులు తాత్సారం చేయడం వెనుక అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. నిందితుడు శ్రీనివాసరావును ఫ్యూజన్ ఫుడ్ యజమాని హర్షవర్థన్ ఏ ప్రాతిపాదిక చేర్చుకున్నారు! అనే కో ణంలో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ ఘటనను వైఎస్సార్‌సీపీపై నెట్టేందుకు చంద్రబాబు డైరెక్షన్‌లో రాష్ట్ర పోలీసులు కుతంత్రాలు పన్నుతున్నారని ఆక్షేపించారు. ఏ సంబంధం లేని పార్టీ నగర కార్యాలయంలో బాయ్ కె.కృష్ణకాంత్(కె.కె)ను సిట్ అధికారులు విచారించడం ఎంత వరకు సమంజసమన్నారు. ఈ కేసును చిన్నదిగా చూపి మాఫీ చేయడానికి అధికార పార్టీ పన్నాగంలో భాగంగానే విచారణలో జాప్యానికి కారణమన్నారు. కేసును నీరుగార్చేలా వీధికో మంత్రి చొప్పున నోటికొచ్చినట్టుగా ప్రకటనలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు.
ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిర్వీర్యం : తైనాల
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైనట్టు కనిపిస్తుందని వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ విమర్శించారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి స్పందిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలను నివ్వెరపరుస్తుందన్నారు. మానవత్వంతో స్పందించాల్సిపోయి రాద్దాం తం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేటి యువతకు రాజకీయాలంటే అసహ్యం వేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. ఇటీవల మావోయిస్టుల చేతిలో అరకు ఎమ్మె ల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు పట్టపగలు హత్యకు గురి కావడం బట్టి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో స్పష్టమవుతోందన్నారు. సిట్ విచారణలో ఇంత వరకు చేసిన కేసులకు పురోగతిలేదని, జగన్‌పై హత్యాయత్నం కేసులో నిజాలు బయటకు రావాలంటే జ్యూడీషియల్ విచారణతో సాధ్యమన్నారు.
ఈ సమావేశంలో పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, కె.కె.రాజు, డాక్టర్ పి.వి.రమణమూర్తి, కోస్తాం ధ్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఐ.హెచ్.ఫరూకీ, రాష్ట్ర కార్యదర్శి నడింపల్లి కృష్ణంరాజు, రాష్ట్ర అదనపు కార్యదర్శి జి.వి.రవిరెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, విశాఖ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ ప్రేమ్‌బాబు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లి చంద్రశేఖర్, బీసీ సెల్ అధ్యక్షుడు కె.ఆర్.పాత్రుడు, ఎస్సీసెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రెయి వెంకటరమణ, విశాఖ పార్లమెంట్ సేవాదల్ అధ్యక్షురాలు యువశ్రీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment