ఫోన్‌లో మహిళలను వేధిస్తున్న వ్యక్తి అరెస్టు
►200 మందికి పైగా ‘కాల్స్’
► బాధితుల్లో బ్యూటీషియన్లు,
► డాక్టర్లు,లేడీ టైలర్లు
చిలకలూరిపేటటౌన్: మహిళల సెల్‌ఫోన్లకు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో వేధిస్తూ మెసేజ్‌లు పెడుతున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నూతన మోడల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ బి.సురేష్‌బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న ఓ మహిళ ఈ నెల 17వ తేదీన తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడడంతో పాటు అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే పలువురు మహిళల నుంచి ఇదే రకమైన మౌఖిక ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఈ విషయాన్ని సవాలుగా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. వారి విచారణలో నిందితుడి ఆచూకీ తెలిసింది. రేపల్లెకు చెందిన కౌతరపు చిరంజీవిరావు అనే వ్యక్తి ప్రస్తుతం నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ అదే క్వార్టర్సలో నివాసం ఉంటున్నాడు. తనకు దొరికిన ఓ సిమ్‌కార్డుతో పాటు ఐడీ ప్రూఫ్‌లు సమర్పించని మరో సిమ్‌కార్డును ఉపయోగిస్తూ మహిళలకు ఫోన్లు, మెసేజ్‌లు పంపసాగాడు.
బ్యూటీపార్లర్ల బోర్డులపై, ఆసుపత్రి బోర్డులు, లేడీటైలర్ల బోర్డులపై ఉన్న సెల్ ఫోన్ నంబర్లను సేకరించి స్థానిక మహిళలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలను వేధించసాగాడు. పోలీసు విచారణలో ఇతను సుమారు 200 మంది మహిళలను వేధించినట్లు బయటపడింది. రెండు నంబర్ల ద్వారా కేవలం మహిళలకు మాత్రమే ఫోన్ చేస్తూ ఇతరులకు ఆ నంబర్ల ద్వారా ఫోన్ చేయకుండా జాగ్రత్త పడేవాడు. పోలీసులు బాధిత మహిళలతో ట్రాపింగ్ చేసి నిందితుడిని పట్టుకున్నట్లు సమాచారం. నిందితుడిని పట్టుకొన్న ఎస్‌ఐ ఎం.ఉమామహేశ్వరరావుతో పాటు సిబ్బంది ఎస్. షాబుద్దీన్, బి.రమేష్‌లకు సీఐ అభినందనలు తెలియజేశారు. ఎస్పీ పంపిన క్యాష్ రివార్డును ఇద్దరు సిబ్బందికి అందజేశారు. నిందితుడిని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో పట్టణ ఎస్‌ఐలు షేక్ నఫీస్‌బాషా, పి కోటేశ్వరరావు, ఎం.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేయాలి
ఎవరైనా మహిళలకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడినా, మెసేజ్‌లు పంపినా, ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా వేధించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సురేష్‌బాబు తెలిపారు. ఫిర్యాదు చేసిన మహిళల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.