ATM fraud
-
సైబర్ కేటుగాళ్లు ఎంత దోచేశారంటే.. ప్రభుత్వం లెక్కలు!
ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సైబర్, ఆర్థిక మోసాలు సైతం అదే స్థాయిలో పెగుతున్నాయి. దేశంలో నిత్యం ఎక్కడో చోట ఇలాంటి మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు, ఆర్థిక సంస్థలు ఎంత అవగాహన కల్పిస్తున్నా అమాయకులు మోసపోతూనే ఉన్నారు. దేశంలో మూడేళ్లలో నమోదైన సైబర్, ఆర్థిక మోసాల కేసుల వివరాలను ప్రభుత్వం తాజాగా తెలియజేసింది. 12,000 మోసాలు.. రూ.461 కోట్లు దేశవ్యాప్తంగా మూడేళ్లలో సైబర్, ఆర్థిక మోసాలు భారీగానే జరిగాయి. ‘కార్డ్/ఇంటర్నెట్/ఏటీఎం / డెబిట్ కార్డులు , క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు’ కేటగిరి కింద గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం సుమారు 12,000 మోసాలు నమోదయ్యాయని ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. వీటి ద్వారా రూ.461 కోట్ల మేర బాధితులు మోసపోయారని పేర్కొంది. ఇదీ చదవండి: రుణాల ‘ఎవర్‌గ్రీనింగ్’కు చెక్.. ఆర్బీఐ నిబంధనలు కఠినతరం మరోవైపు సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మాడ్యూల్ ద్వారా ఈ ఏడాది డిసెంబర్ 14 నాటికి నాలుగు లక్షలకు పైగా ఘటనల్లో రూ. 1,000 కోట్లకుపైగా బాధితులు మోసపోకుండా కాపాడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ టెలికాం శాఖ అందించిన వివరాలను ఉటంకిస్తూ తెలిపారు. నకిలీ పత్రాలతో తీసుకున్నవి, అనుమానిత కనెక్షన్లు, సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాల్లో ప్రమేయం ఉన్నవి దాదాపు 72 లక్షల మొబైల్ కనెక్షన్లను తొలగించినట్లు పేర్కొన్నారు. -
చెడు వ్యసనాలకు అలవాటుపడి.. ఏటీఎం కార్డులు మారుస్తూ..
సాక్షి, భువనగిరి(నల్లగొండ): ఏటీఎం కేంద్రాల్లో సహాయం కోరే ఖాతాదారుల ఏటీఎం కార్డులను మార్చి నగదును అపహరించుకుపోతున్న నిందితుడిని భువనగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కె.నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రానికి చెందిన తూము రాజు అలియాస్ రాజేందర్ నెట్ సెంటర్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దీని ద్వారా వచ్చే డబ్బులు చాలకపోవడంతో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులు సంపదించాలని, అందుకు యూట్యూబ్‌లో ఏటీఎం కార్డులను స్వైప్ చేసి మార్చే విధానాన్ని నేర్చుకుని ఎక్స్‌పర్ట్‌గా మారాడు. నగదు ఇలా అపహరిస్తాడు.. ఏటీఎం కేంద్రాలకు వచ్చే వృద్ధులను, ఏటీఎం కార్డు ఆపరేటింగ్ తెలియని వారిని గుర్తించి సహాయం చేస్తున్నట్లు నటిస్తాడు. అసలైన ఖాతాదారుల నుంచి ఏటీఎం కార్డును తీసుకొని వారికి నగదును తీసి ఇచ్చే క్రమంలో ఒరిజినల్ కార్డుమార్చి తన వద్ద మరో కార్డును వారికి ఇస్తాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయి నగదును డ్రా చేసుకుంటాడు. ఇలా ఇప్పటి వరకు చాలా చోట్ల ఏటీఎం కేంద్రాలలో నగదును అపహరించుక పోయాడు. బాధితుడి ఫిర్యాదుతో.. ఇటీవల భువనగిరి పట్టణానికి చెందిన కె. కృష్ణ తన బ్యాంకు ఏటీఎం కార్డును తీసుకుని డబ్బుల కోసం ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న రాజును ఏటీఎంలో నుంచి డబ్బులు తీసి ఇవ్వమని కోరగా రూ. 5 వేల నగదు తీసి ఏటీఎం కార్డును మార్చి ఇచ్చాడు. మరుసటి రోజు డబ్బులు అవసరమై కృష్ణ ఏటీఎం కేంద్రానికి వెళ్లగా ఆ కార్డు పనిచేయలేదు. దీంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా మరొకరి పేరిట ఉందని అధికారులు తెలిపారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అడిషనల్ డీసీపీ ఎన్. భుజంగరావు ఆధ్వర్యంలో పోలీసులు సీసీటీవీ పూటేజ్‌లను పరిశీలించారు. పాత నేరస్తులను గమనించారు. 4రోజులుగా పోలీసులు పట్ట ణంలోని అన్ని ఏటీఎం కేంద్రాల వద్ద నిఘా పెట్టారు. 23న సాయంత్రం సమయంలో ఓ ఏటీఎం వద్ద రాజు సహాయం చేస్తున్నట్లుగా ఉండటాన్ని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలను అంగీకరించాడు. నిందితుడిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు మోసాలకు పాల్పడుతున్న నిందితుడు రాజుపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 2018 సంవత్సరంలో సిద్దిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో–2 , కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో –1 , 2019 సంవత్సరంలో భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో–1 , 2020 సంవత్సరంలో జాగిత్యల పోలీస్ స్టేషన్లో–1 , 2021 సంవత్సరంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రాంతాలలో మొత్తం రూ.9.12 లక్షలను అపహరించాడు. నిందితుడినుంచి నుంచి రూ.1.30లక్షలు, రెండు సెల్ ఫోన్లను, వివిధ బ్యాంకులకు చెందిన 15 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కేసును ఛేదించిన అడిషనల్ డీసీపీ, సీఐ, ఎస్ఐ, సిబ్బందిని అభినందించారు. నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని చెప్పారు. అపరితులకు ఏటీఎం కార్డులను ఇవ్వవద్దని ఆయన సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ఎన్. భుజంగరావు, పట్టణ సీఐ సుధాకర్, ఎస్ఐ వెంకటయ్య, కానిస్టేబ్‌లు బాలస్వామి, మహేష్, సంపత్, అంజనేయులు పాల్గొన్నారు. -
నమ్మించి ఏటీఎం కార్డు మార్చాడు..
