కార్డు..ఫోను..ఆదమరిస్తే అంతే!! | Debit card and ATM card fraud special story | Sakshi
Sakshi News home page

కార్డు..ఫోను..ఆదమరిస్తే అంతే!!

Published Mon, Oct 24 2016 2:54 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

కార్డు..ఫోను..ఆదమరిస్తే అంతే!!

కార్డు..ఫోను..ఆదమరిస్తే అంతే!!

65 లక్షల డెబిట్ కార్డుల సమాచారం మోసగాళ్ల చేతికి
పోలీసుల దర్యాప్తులో పెరుగుతున్న సంఖ్య
తక్షణం అంతా పిన్ మార్చుకోవాలంటూ బ్యాంకుల సలహా
ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదంటున్న ఎన్‌సీపీఐ
మోసపోయిన వారికి అండగా కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌లు
మొబైల్ పేమెంట్లలోనూ జాగ్రత్త అవసరమంటున్న నిపుణులు
‘డెబిట్ కార్డు ఫ్రాడ్’ నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం...

రోటీ... కపడా... ఔర్ మకాన్...!! ఇంతేనా? ఇపుడీ జాబితాలో మొబైల్ కూడా చేరిపోయింది. విలాసం నుంచి అవసరంగా... అక్కడి నుంచి అత్యవసరంగా మారిపోయింది. బస్సు, రైలు, విమానం నుంచి ఆఖరికి సినిమా టికెట్లు కొనటానికీ మొబైలే. కరెంటు, మొబైల్, వాటర్ బిల్లుల నుంచి ఆటో చార్జీలు చెల్లించడానికీ మొబైలే. ఇక మొబైల్ లేని బ్యాంకింగ్ లావాదేవీల్ని ఊహించలేం కూడా!!.

 3జీ, 4జీ ఇంటర్నెట్ ధరలు దిగిరావటం, నగదు రహిత లావాదేవీల్ని  ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం, మొబైల్ విప్లవం... ఇవన్నీ కలిసి ఈ ఎలక్ట్రానిక్ లావాదేవీల్ని వేగంగా పెంచుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో భారీ ఎత్తున డెబిట్ కార్డు హోల్డర్ల సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కింది. ఇప్పటిదాకా 32 లక్షల డెబిట్ కార్డు హోల్డర్ల సమాచారమే వారి చేతికి వెళ్లిందని బ్యాంకులు చెబుతుండగా... తాజాగా పోలీసు దర్యాప్తులో అది 65 లక్షలను మించి ఉంటుందని తేలింది.

మున్ముందు ఈ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. మరి ఇలాంటి పరిణామాలు ఎలక్ట్రానిక్ లావాదేవీలపై ప్రభావం చూపిస్తాయా? ఇంతకీ ఇలా తస్కరించిన డేటాతో మోసగాళ్లు ఏం చేస్తారు? ఏటీఎం లావాదేవీల్లో బ్యాంకులు, పేమెంట్ సంస్థలు కాకుండా ఔట్‌సోర్సింగ్ సేవలందించే థర్డ్‌పార్టీ కంపెనీల ప్రమేయమెంత? బ్యాంకులు తమ ఖాతాదారులు నష్టపోకుండా ఏం చేస్తున్నాయి? ఒకవేళ ఎవరెన్ని చేసినా మోసపోకుండా ఉండేందుకు మనమేం చెయ్యాలి? మన కార్డుల్ని భద్రంగా ఉంచుకోవటం ఎలా? అతితెలివి చూపిస్తున్న మోసగాళ్ల వలలో పడకుండా ఉండటమెలా? ఒకవేళ ఎన్ని చేసినా మనం మోసపోతే ఆ మేరకు రక్షణ పొందటం ఎలా? ఇవన్నీ వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...

ఒక్కసారిగా కలకలం..
సెప్టెంబర్ మొదటి వారం వరకూ అంతా మామూలుగానే ఉంది. తొలివారంలో మాత్రం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులున్న కొందరి మొబైల్స్‌కు... మీరు చైనా లో ఫలానా లావాదేవీ చేశారు!! అమెరికాలో ఫలానా లావాదేవీ చేశారు!!. అంటూ మెసేజ్‌లు రావటం మొదలైంది. వెంటనే వారు తమ బ్యాంకులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులన్నీ కలసి... దేశం లో పేమెంట్ వ్యవస్థను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సెప్టెంబర్ 5న ఫిర్యాదు చేశాయి. అది దర్యాప్తు చేసి... దేశంలో ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ సేవలందించే హిటాచీ పేమెంట్ సర్వీసెస్ కంప్యూటర్లలోకి వైరస్ (మాల్‌వేర్) ప్రవేశించిందని తేల్చింది.

