సైబర్ నేరగాళ్ళ మాయలో ఇరుక్కొని..
‘నేను మోసపోయాను.. మీరైనా జాగ్రత్త’
Published Tue, Jun 27 2017 5:44 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
చిత్తూరు (పెద్దతిప్పసముద్రం): సైబర్ నేరగాళ్ల మాయమాటలకు అమాయకులు ఎంతోమంది బలవుతూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ ఫ్రాడ్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ రకరకాల మాటలతో మభ్యపెట్టి అమాయకుల డబ్బును ఇట్టే తన్నుకుపోతున్నారు. మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వినియోగదారులైతే చాలు మీపై సైబర్ నేరగాళ్లు కన్నేస్తున్నారు. ఏదో రకంగా మిమ్మల్ని బుట్టలో వేసి ఖాతాలోని సొమ్ము కాజేస్తున్నారు.
కోకొల్లలుగా జరుగుతున్న ఇలాంటి ఘటనల్లో తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఒక యువకుడు బలయ్యారు. జిల్లాలోని పెద్దతిప్ప సముద్రంకు చెందిన పుంగనూర్ శ్రీనివాసులు అనే యువకుడికి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిందనీ, వెంటనే రెన్యువల్ చేసుకోకపోతే దానిపై లావాదేవీలన్నీ నిలిపివేస్తారని ఫోన్ చేసిన వారు చెప్పుకొచ్చారు. దాంతో ఆ యువకుడు కంగారు పడ్డారు. మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని సరికి ఆ యువకుడు నమ్మి వారడిగిన వివరాలన్నీ చెబుతూ వెళ్లాడు.
శ్రీనివాసులుకు స్థానిక ఎస్బీఐలో ఖాతా ఉంది. అతని పేరిట కుటుంబ సభ్యుల బంగారు నగలు తాకట్టులో ఉన్నాయి. మహిళా సంఘం నుంచి అతని తల్లి మంగమ్మ, భార్య శశకళ, పిన్ని అనసూయకు మంజూరైన 1.50 లక్షల డబ్బును తీసుకొని నగలు విడిపించేందుకు అతని ఖాతాలో జమ చేశారు. అలాంటి తరుణంలో ఈ నెల 24న శ్రీనివాసులుకు 9534563929, 8677852060 నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. కార్డు బ్లాక్ అయిందని, వెంటనే రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉందని ఆ ఫోన్ల ద్వారా అందిన సమాచారం. దాంతో కంగారు పడిన శ్రీనివాసులు వారడిగినట్టుగా 16 అంకెల కార్డు నంబర్, దానివెనకాల ఉండే సీవీవీ నంబర్‌తో సహా వివరించాడు.
ఆ తర్వాత మరుసటి రోజు వెళ్లి బ్యాంకు ఖాతాలో నిలువ ఉన్న సొమ్మును పరిశీలించగా 50 వేల రూపాయల తక్కువగా ఉన్నాయి. వివరాలు తీసుకోగా, రెండు విడతలుగా ఆ సొమ్ము తన ఖాతా నుంచి డ్రా చేసినట్టు గుర్తించాడు. మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు ట్రూ కాలర్ ద్వారా తనకొచ్చిన ఫోన్ నంబర్లను పరిశీలించి మరింత విస్మయపోయాడు. అందులో ఎటిఎం మేనేజర్, జయందాబాద్, జయంతి స్కూల్ బీహార్, డిఎన్‌ఆర్ కాంప్లెక్స్, పిపి రోడ్, కైకలూరు, భీమవరం అన్న చిరునామా చూసి దిమ్మతిరిగింది. తన ఖాతా నుంచి డ్రా చేసిన సొమ్మును ఎయిర్‌టెల్ మని, వైవా టెక్నాలజీ సోలుకు బదలాయించినట్లు తేలింది. వెంటనే జరిగిన మోసాన్ని స్థానిక మేనేజర్‌కు మంగళవారం ఫిర్యాదు చేసాడు. ఇప్పుడు ఆ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
ఇటీవలి కాలంలో ఎస్బీఐ ఖాతాదారులే ఎక్కువగా ఇలాంటి ఫోన్లు రిసీవ్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కలిగిన ఖాతాదారులను ఆ బ్యాంకు అధికారిగానీ మరెవరుగానీ ఎలాంటి నంబర్ అడగరు. పైగా అనేక సందర్భాల్లో ఎస్బీఐ ఇలాంటి వాటి గురించి ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ మేసేజ్ లు పంపిస్తుంటుంది. ఖాతాదారులను బ్యాంకు నుంచి ఎలాంటి వివరాలు కోరదని, ఎవరడిగినా ఎలాంటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అనేక సందర్భాల్లో ఎస్బీఐ స్పష్టం చేసింది. అడగ్గానే మీ కార్డు వివరాలు చెప్పారంటే... ఇంతే సంగతులు. వినియోగదారులారా... తస్మాత్ జాగ్రత్త.
Advertisement
Advertisement