సాక్షి, కేసముద్రం(వరంగల్): ఓ వ్యక్తి ఏటీఎం కార్డును నమ్మించి తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తి రూ.24వేలను అపహరించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో సోమవారం వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం విలేజ్‌కి చెందిన బొల్లోజు జనార్దనాచారి శనివారం మండల కేంద్రంలోని ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లాడు. అప్పటికే ఓ గుర్తుతెలియని వ్యక్తి మాస్క్ ధరించి లోపలికి వచ్చాడు. డబ్బులు రావడం లేదా అంటూ జనార్దనాచారిని ఆరా తీశాక ఏటీఎం కార్డు తీసుకుని పిన్ నంబర్‌ను తెలుసుకున్నాడు. ఆ తర్వాత గుర్తుతెలియని వ్యక్తి తనవద్ద ఉన్న ఏటీఎంకార్డుతో డబ్బులు వస్తాయో చూస్తానని నమ్మించి, మరోసారి ప్రయత్నం చేశాడు. అప్పటికి డబ్బు రాలేదు. తన కార్డు తనకు ఇవ్వమని జనార్దనాచారి అడగగా మరో కార్డు ఇచ్చేసి వెళ్లిపోయాడు. తీరా జనార్దనాచారి ఇంటికి వెళ్లాక సెల్‌ఫోన్‌కు డబ్బు డ్రా అవుతున్నట్లుగా మెసేజ్‌లు వస్తుండటంతో, పరీక్షించగా కార్డు మారినట్లు గుర్తించాడు. అప్పటికే ఆయన ఖాతా నుంచి 6సార్లు మొత్తం రూ.24వేలు డ్రా అయ్యాయి. దీంతో ఏటీఎం కార్డును బ్లాక్ చేయించి బ్యాంకు అధికారులతో పాటు సోమవారం కేసముద్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై రమేష్‌బాబును వివరణ కోరగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: విషాదం: తమ్ముడిని కాల్చి చంపి.. తను ఆత్మహత్య -
ఏటీఎం కేటుగాళ్లు.. అసలు సంగతి ఇది!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌కు చెందిన సెక్యూర్ వాల్యూ సంస్థలో కస్టోడియన్‌గా పని చేసిన కృష్ణకు ఏటీఎం కేంద్రాల్లో పెట్టాల్సిన రూ.1.3 కోట్లు కాజేయడానికి ఆ సంస్థలో ఉన్న లోపాలే కలిసి వచ్చాయని వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇతడితో పాటు మాజీ సహోద్యోగి రాజశేఖర్‌ను సైతం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. న్యాయస్థానం అనుమతితో ఇరువురినీ కస్టడీలోకి తీసుకున్న అధికారులు లోతుగా విచారించారు. ఈ నేపథ్యంలోనే పలు వ్యవస్థాగత లోపాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై ఆ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించారు. ► సెక్యూర్ వాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల్లోని యంత్రాల్లో డబ్బు నింపే బాధ్యతల్ని చేపట్టింది. వరంగల్‌కు చెందిన రాపాక రాజశేఖర్‌రెడ్డి గతంలో ఈ సంస్థలో కస్టోడియన్‌గా పని చేశాడు. ఏటీఎం మెషిన్లలో పెట్టాల్సిన రూ.1.23 కోట్లు మరికొందరితో కలిసి కాజేసిన ఆరోపణలపై గతంలో అరెస్టు అయ్యాడు. ఉద్యోగం కూడా కోల్పోయాడు. ఇదే సంస్థలో కస్టోడియన్‌గా పని చేస్తున్న గండెల్లి కృష్ణకు ఓ రూట్ అప్పగించారు. ► సెక్యూర్ వాల్యూ సంస్థ ప్రతి నెలా కచ్చితంగా ఆడిటింగ్ నిర్వహించేది. అయితే ఆ రోజు ఏ ఏటీఎం కేంద్రానికి వెళ్లి ఆడిటింగ్ చేయనున్నారో ముందే సిబ్బందికి చెప్పేది. ఇలా విషయం తెలుసుకునే కృష్ణ మరో ఏటీఎం నుంచి డబ్బు తెచ్చి అందులో పెట్టేవాడు. మరోపక్క ఓ ఏటీఎం మిషన్‌ను తెరవడానికి రెండు పాస్వర్డ్స్ వినియోగించాల్సి ఉంటుంది. భద్రత నిబంధనల ప్రకారం ఒక్కో పాస్వర్డ్ ఒక్కో ఉద్యోగికి చెప్పి బాధ్యుడిని చేయాలి. అయితే సెక్యూర్ సంస్థ మాత్రం రెండింటినీ ఒకే కస్టోడియన్‌కు చెప్పేస్తోంది. ► ఒక్కో పాస్వర్డ్ వ్యాలిడిటీ గడువు గరిష్టంగా 24 గంటల మాత్రమే. ఆ మరుసటి రోజు ఏ ఏటీఎంలో డబ్బు నింపాలో దానివే చెప్పాలి. అయితే సెక్యూర్ సంస్థ మాత్రం ఆయా రూట్లలో ఉన్న అన్ని ఏటీఎంలవీ కస్టోడియన్లకు వాట్సాప్ ద్వారా పంపించేస్తోంది. వీటిని తమకు అనుకూలంగా మార్చుకున్న కృష్ణ సంస్థ నిర్వాహకులకు అనుమానం రాకుండా వ్యవహరించాడు. మూడు నెలల కాలంలో ఏటీఎంల్లో నింపాల్సిన రూ.కోటి కాజేశాడు. ఏ ఒక్క ఏటీఎం నుంచీ మొత్తం డబ్బు కాజేయలేదు. ఒక్కో దాని నుంచి కొంత చొప్పున మాయం చేశాడు. ► ఫలానా రోజు ఏ ఏటీఎంలో ఆడిటింగ్ జరుగుతుందో తెలుస్తుండటంతో.. మరో దాంట్లో నుంచి అవసరమైన మొత్తం తెచ్చి అందులో నింపి తప్పించుకునేవాడు. ఈ వ్యవహారాల్లో తన మాజీ సహోద్యోగి రాజశేఖర్ సలహాలు తీసుకుంటూ కొంత మొత్తం చెల్లించాడు. ఓ దశలో తన వ్యవహారం బయటపడుతుందని భావించిన కృష్ణ ఆ విషయం రాజశేఖర్‌కు చెప్పాడు. ఇద్దరూ కలిసి రూ.30 లక్షలు కాజేయాలని, ఆపై కృష్ణ పోలీసులకు లొంగిపోవాలని పథకం వేశారు. అనుకున్నట్లే కాజేసిన కృష్ణను తన వాహనంపై పికప్ చేసుకున్న రాజశేఖర్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ తన వాటా తాను తీసుకుని ఉడాయించాడు. స్వాహా చేసిన డబ్బును కృష్ణ తన చెందిన వాటితో పాటు తన భార్య బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్ చేశాడు. ఆపై ఆన్లైన్ బెట్టింగ్‌లో దాదాపు 90 శాతం కోల్పోయాడు. చదవండి: కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం -
ఏటీఎం మోసాలు అక్కడే ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ: ఏటీఎం మోసాలలో దేశంలో ఢిల్లీ రెండవ స్థానంలో నిలిచింది. 2018–19లో నగరంలో లక్ష లేదా అంతకన్నా ఎక్కువ రూపాయలు గల్లంతైన ఏటీఎం మోసాల కేసులు 179 నమోదయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆ‹ఫ్ ఇండియా(ఆర్బీఐ) డేటా తెలిపింది. నగరవాసులు ఈ మోసాలలో రూ.2.9 కోట్లు పోగొట్టుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 233 ఏటీఎం మోసాల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వాసులు ఏటీఎం మోసాలల్లో రూ.4.81 కోట్లు, తమిళనాడు వాసులు రూ.3.63 కోట్లు పోగొట్టుకున్నారు. 2017–18తో పోలిస్తే నగరంలో 2018–19లో ఏటీఎం మోసాలు పెరిగాయి. 2017–18లో 132 కేసులు జరిగాయి. ఈ మోసాల్లో రూ.2.8 కోట్లు గల్లంతయ్యాయి. ఢిల్లీలోనే కాక దేశం మొత్తం మీద కూడా ఏటీఎం మోసాలు 911 నుంచి 980 కి పెరిగాయి. అసోం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఏటీఎం మోసాల కేసులు నమోదయ్యాయి. ఈ మోసాల్లో ఢిల్లీలో గల్లంతైన డబ్బు 2017–18 లో ఉన్న రూ.65.3 కోట్ల నుంచి 2018–19లో రూ.21.4 కోట్లకు తగ్గింది. లక్ష రూపాయలకు పైగా గల్లంతైన కేసులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం వల్ల దేశంలో జరుగుతోన్న ఏటీఎం మోసాలన్నీ డేటాలో వెల్లడి కాలేదని సైబర్ నిపుణులు అంటున్నారు. ఈ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా, గల్లంతైన సొమ్ము భారీ మొత్తంలో ఉంటుందని వారు అంటున్నారు. మోసగాళ్లు అనేక పద్ధతుల ద్వారా ఏటీఎంల ద్వారా వినియోదారుల బ్యాంకు ఖాతాలను దోచుకోవడానికి పథకాలు వేస్తున్నారని నిపుణులు చెప్పారు. సాధారణంగా మోసగాళ్లు ఏటీఎంలు లేదా పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లలో స్కిమ్మర్లను అమర్చి కార్డుల నుంచి డేటాను చోరీ చేస్తారని ఆ తరువాత ఈ డేటాను ఖాళీ కార్డులపై ఉంచి అక్రమ లావాదేవీలు జరుపుతారని వారు చెప్పారు. భద్రత సరిగ్గా లేని ఏటీఎంలను దోచుకునే అనేక మూఠాలను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అమాయకంగా కనబడే వినియోగదారులకు సహాయం చేస్తామన్న మిషతో కార్డులు మార్చి ఆ తరువాత ఏటీఎంల నుంచి వినియోగదారుల ఖాతాలను ఖాళీ చేస్తారని చెప్పారు. నకిలీ వెబ్సైట్లతో తస్మాత్ జాగ్రత్త.. ఆన్లైన్ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని బ్యాంకుల కస్టమర్ కేర్ ఏజెంట్లమని చెప్పి మోసగాళ్లు వినియోగదారుల నుంచి గోపనీయమైన సమాచారాన్ని సేకరించి మోసగిస్తుంటారు. కొందరు మరో అడుగుముందుకేసి బ్యాంకుల నకిలీ వెబ్సైట్లను కూడా తెరిచారు. వినియోగదారులు ఇంటర్నెట్ గాలించి ఈ వెబ్సైట్లలో పేర్కొన్న బూటకపు కస్టమర్ కేçర్ నంబర్లను సంప్రదించినప్పుడు వారిని మోసగిస్తుంటారు. నేరగాళ్లు రోజురోజుకు ఆధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తూ కొత్త కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతుండగా, ఢిల్లీ పోలీసు సైబర్ క్రైమ్ ప్రివన్షెన్ అవేర్నెస్ అండ్ డిటెక్షన్ సెంటర్ సుక్షితులైన సిబ్బంది కొరత వంటి అనేక సమస్యలతో సతమతమవుతంది. ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పోలీస్ శాఖ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. -
పీఎన్బీలో ఏటీఎం ఫ్రాడ్ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణంలో చిక్కుకున్ పంజాబ్ నేషనల్‌బ్యాంకు (పీఎన్బీ)లో తాజాగా అక్రమ లావాదేవీల ఉదంతం ప్రకంపనలు రేపుతోంది. ఏటీఎం మోసం ద్వారా పీఎన్బీ ఖాతాదారుల సొమ్మలు స్వాహా అయిపోతున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో 61 మంది వినియోగదారుల ఖాతాల నుంచి సుమారు 15 లక్షల రూపాయలు గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏటీఎం మోసాలపై ఆయా బ్యాంకులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా...తగిన సూచనలు జారీ చేస్తున్నా ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ (ఏటీఎం) లకు సంబంధించిన నేరాలు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 8 న తన ఖాతానుంచి తన ప్రమేయం లేకుండానే గుర్తు తెలియని లావాదేవీ జరిగిందని ఒక ఖాతాదారుడు పీఎన్బీ వసంత్ విహార్ బ్రాంచ్ మేనేజర్‌ను సంప్రదించారు. దీంతో బ్యాంకు అధికారులు ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఫిర్యాదుదారుల జాబితా మరింత పెరిగింది. బ్యాంకు ప్రకటన ప్రకారం మొత్తం 14, 97,769 రూపాయల సొమ్ము అక్రమార్కుల జేబులోకి వెళ్లిపోయింది. దీనిపై కేసు నమోదు చేశామని వసంత్ విహార్ డీసీపీ(సౌత్ వెస్ట్) దేవేందర్ ఆర్యా వెల్లడించారు. -
సైబర్ నేరగాళ్ళ మాయలో ఇరుక్కొని..