తద్వారా 90 ఏటీఎంలలో కార్డుదారుల సమాచారం చోరీకి గురైందని తేల్చింది. దీంతో వీసా, మాస్టర్‌కార్డ్, రూపే వంటి పేమెంట్ సంస్థల సూచనల మేరకు... బ్యాంకులన్నీ తమ ఖాతా దారులకు పిన్ నంబరు మార్చుకోమని సూచించాయి. కొన్నింటిని బ్లాక్ చేశాయి. వారికి కొత్త కార్డులు జారీ చేయటం కూడా ఆరంభించాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఇండియాలో బ్యాంకులన్నీ 71.23 కోట్ల కార్డులు జారీ చేశాయి.

 మాల్‌వేర్ పనిచేసేదెలా?
కంప్యూటర్ ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ ఎలాగో... ట్రోజన్లు, వైరస్‌లు, వార్మ్‌లు, రాన్సమ్‌వేర్, స్పైవేర్స్ కూడా అలాంటివే. కాకపోతే ఇవన్నీ మాయ సాఫ్ట్‌వేర్లు. అందుకే వీటిని మాల్‌వేర్స్‌గా పిలుస్తారు. ఇలాంటి మాల్‌వేర్... కంప్యూటర్ వ్యవస్థల్ని, ఏటీఎంలను, బ్యాంకుల సర్వర్లను దెబ్బతీసి దాన్లోని రహస్య డెబిట్ కార్డు డేటాను మోసగాళ్లకు చేరవేస్తుంది. తాజా వ్యవహారంలో జరిగిందేమంటే... అప్పటికే 90 ఏటీఎంలలో ఆ మాల్‌వేర్ ఉంది. వాటిలో స్వైప్ చేసిన కార్డు వివరాలను పిన్‌తో సహా మోసగాళ్లకు చేరవేసింది. వాళ్లు ఆ డేటా ఆధారంగా నకిలీ కార్డులు తయారు చేసి... వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో వినియోగించటానికి పథకం వేశారు. ఇదంతా వివిధ దేశాల్లోని మోసగాళ్లు కలిసి చేసేది కావటంతో... డెబిట్ కార్డుల్ని వినియోగించటం కూడా దాదాపు ఒకే సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అయితే తాజా వ్యవహారంలో అమెరికా, చైనాల్లో జరిగాక మన బ్యాంకులు అప్రమత్తం కావటంతో పెను ముప్పు తప్పిందనేది నిపుణుల భావన.

 తాజా వ్యవహారంపై అంతర్జాతీయంగా కార్డులకు ప్రమాణాలు నిర్దేశించే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ (పీసీఐడీఎస్‌ఎస్) కూడా దర్యాప్తునకు ఆదేశించింది.

ఎవరు బాధ్యులు?
ఆర్‌బీఐ సర్క్యులర్ ప్రకారం... థర్డ్ పార్టీ లావాదేవీ నిర్వహిస్తే దానికి కస్టమర్ బాధ్యత ఉండదు. కాకపోతే కస్టమరు ఆ విషయాన్ని బ్యాంకు నుంచి సమాచారం వచ్చిన మూడు పని దినాల్లోగా బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. సదరు పరిణామానికి బ్యాంకు నిర్లక్ష్యమే కారణమై ఉండాలి కూడా. ఖాతాదారుడి నిర్లక్ష్యం, తెలివితక్కువ తనం వల్ల ఆ మోసం జరిగినట్లు గనక తేలితే దానికి బ్యాంకు బాధ్యత వహించదు.

ఏటీఎం ఫ్రాడ్‌లలో రకాలివీ...
కీ ప్యాడ్ జామింగ్
ఏటీఎం యంత్రాల్లో ఎంటర్, క్యాన్సిల్ బటన్లున్న చోట మోసగాళ్లు పిన్‌లు, బ్లేడ్ల వంటివి పెట్టడమో లేకపోతే వాటిని ఫెవికాల్‌తో అతికించటమో చేసి అవి పనిచేయకుండా చూస్తారు. కస్టమరు మొత్తం లావాదేవీని నమోదు చేసి ఎంటర్ చేయబోతే అతి పనిచేయదు. పోనీ క్యాన్సిల్ చేద్దామన్నా పనిచేయదు. దీంతో చాలా సందర్భాల్లో కస్టమర్ విసుగ్గా వెనక్కెళ్లి పోతాడు. ఆ పక్కనే తిరుగుతుండే మోసగాడు... ఆ లావాదేవీ క్యాన్సిల్ అయ్యేలోపు చొరబడి పని పూర్తిచేసుకుంటాడు.