చిత్తూరు (పెద్దతిప్పసముద్రం): సైబర్ నేరగాళ్ల మాయమాటలకు అమాయకులు ఎంతోమంది బలవుతూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ ఫ్రాడ్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ రకరకాల మాటలతో మభ్యపెట్టి అమాయకుల డబ్బును ఇట్టే తన్నుకుపోతున్నారు. మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వినియోగదారులైతే చాలు మీపై సైబర్ నేరగాళ్లు కన్నేస్తున్నారు. ఏదో రకంగా మిమ్మల్ని బుట్టలో వేసి ఖాతాలోని సొమ్ము కాజేస్తున్నారు. కోకొల్లలుగా జరుగుతున్న ఇలాంటి ఘటనల్లో తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఒక యువకుడు బలయ్యారు. జిల్లాలోని పెద్దతిప్ప సముద్రంకు చెందిన పుంగనూర్ శ్రీనివాసులు అనే యువకుడికి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిందనీ, వెంటనే రెన్యువల్ చేసుకోకపోతే దానిపై లావాదేవీలన్నీ నిలిపివేస్తారని ఫోన్ చేసిన వారు చెప్పుకొచ్చారు. దాంతో ఆ యువకుడు కంగారు పడ్డారు. మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని సరికి ఆ యువకుడు నమ్మి వారడిగిన వివరాలన్నీ చెబుతూ వెళ్లాడు. శ్రీనివాసులుకు స్థానిక ఎస్బీఐలో ఖాతా ఉంది. అతని పేరిట కుటుంబ సభ్యుల బంగారు నగలు తాకట్టులో ఉన్నాయి. మహిళా సంఘం నుంచి అతని తల్లి మంగమ్మ, భార్య శశకళ, పిన్ని అనసూయకు మంజూరైన 1.50 లక్షల డబ్బును తీసుకొని నగలు విడిపించేందుకు అతని ఖాతాలో జమ చేశారు. అలాంటి తరుణంలో ఈ నెల 24న శ్రీనివాసులుకు 9534563929, 8677852060 నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. కార్డు బ్లాక్ అయిందని, వెంటనే రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉందని ఆ ఫోన్ల ద్వారా అందిన సమాచారం. దాంతో కంగారు పడిన శ్రీనివాసులు వారడిగినట్టుగా 16 అంకెల కార్డు నంబర్, దానివెనకాల ఉండే సీవీవీ నంబర్‌తో సహా వివరించాడు. ఆ తర్వాత మరుసటి రోజు వెళ్లి బ్యాంకు ఖాతాలో నిలువ ఉన్న సొమ్మును పరిశీలించగా 50 వేల రూపాయల తక్కువగా ఉన్నాయి. వివరాలు తీసుకోగా, రెండు విడతలుగా ఆ సొమ్ము తన ఖాతా నుంచి డ్రా చేసినట్టు గుర్తించాడు. మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు ట్రూ కాలర్ ద్వారా తనకొచ్చిన ఫోన్ నంబర్లను పరిశీలించి మరింత విస్మయపోయాడు. అందులో ఎటిఎం మేనేజర్, జయందాబాద్, జయంతి స్కూల్ బీహార్, డిఎన్ఆర్ కాంప్లెక్స్, పిపి రోడ్, కైకలూరు, భీమవరం అన్న చిరునామా చూసి దిమ్మతిరిగింది. తన ఖాతా నుంచి డ్రా చేసిన సొమ్మును ఎయిర్టెల్ మని, వైవా టెక్నాలజీ సోలుకు బదలాయించినట్లు తేలింది. వెంటనే జరిగిన మోసాన్ని స్థానిక మేనేజర్‌కు మంగళవారం ఫిర్యాదు చేసాడు. ఇప్పుడు ఆ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇటీవలి కాలంలో ఎస్బీఐ ఖాతాదారులే ఎక్కువగా ఇలాంటి ఫోన్లు రిసీవ్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కలిగిన ఖాతాదారులను ఆ బ్యాంకు అధికారిగానీ మరెవరుగానీ ఎలాంటి నంబర్ అడగరు. పైగా అనేక సందర్భాల్లో ఎస్బీఐ ఇలాంటి వాటి గురించి ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ మేసేజ్ లు పంపిస్తుంటుంది. ఖాతాదారులను బ్యాంకు నుంచి ఎలాంటి వివరాలు కోరదని, ఎవరడిగినా ఎలాంటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అనేక సందర్భాల్లో ఎస్బీఐ స్పష్టం చేసింది. అడగ్గానే మీ కార్డు వివరాలు చెప్పారంటే... ఇంతే సంగతులు. వినియోగదారులారా... తస్మాత్ జాగ్రత్త. -
రూ.9999 డ్రా చేసిన అపరిచితుడు
లబోదిబోమంటున్న బాధితురాలు అలహాబాద్ బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు హిందూపురం అర్బన్ : బ్యాంకు మేనేజర్‌నంటూ ఫోన్ చేసిన అపరిచితుడు ఖాతాదారురాలి ఏటీఎం కార్డుపై నంబర్ తెలుసుకుని, కాసేపటి తర్వాత రూ.9999 నగదు డ్రా చేసిన సంఘటన సోమవారం చూసింది. హిందూపురం పట్టణంలోని ఎంఎఫ్ రోడ్డులో నివాసముంటున్న రాజాబాయికి అలహాబాద్ బ్యాంకులో 50275179945 నంబరుతో అకౌంట్ ఉంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో 73610 20259 నంబరు నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ‘నేను బ్యాంకు మేనేజర్ మాట్లాడుతున్నా. మీ ఏటిఎం బ్లాక్ అయ్యింది. అది రిలీజ్ చేయడానికి కార్డుపై ఉన్న నంబరు చెప్పండి’ అని కోరడంతో ఆమె చెప్పేసింది. అదే రోజు సాయంత్రం కార్డు పనిచేస్తోందో లేదో చూద్దామని ఏటీఎం కేంద్రానికి వెళ్లింది. మినీ బ్యాలెన్స్ చెక్ చేస్తే ఖాతాలోంచి రూ.9999 నగదు డ్రాయినట్లు స్లిప్ వచ్చింది. తిరిగి తనకు వచ్చిన సెల్‌నంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని సమాధానం వచ్చింది. ఆందోళన చెందిన బాధితురాలు సోమవారం అలహాబాద్ బ్యాంకు మేనేజర్‌ను కలిసి తనకు జరిగిన మోసం గురించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పాస్‌బుక్ ఎంట్రీ చేయించుకోగా పీఓఎస్ మెషిన్ నుంచి పై మొత్తం డ్రా అయినట్లు కనిపించింది. ఏ ప్రాంతం నుంచి డ్రా అయ్యిందో విచారణ చేస్తామని మేనేజర్ తెలిపినట్లుబబాధితురాలు తెలిపింది. -
కార్డు..ఫోను..ఆదమరిస్తే అంతే!!
♦ 65 లక్షల డెబిట్ కార్డుల సమాచారం మోసగాళ్ల చేతికి ♦ పోలీసుల దర్యాప్తులో పెరుగుతున్న సంఖ్య ♦ తక్షణం అంతా పిన్ మార్చుకోవాలంటూ బ్యాంకుల సలహా ♦ ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదంటున్న ఎన్సీపీఐ ♦ మోసపోయిన వారికి అండగా కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్లు ♦ మొబైల్ పేమెంట్లలోనూ జాగ్రత్త అవసరమంటున్న నిపుణులు ♦ ‘డెబిట్ కార్డు ఫ్రాడ్’ నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం... రోటీ... కపడా... ఔర్ మకాన్...!! ఇంతేనా? ఇపుడీ జాబితాలో మొబైల్ కూడా చేరిపోయింది. విలాసం నుంచి అవసరంగా... అక్కడి నుంచి అత్యవసరంగా మారిపోయింది. బస్సు, రైలు, విమానం నుంచి ఆఖరికి సినిమా టికెట్లు కొనటానికీ మొబైలే. కరెంటు, మొబైల్, వాటర్ బిల్లుల నుంచి ఆటో చార్జీలు చెల్లించడానికీ మొబైలే. ఇక మొబైల్ లేని బ్యాంకింగ్ లావాదేవీల్ని ఊహించలేం కూడా!!. 3జీ, 4జీ ఇంటర్నెట్ ధరలు దిగిరావటం, నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం, మొబైల్ విప్లవం... ఇవన్నీ కలిసి ఈ ఎలక్ట్రానిక్ లావాదేవీల్ని వేగంగా పెంచుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో భారీ ఎత్తున డెబిట్ కార్డు హోల్డర్ల సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కింది. ఇప్పటిదాకా 32 లక్షల డెబిట్ కార్డు హోల్డర్ల సమాచారమే వారి చేతికి వెళ్లిందని బ్యాంకులు చెబుతుండగా... తాజాగా పోలీసు దర్యాప్తులో అది 65 లక్షలను మించి ఉంటుందని తేలింది. మున్ముందు ఈ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. మరి ఇలాంటి పరిణామాలు ఎలక్ట్రానిక్ లావాదేవీలపై ప్రభావం చూపిస్తాయా? ఇంతకీ ఇలా తస్కరించిన డేటాతో మోసగాళ్లు ఏం చేస్తారు? ఏటీఎం లావాదేవీల్లో బ్యాంకులు, పేమెంట్ సంస్థలు కాకుండా ఔట్సోర్సింగ్ సేవలందించే థర్డ్‌పార్టీ కంపెనీల ప్రమేయమెంత? బ్యాంకులు తమ ఖాతాదారులు నష్టపోకుండా ఏం చేస్తున్నాయి? ఒకవేళ ఎవరెన్ని చేసినా మోసపోకుండా ఉండేందుకు మనమేం చెయ్యాలి? మన కార్డుల్ని భద్రంగా ఉంచుకోవటం ఎలా? అతితెలివి చూపిస్తున్న మోసగాళ్ల వలలో పడకుండా ఉండటమెలా? ఒకవేళ ఎన్ని చేసినా మనం మోసపోతే ఆ మేరకు రక్షణ పొందటం ఎలా? ఇవన్నీ వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... ఒక్కసారిగా కలకలం.. సెప్టెంబర్ మొదటి వారం వరకూ అంతా మామూలుగానే ఉంది. తొలివారంలో మాత్రం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులున్న కొందరి మొబైల్స్‌కు... మీరు చైనా లో ఫలానా లావాదేవీ చేశారు!! అమెరికాలో ఫలానా లావాదేవీ చేశారు!!. అంటూ మెసేజ్‌లు రావటం మొదలైంది. వెంటనే వారు తమ బ్యాంకులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులన్నీ కలసి... దేశం లో పేమెంట్ వ్యవస్థను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సెప్టెంబర్ 5న ఫిర్యాదు చేశాయి. అది దర్యాప్తు చేసి... దేశంలో ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ సేవలందించే హిటాచీ పేమెంట్ సర్వీసెస్ కంప్యూటర్లలోకి వైరస్ (మాల్వేర్) ప్రవేశించిందని తేల్చింది. తద్వారా 90 ఏటీఎంలలో కార్డుదారుల సమాచారం చోరీకి గురైందని తేల్చింది. దీంతో వీసా, మాస్టర్‌కార్డ్, రూపే వంటి పేమెంట్ సంస్థల సూచనల మేరకు... బ్యాంకులన్నీ తమ ఖాతా దారులకు పిన్ నంబరు మార్చుకోమని సూచించాయి. కొన్నింటిని బ్లాక్ చేశాయి. వారికి కొత్త కార్డులు జారీ చేయటం కూడా ఆరంభించాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఇండియాలో బ్యాంకులన్నీ 71.23 కోట్ల కార్డులు జారీ చేశాయి. మాల్వేర్ పనిచేసేదెలా? కంప్యూటర్ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఎలాగో... ట్రోజన్లు, వైరస్లు, వార్మ్‌లు, రాన్సమ్వేర్, స్పైవేర్స్ కూడా అలాంటివే. కాకపోతే ఇవన్నీ మాయ సాఫ్ట్వేర్లు. అందుకే వీటిని మాల్‌వేర్స్‌గా పిలుస్తారు. ఇలాంటి మాల్వేర్... కంప్యూటర్ వ్యవస్థల్ని, ఏటీఎంలను, బ్యాంకుల సర్వర్లను దెబ్బతీసి దాన్లోని రహస్య డెబిట్ కార్డు డేటాను మోసగాళ్లకు చేరవేస్తుంది. తాజా వ్యవహారంలో జరిగిందేమంటే... అప్పటికే 90 ఏటీఎంలలో ఆ మాల్వేర్ ఉంది. వాటిలో స్వైప్ చేసిన కార్డు వివరాలను పిన్‌తో సహా మోసగాళ్లకు చేరవేసింది. వాళ్లు ఆ డేటా ఆధారంగా నకిలీ కార్డులు తయారు చేసి... వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో వినియోగించటానికి పథకం వేశారు. ఇదంతా వివిధ దేశాల్లోని మోసగాళ్లు కలిసి చేసేది కావటంతో... డెబిట్ కార్డుల్ని వినియోగించటం కూడా దాదాపు ఒకే సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అయితే తాజా వ్యవహారంలో అమెరికా, చైనాల్లో జరిగాక మన బ్యాంకులు అప్రమత్తం కావటంతో పెను ముప్పు తప్పిందనేది నిపుణుల భావన. తాజా వ్యవహారంపై అంతర్జాతీయంగా కార్డులకు ప్రమాణాలు నిర్దేశించే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ (పీసీఐడీఎస్ఎస్) కూడా దర్యాప్తునకు ఆదేశించింది. ఎవరు బాధ్యులు? ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం... థర్డ్ పార్టీ లావాదేవీ నిర్వహిస్తే దానికి కస్టమర్ బాధ్యత ఉండదు. కాకపోతే కస్టమరు ఆ విషయాన్ని బ్యాంకు నుంచి సమాచారం వచ్చిన మూడు పని దినాల్లోగా బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. సదరు పరిణామానికి బ్యాంకు నిర్లక్ష్యమే కారణమై ఉండాలి కూడా. ఖాతాదారుడి నిర్లక్ష్యం, తెలివితక్కువ తనం వల్ల ఆ మోసం జరిగినట్లు గనక తేలితే దానికి బ్యాంకు బాధ్యత వహించదు. ఏటీఎం ఫ్రాడ్లలో రకాలివీ... కీ ప్యాడ్ జామింగ్ ఏటీఎం యంత్రాల్లో ఎంటర్, క్యాన్సిల్ బటన్లున్న చోట మోసగాళ్లు పిన్లు, బ్లేడ్ల వంటివి పెట్టడమో లేకపోతే వాటిని ఫెవికాల్తో అతికించటమో చేసి అవి పనిచేయకుండా చూస్తారు. కస్టమరు మొత్తం లావాదేవీని నమోదు చేసి ఎంటర్ చేయబోతే అతి పనిచేయదు. పోనీ క్యాన్సిల్ చేద్దామన్నా పనిచేయదు. దీంతో చాలా సందర్భాల్లో కస్టమర్ విసుగ్గా వెనక్కెళ్లి పోతాడు. ఆ పక్కనే తిరుగుతుండే మోసగాడు... ఆ లావాదేవీ క్యాన్సిల్ అయ్యేలోపు చొరబడి పని పూర్తిచేసుకుంటాడు. ఏం చేయాలి? ఒక్కో లావాదేవీ కనీసం 30 సెకెన్ల సమయం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి జరిగితే మీరు ఆ 30 సెకెన్లూ అక్కడే ఉండాలి. మీ లావాదేవీ క్యాన్సిల్ అయినట్లు స్క్రీన్‌పై చూశాకే అక్కడి నుంచి కదలాలి. పెపైచ్చు ఏటీఎంలో లావాదేవీలు జరిపేటపుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితుల సహాయం తీసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి మోసాలకు మీ నిర్లక్ష్యమే కారణమంటూ బ్యాంకులు ఎలాంటి బాధ్యతా వహించవు. స్కిమ్మింగ్.. ఇది కొంచెం అధునాతనమైన మోసం. చిన్న స్కిమ్మర్‌ను ఏటీఎంలోని డెబిట్ కార్డు స్లాట్ వద్ద పెడతారు. అక్కడే మీ పిన్ తెలుసుకోవటానికి చిన్న కెమెరా కూడా పెడతారు. స్కిమ్మర్ మీ కార్డు సమాచారాన్ని మొత్తం రీడ్ చేయగలుగుతుంది. ఒకసారి గనక సమాచారాన్ని కాపీ చేస్తే... దాన్ని వేరే కార్డుపై ప్రింట్ చేయటం తేలికే. పిన్ కూడా తెలుసుకుంటారు కనుక నకిలీ లావాదేవీలు నడిపించేస్తారు. ఏం చేయాలి? బ్యాంకులు సాధారణంగా స్కిమ్మింగ్ లావాదేవీలకు బాధ్యత తీసుకుంటాయి. కాకపోతే ఇలాంటి లావాదేవీ ఒకటి జరిగినట్టు తెలిసినా కస్టమర్ వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేసి కార్డును బ్లాక్ చేయిస్తే సరిపోతుంది. కార్డ్ స్వాపింగ్ కొన్ని సందర్భాల్లో రెస్టారెంట్లలో, పెట్రోల్ పంపుల్లో కార్డు స్వాపింగ్ వంటివి జరుగుతాయి. మీరు పిన్ నంబర్ చెబుతారు కనుక దాన్ని నోట్ చేసుకుంటాడు. మీ కార్డు తీసుకుని... అచ్చం దానిలాగే ఉండే మరో కార్డును మీకు అందజేస్తాడు. నిజానికి ఇలాంటి మోసగాళ్లు తమ వద్ద చాలా కార్డుల్ని ఉంచుకుంటారు. తన దగ్గరున్న కార్డు మీ కార్డుతో మ్యాచ్ అయితే ఇచ్చేస్తాడు. చాలామంది తమకు తిరిగిచ్చిన కార్డు నంబర్, పేరు అన్నీ గమనించరు. ఇక కార్డు చేతిలో ఉండి, పిన్ నెంబర్ కూడా తెలుసు కనక సదరు మోసగాడు వరస లావాదేవీలు జరిపి నగదు కాజేస్తాడు. ఏం చేయాలి? కార్డు ఇచ్చాక పిన్ మీరే ఎంటర్ చేయాలి. ఎవరికి చెప్పొద్దు. మిషన్నే మీ దగ్గరకు తీసుకుని రమ్మనండి. మీరే పిన్ ఎంటర్ చేసి... లావాదేవీ పూర్తవగానే మీ కార్డును వెనక్కి తీసుకోండి. మీ కార్డును జేబులో పెట్టుకునేటపుడు దానిపై మీ పేరు, నంబర్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఎందుకంటే ఇలాంటి మోసాలకు బ్యాంకులు బాధ్యత వహించవు. డెబిట్ కార్డు వాడేటపుడు జాగ్రత్తలు... ⇔ పిన్ను ఎవరూ చూడకుండా ఎంటర్ చేయాలి. ⇔ స్క్రీన్‌పై ‘వెల్కమ్’ కనిపించేదాకా ఆగాలి. మీ లావాదేవీ పూర్తయ్యాక మళ్లీ వెల్కమ్ కనిపించాకే అక్కడి నుంచి నిష్ర్కమించాలి. ⇔ బ్యాంకులో మీ ఖాతాకు మీరు వాడుతున్న మొబైల్ నంబరును అనుసంధానించాలి. ⇔ ఏటీఎంలకు వెళ్లినపుడు అక్కడి పరిసరాలను, వ్యక్తుల్లో అనుమానాస్పదంగా ఏవరైనా ఉంటే జాగ్రత్త వహించాలి. ⇔ ఏటీఎంలో అదనపు పరికరాలేమైనా అమర్చారేమో చూడండి. అక్కడి కెమెరా మీ పిన్ను గమనించే యాంగిల్లో ఉంటే... జాగ్రత్త పడాలి. ⇔ మీ కార్డు పోయినా, మోసానికి గురైనా వెంటనే బ్యాంకుకు సమాచారమిచ్చి బ్లాక్ చేయించాలి. ⇔ పిన్ను ఎప్పుడూ కార్డుపై రాయొద్దు. మనసులోనే గుర్తుంచుకోవాలి. బ్యాంకు ఉద్యోగులతో సహా ఎవ్వరికీ పిన్ చెప్పకూడదు. ⇔ ఏటీఎంలో లావాదేవీలు జరిపేటపుడు మొబైల్ మాట్లాడొద్దు. ఎందుకంటే దృష్టి మరలే అవకాశాలు ఎక్కువ. • ప్రొటెక్షన్ ప్లాన్‌తో కార్డులకు రక్షణ • క్రెడిట్, డెబిట్ నుంచి సిమ్ కార్డు దాకా • ఏడాది వార్షిక ఫీజుతో అన్నిటికీ ప్రొటెక్షన్ • ప్రధాన బ్యాంకులన్నింట్లోనూ అందుబాటులో ప్లాన్ • ఒక్క కాల్‌తో అన్నీ బ్లాక్ చేయొచ్చు సభ్యులకు అదనపు సౌకర్యాలు కూడా మోసాలు జరక్కుండా ఉండటానికి బ్యాంకులు, పేమెంట్ వ్యవస్థలూ ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అయినా మోసం జరిగితే? దాన్నుంచి మీ డెబిట్, క్రెడిట్, ఏటీఎం కార్డుల్ని కాపాడుకోవటానికి