 ఏం చేయాలి?
ఒక్కో లావాదేవీ కనీసం 30 సెకెన్ల సమయం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి జరిగితే మీరు ఆ 30 సెకెన్లూ అక్కడే ఉండాలి. మీ లావాదేవీ క్యాన్సిల్ అయినట్లు స్క్రీన్‌పై చూశాకే అక్కడి నుంచి కదలాలి. పెపైచ్చు ఏటీఎంలో లావాదేవీలు జరిపేటపుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితుల సహాయం తీసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి మోసాలకు మీ నిర్లక్ష్యమే కారణమంటూ బ్యాంకులు ఎలాంటి బాధ్యతా వహించవు.

స్కిమ్మింగ్..
ఇది కొంచెం అధునాతనమైన మోసం. చిన్న స్కిమ్మర్‌ను ఏటీఎంలోని డెబిట్ కార్డు స్లాట్ వద్ద పెడతారు. అక్కడే మీ పిన్ తెలుసుకోవటానికి చిన్న కెమెరా కూడా పెడతారు. స్కిమ్మర్ మీ కార్డు సమాచారాన్ని మొత్తం రీడ్ చేయగలుగుతుంది. ఒకసారి గనక సమాచారాన్ని కాపీ చేస్తే... దాన్ని వేరే కార్డుపై ప్రింట్ చేయటం తేలికే. పిన్ కూడా తెలుసుకుంటారు కనుక నకిలీ లావాదేవీలు నడిపించేస్తారు.

 ఏం చేయాలి?
బ్యాంకులు సాధారణంగా స్కిమ్మింగ్ లావాదేవీలకు బాధ్యత తీసుకుంటాయి. కాకపోతే ఇలాంటి లావాదేవీ ఒకటి జరిగినట్టు తెలిసినా కస్టమర్ వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేసి కార్డును బ్లాక్ చేయిస్తే సరిపోతుంది.

కార్డ్ స్వాపింగ్
కొన్ని సందర్భాల్లో రెస్టారెంట్లలో, పెట్రోల్ పంపుల్లో కార్డు స్వాపింగ్ వంటివి జరుగుతాయి. మీరు పిన్ నంబర్ చెబుతారు కనుక దాన్ని నోట్ చేసుకుంటాడు. మీ కార్డు తీసుకుని... అచ్చం దానిలాగే ఉండే మరో కార్డును మీకు అందజేస్తాడు. నిజానికి ఇలాంటి మోసగాళ్లు తమ వద్ద చాలా కార్డుల్ని ఉంచుకుంటారు. తన దగ్గరున్న కార్డు మీ కార్డుతో మ్యాచ్ అయితే ఇచ్చేస్తాడు. చాలామంది తమకు తిరిగిచ్చిన కార్డు నంబర్, పేరు అన్నీ గమనించరు. ఇక కార్డు చేతిలో ఉండి, పిన్ నెంబర్ కూడా తెలుసు కనక సదరు మోసగాడు వరస లావాదేవీలు జరిపి నగదు కాజేస్తాడు.

 ఏం చేయాలి?
కార్డు ఇచ్చాక పిన్ మీరే ఎంటర్ చేయాలి. ఎవరికి చెప్పొద్దు. మిషన్‌నే మీ దగ్గరకు తీసుకుని రమ్మనండి. మీరే పిన్ ఎంటర్ చేసి... లావాదేవీ పూర్తవగానే మీ కార్డును వెనక్కి తీసుకోండి. మీ కార్డును జేబులో పెట్టుకునేటపుడు దానిపై మీ పేరు, నంబర్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఎందుకంటే ఇలాంటి మోసాలకు బ్యాంకులు బాధ్యత వహించవు.

డెబిట్ కార్డు వాడేటపుడు జాగ్రత్తలు...

పిన్‌ను ఎవరూ చూడకుండా ఎంటర్ చేయాలి.

స్క్రీన్‌పై ‘వెల్‌కమ్’ కనిపించేదాకా ఆగాలి. మీ లావాదేవీ పూర్తయ్యాక మళ్లీ వెల్‌కమ్ కనిపించాకే అక్కడి నుంచి నిష్ర్కమించాలి.

బ్యాంకులో మీ ఖాతాకు మీరు వాడుతున్న మొబైల్ నంబరును అనుసంధానించాలి.

ఏటీఎంలకు వెళ్లినపుడు అక్కడి పరిసరాలను, వ్యక్తుల్లో అనుమానాస్పదంగా ఏవరైనా ఉంటే జాగ్రత్త వహించాలి.