మీ స్థాయిలో మీరేం చేయొచ్చు? మీరెలా రక్షణ పొందొచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానంగానే ‘కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్’లు తెరపైకి వస్తున్నాయి. దీంతో లాభమేంటంటే... ఒక్క ఫోన్ కాల్‌తో మీ డెబిట్, క్రెడిట్ కార్డులే కాక పాన్ కార్డు, సిమ్ కార్డు... ఇలా అన్ని కార్డుల్నీ బ్లాక్ చేయించొచ్చు. ఈ సేవలు అన్నిరోజులూ 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ తీసుకున్నవారి కార్డులు పోయినా, చోరీకి గురైనా, స్కిమ్మింగ్ జరిగినా, నకిలీ కార్డుల ద్వారా లావాదేవీలు జరిగినా, ఆన్లైన్లో మోసపోయినా, ఫిషింగ్ లేదా పిన్ ఆధారిత మోసానికి గురైనా... అన్నిటికీ రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం సీపీపీ ఇండియా సంస్థ వివిధ రకాల వార్షిక ఫీజులతో వివిధ రకాల ప్లాన్లను అందజేస్తోంది. వీటిలో ఒక వ్యక్తితో పాటు మొత్తం కుటుంబీకుల కార్డులన్నిటికీ రక్షణ కల్పించే ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ తీసుకున్నవారు ఒకవేళ కార్డులు పోగొట్టుకున్నా, మోసపోయినా తక్షణ సేవలుగా వారికి అత్యవసర ప్రయాణ సహాయం అందుతుంది. మొబైల్స్‌లో ఫ్రాడ్ డిటెక్షన్ సాఫ్ట్వేర్ వేయటం, పాన్‌కార్డు రీప్లేస్మెంట్, టెలీ రిజిస్ట్రేషన్ వంటి సేవలు ఉచితంగా అందజేస్తారు. • ఖాతాల్ని మొబైల్‌తో అనుసంధానం చేయాలి • ఇప్పటిదాకా చేసింది 50 శాతం మందే • ప్రస్తుతం కార్డుదారులకు భయమేమీ లేదు ఎన్సీపీఐ ఎండీ ఎ.పి.హోతా తాజా వ్యవహారంపై దేశీ పేమెంట్ గేట్‌వే ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్సీపీఐ) మేనేజింగ్ డెరైక్టరు ఎ.పి.హోతా దీనిపై ఏమంటారంటే... • ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిందేంటి? మనం గమనించాల్సిందేంటంటే నూటికి నూరుశాతం కష్టమర్లు తమ ఖాతాల్ని తమ మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాలి. కానీ 50 శాతమే చేసుకున్నారని తేలింది. • మొబైల్‌తో అనుసంధానం చేసుకున్నా... చిన్న చిన్న లావాదేవీల్ని బ్యాంకులు మొబైల్‌కు పంపటం లేదుకదా? చాలామంది చిన్నచిన్న లావాదేవీలు చేసేవారే? నిజమే! కానీ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు లావాదేవీ ఎంత చిన్నదైనా మొబైల్‌కు అలెర్ట్ పంపాలి. అందుకు ఛార్జీలు వసూలు చేసినా పర్వాలేదు. కానీ కొన్ని బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించి, లావాదేవీకి ఒక పరిమితి పెట్టుకున్నాయి. అది దాటితేనే అలెర్ట్‌లు పంపుతున్నాయి. అన్ని బ్యాంకులూ ఆర్ బీఐ చెప్పినట్లు చేస్తే బాగుంటుంది. • మీరేమో కార్డుదారులు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఎలా? నిజమే! మోసగాళ్లు సమాచారాన్ని తస్కరించటమనేది మే, జూన్ నెలల్లో జరిగింది. వాళ్లు దాని ఆధారంగా కార్డులు తయారుచేసి వాడటానికి కొంత సమయం కావాలి. జులైలో ఇది జరిగినా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వాళ్లు పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపి ఉండాల్సింది. కానీ రూ.1.3 కోట్ల విలువైన 641 లావాదేవీలు మాత్రమే చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి. మిగిలిన కస్టమర్లు తమ పిన్ నెంబర్లు మార్చుకున్నారు. మార్చుకోనివారి కార్డుల్ని బ్యాంకులు బ్లాక్ చేశాయి. అందుకే భయం లేదని చెబుతున్నాం. • ఈ వ్యవహారంలో నష్టపోయినవారికి పరిహారం చెల్లించేదెవరు? ఆర్ బీఐ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. కస్టమర్లకు వారి బ్యాంకులే పరిహారం ఇవ్వాలి. ఒకవేళ ఆ తప్పిదం వేరొక బ్యాంక్ కారణంగా జరిగిందని తేలితే... ఆ బ్యాంకు ఈ బ్యాంకుకు పరిహారం చెల్లిస్తుంది. అంతే తప్ప కస్టమర్ నష్టపోయే అవకాశం లేదు. ఈ పరిణామం వల్ల ఆర్బీఐ చెబుతున్న క్యాష్‌లెస్ వ్యవస్థ దెబ్బతినే అవకాశముందా? నా ఉద్దేశం ప్రకారం మన పేమెంట్ వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. క్యాష్‌లెస్ వ్యవస్థకు మారాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పూ ఉండదు. దానిపై ఈ ప్రభావం కూడా ఉండదనే నా ఉద్దేశం. మొబైల్ యాప్‌లకూ రక్షణ ముఖ్యం • ఇంటర్నెట్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్త • బహిరంగ, రక్షణ లేని కనెక్షన్లు వాడొద్దు • వాటితో బ్యాంకు లావాదేవీలు అసలే వద్దు నిపుణుల సూచనలు ⇔ డెబిట్ కార్డుదారుల సమాచారం మోసగాళ్ల చేతిలోకి వెళ్లింది. మరి రోజూ మొబైల్ ద్వారానే అన్ని చెల్లింపులూ చేసేవారి సంగతేంటి? వారె లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులేం చెబుతున్నారో చూద్దాం... ⇔ మీరు ఎక్కడపడితే అక్కడ మీ ఫోన్లను వదిలేసేవారైతే ఫోన్లకు తప్పని సరిగా పాస్వర్డ్ పెట్టుకోండి. అయితే దీనివల్ల మీ ఫోన్‌ను భౌతికంగా యాక్సెస్ చేసుకోలేరు. మరి పబ్లిక్ వైఫై కనెక్షన్ల ద్వారా యాక్సెస్ చేసుకుంటే...? ⇔ ఎప్పుడూ సెక్యూర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్‌నే ఉపయోగించండి. ప్రత్యేకించి బ్యాంకింగ్ లావాదేవీలు చేస్తున్నపుడు ఇది తప్పనిసరి. పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్షన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు ఎంతమాత్రం మంచివి కావు. వేరొకరు మీ ఐపీని యాక్సెస్ చేసుకునే ప్రమాదముంది. ⇔ సెక్యూర్డ్ ఈ-మెయిల్ సర్వీసునే వాడండి. వాటివల్ల పాస్వర్డ్లు ఇంటర్నెట్ సేవలందించే సంస్థ దగ్గర కూడా స్టోర్ కావు. మీ మెయిల్స్ భద్రంగా పంపొచ్చు. చూడొచ్చు. ⇔ మొబైల్ ద్వారా చెల్లింపులు చేసేటపుడు వెబ్సైట్ యూఆర్ఎల్లో హెచ్‌టీటీపీఎస్ ఉందో లేదో చూసుకోండి. ఎస్ అంటే సెక్యూర్ అని అర్థం. ⇔ అప్లికేషన్లను ప్లేస్టోర్ వంటి నమ్మకమైన సోర్స్‌ల నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ సైట్ పడితే ఆ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవటం {శేయస్కరం కాదు. ⇔ మీ మొబైల్స్‌లో, ల్యాప్‌టాప్‌లలో ఎప్పుడూ వ్యక్తిగత సమాచారం స్టోర్ చేయొద్దు. బ్రౌజింగ్ హిస్టరీని, పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి. తరచూ వైరస్ స్కాన్ చేయండి. -
తక్షణమే ఏటీఎం పిన్ మార్చుకోండి!
ముంబై: బ్యాంకు ఏటీఎం కార్డు పిన్, ఆన్ లైన్ లావాదేవీల పాస్ వర్డ్ లు మార్చుకోవాల్సిందిగా బ్యాంకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా హెచ్ డీఎఫ్ సీ, ఫెడరల్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంకు అధికారులు తమ ఖాతాదారులను ఎస్ ఎంఎస్ ల ద్వారా అలర్డ్ చేస్తున్నారు. కేరళ, ఢిల్లీ, చండీఘడ్ రాష్ట్రాల్లో వెలుగు చూసిన స్కాం నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల ఇక్కడ ఏటీఎం కార్డు దారుల లక్షల రూపాయలు మాయమైన కేసులు నమోదు కావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఏటీఎం మోసాలు పెరుగుతున్నాయంటూ ఖాతాదారులకు సేఫ్ బ్యాంకింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. గార్డు లేని, జనావాసాలు లేని ప్రాంతాలలోని ఏటీఎం లావాదేవీలను నివారించాలని బ్యాంకులు కోరాయి. కాగా కేరళలో గత నెలలో రోమేనియన్ వ్యక్తి ఏటీఎం కేంద్రంలో స్కిమ్మింగ్ పరికరాన్ని అమర్చుతూ అరెస్టయిన సంగతి తెలిసిందే. -
ఒక్క ఫోన్ కాల్‌తో రూ. 34 వేలు దొచుకున్నారు
అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ వల్ల ఓ గృహిణి రూ. 34 వేలు పోగొట్టుకుంది. కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పిన గుర్తుతెలియని వ్యక్తి ఏటీఎమ్ పిన్ నెంబర్ తెలుసుకొని అకౌంట్లోని రూ. 34 వేలను డ్రా చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో శుక్రవారం వెలుగచూసింది. స్థానికంగా నివాసముంటున్న గన్నె రమ్యకు అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మాటల సందర్భంగా అతను ఏటీ ఎం పిన్ నెంబర్ అడగడంతో.. రమ్య అనాలోచితంగా తన ఏటీఎం పిన్ నెంబర్ చెప్పింది. కొద్ది సేపట్లోనే ఆమె అకౌంట్ నుంచి రూ. 34 వేలు డ్రా అయ్యాయని ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె లబోదిబోమనుకుంటూ పోలీసులను ఆశ్రయించింది. -
హెడ్డాఫీసు నుంచి మాట్లాడుతున్నా...
బ్యాంక్ హెడ్డ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా అని మాయ మాటలు చెప్పి.. అకౌంట్ నుంచి డబ్బు ఖాళీ చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం ఓగ్లాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పశువుల ఆస్పత్రిలో గోపాలమిత్రగా పనిచేస్తున్న బోయిని శ్రీనివాస్‌కు ఈ నెల 26న ఓ అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేసింది. తాను బ్యాంక్ హెడ్డాఫీసు నుంచి ఫోన్ చేస్తున్నట్లు పరిచయం చేసుకుంది. శ్రీనివాస్‌ను పేరు అడిగి నిర్ధారణ చేసుకుంది. ఆ తర్వాత అతని పూర్తి పేరు, స్టేట్‌బ్యాంకు అకౌంట్, అడ్రస్ అడిగింది. తనకు స్టేట్ బ్యాంకు అకౌంట్ లేదని శ్రీనివాస్ చెప్పటంతో ఆంధ్రాబ్యాంకులో ఉందా అని అడిగింది. దీంతో కొద్ది రోజుల క్రితం తాను పోగొట్టుకున్న ఏటీఎం కి సంబంధించి ఏటీఎం పిన్ నంబర్ సహా వివరాలు చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత రూ.5000వేలు డ్రా అయినట్లు, తరువాత రెండు సార్లు రూ.4000, మళ్లీ రూ.5000వేలు.. ఇలా మెత్తం రూ.18,000 డ్రా చేసినట్లు శ్రీనివాస్ ఫోన్‌కు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో కంగుతిన్న శ్రీనివాస్ ఆంధ్రాబ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. వారి సూచన మేరకు వెంటనే ఈ విషయాన్ని పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్బీఐ హెడ్డాఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని అడగటం వల్లనే ఏటిఎం కార్డు పిన్ నంబర్ చెప్పానని బాధితుడు శ్రీనివాస్ తెలిపాడు. ఆరు నెలల క్రితం తన స్టేట్ బ్యాంకు ఏటీఎం కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ లు పోయాయని వివరించాడు. వాటి గురించే అడుగుతున్నారని భావించి పూర్తి వివరాలు చెప్పానని శ్రీనివాస్ వాపోయాడు.