ఏటీఎంలో అదనపు పరికరాలేమైనా అమర్చారేమో చూడండి. అక్కడి కెమెరా మీ పిన్‌ను గమనించే యాంగిల్‌లో ఉంటే... జాగ్రత్త పడాలి.

మీ కార్డు పోయినా, మోసానికి గురైనా వెంటనే బ్యాంకుకు సమాచారమిచ్చి బ్లాక్ చేయించాలి.

పిన్‌ను ఎప్పుడూ కార్డుపై రాయొద్దు. మనసులోనే గుర్తుంచుకోవాలి. బ్యాంకు ఉద్యోగులతో సహా ఎవ్వరికీ పిన్ చెప్పకూడదు.

ఏటీఎంలో లావాదేవీలు జరిపేటపుడు మొబైల్ మాట్లాడొద్దు. ఎందుకంటే దృష్టి మరలే అవకాశాలు ఎక్కువ.

ప్రొటెక్షన్ ప్లాన్‌తో కార్డులకు రక్షణ
క్రెడిట్, డెబిట్ నుంచి సిమ్ కార్డు దాకా
ఏడాది వార్షిక ఫీజుతో అన్నిటికీ ప్రొటెక్షన్
ప్రధాన బ్యాంకులన్నింట్లోనూ అందుబాటులో ప్లాన్
ఒక్క కాల్‌తో అన్నీ బ్లాక్ చేయొచ్చు సభ్యులకు అదనపు సౌకర్యాలు కూడా

మోసాలు జరక్కుండా ఉండటానికి బ్యాంకులు, పేమెంట్ వ్యవస్థలూ ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అయినా మోసం జరిగితే? దాన్నుంచి మీ డెబిట్, క్రెడిట్, ఏటీఎం కార్డుల్ని కాపాడుకోవటానికి మీ స్థాయిలో మీరేం చేయొచ్చు? మీరెలా రక్షణ పొందొచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానంగానే ‘కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్’లు తెరపైకి వస్తున్నాయి. దీంతో లాభమేంటంటే...

ఒక్క ఫోన్ కాల్‌తో మీ డెబిట్, క్రెడిట్ కార్డులే కాక పాన్ కార్డు, సిమ్ కార్డు... ఇలా అన్ని కార్డుల్నీ బ్లాక్ చేయించొచ్చు. ఈ సేవలు అన్నిరోజులూ 24 గంటలూ అందుబాటులో ఉంటాయి.

ఈ ప్లాన్ తీసుకున్నవారి కార్డులు పోయినా, చోరీకి గురైనా, స్కిమ్మింగ్ జరిగినా, నకిలీ కార్డుల ద్వారా లావాదేవీలు జరిగినా, ఆన్‌లైన్లో మోసపోయినా, ఫిషింగ్ లేదా పిన్ ఆధారిత మోసానికి గురైనా... అన్నిటికీ రక్షణ లభిస్తుంది.

ప్రస్తుతం సీపీపీ ఇండియా సంస్థ వివిధ రకాల వార్షిక ఫీజులతో వివిధ రకాల ప్లాన్‌లను అందజేస్తోంది. వీటిలో ఒక వ్యక్తితో పాటు మొత్తం కుటుంబీకుల కార్డులన్నిటికీ రక్షణ కల్పించే ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్లాన్ తీసుకున్నవారు ఒకవేళ కార్డులు పోగొట్టుకున్నా, మోసపోయినా తక్షణ సేవలుగా వారికి అత్యవసర ప్రయాణ సహాయం అందుతుంది. మొబైల్స్‌లో ఫ్రాడ్ డిటెక్షన్ సాఫ్ట్‌వేర్ వేయటం, పాన్‌కార్డు రీప్లేస్‌మెంట్, టెలీ రిజిస్ట్రేషన్ వంటి సేవలు ఉచితంగా అందజేస్తారు.

ఖాతాల్ని మొబైల్‌తో అనుసంధానం చేయాలి
ఇప్పటిదాకా చేసింది 50 శాతం మందే
ప్రస్తుతం కార్డుదారులకు భయమేమీ లేదు ఎన్‌సీపీఐ ఎండీ ఎ.పి.హోతా

 తాజా వ్యవహారంపై దేశీ పేమెంట్ గేట్‌వే ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్‌సీపీఐ) మేనేజింగ్ డెరైక్టరు ఎ.పి.హోతా దీనిపై ఏమంటారంటే...

ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిందేంటి?
మనం గమనించాల్సిందేంటంటే నూటికి నూరుశాతం కష్టమర్లు తమ ఖాతాల్ని తమ మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాలి. కానీ 50 శాతమే చేసుకున్నారని తేలింది.

మొబైల్‌తో అనుసంధానం చేసుకున్నా... చిన్న చిన్న లావాదేవీల్ని బ్యాంకులు మొబైల్‌కు పంపటం లేదుకదా? చాలామంది చిన్నచిన్న లావాదేవీలు చేసేవారే?
నిజమే! కానీ ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు లావాదేవీ ఎంత చిన్నదైనా మొబైల్‌కు అలెర్ట్ పంపాలి. అందుకు ఛార్జీలు వసూలు చేసినా పర్వాలేదు. కానీ కొన్ని బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించి, లావాదేవీకి ఒక పరిమితి పెట్టుకున్నాయి. అది దాటితేనే అలెర్ట్‌లు పంపుతున్నాయి. అన్ని బ్యాంకులూ ఆర్ బీఐ చెప్పినట్లు చేస్తే బాగుంటుంది.

 మీరేమో కార్డుదారులు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఎలా?
నిజమే! మోసగాళ్లు సమాచారాన్ని తస్కరించటమనేది మే, జూన్ నెలల్లో జరిగింది. వాళ్లు దాని ఆధారంగా కార్డులు తయారుచేసి వాడటానికి కొంత సమయం కావాలి. జులైలో ఇది జరిగినా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వాళ్లు పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపి ఉండాల్సింది. కానీ రూ.1.3 కోట్ల విలువైన 641 లావాదేవీలు మాత్రమే చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి. మిగిలిన కస్టమర్లు తమ పిన్ నెంబర్లు మార్చుకున్నారు. మార్చుకోనివారి కార్డుల్ని బ్యాంకులు బ్లాక్ చేశాయి. అందుకే భయం లేదని చెబుతున్నాం.

•  ఈ వ్యవహారంలో నష్టపోయినవారికి పరిహారం చెల్లించేదెవరు?
ఆర్ బీఐ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. కస్టమర్లకు వారి బ్యాంకులే పరిహారం ఇవ్వాలి. ఒకవేళ ఆ తప్పిదం వేరొక బ్యాంక్ కారణంగా జరిగిందని తేలితే... ఆ బ్యాంకు ఈ బ్యాంకుకు పరిహారం చెల్లిస్తుంది. అంతే తప్ప కస్టమర్ నష్టపోయే అవకాశం లేదు.

ఈ పరిణామం వల్ల ఆర్‌బీఐ చెబుతున్న క్యాష్‌లెస్ వ్యవస్థ దెబ్బతినే అవకాశముందా?

నా ఉద్దేశం ప్రకారం మన పేమెంట్ వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. క్యాష్‌లెస్ వ్యవస్థకు మారాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పూ  ఉండదు. దానిపై ఈ ప్రభావం కూడా ఉండదనే నా ఉద్దేశం.

మొబైల్ యాప్‌లకూ రక్షణ ముఖ్యం
ఇంటర్నెట్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్త
బహిరంగ, రక్షణ లేని కనెక్షన్లు వాడొద్దు
వాటితో బ్యాంకు లావాదేవీలు అసలే వద్దు  నిపుణుల సూచనలు

డెబిట్ కార్డుదారుల సమాచారం మోసగాళ్ల చేతిలోకి వెళ్లింది. మరి రోజూ మొబైల్ ద్వారానే అన్ని చెల్లింపులూ చేసేవారి సంగతేంటి? వారె లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులేం చెబుతున్నారో చూద్దాం...

 మీరు ఎక్కడపడితే అక్కడ మీ ఫోన్లను వదిలేసేవారైతే ఫోన్లకు తప్పని సరిగా పాస్‌వర్డ్ పెట్టుకోండి. అయితే దీనివల్ల మీ ఫోన్‌ను భౌతికంగా యాక్సెస్ చేసుకోలేరు. మరి పబ్లిక్ వైఫై కనెక్షన్ల ద్వారా యాక్సెస్ చేసుకుంటే...?

 ఎప్పుడూ సెక్యూర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్‌నే ఉపయోగించండి. ప్రత్యేకించి బ్యాంకింగ్ లావాదేవీలు చేస్తున్నపుడు ఇది తప్పనిసరి. పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్షన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు ఎంతమాత్రం మంచివి కావు. వేరొకరు మీ ఐపీని యాక్సెస్ చేసుకునే ప్రమాదముంది.

 సెక్యూర్డ్ ఈ-మెయిల్ సర్వీసునే వాడండి. వాటివల్ల పాస్‌వర్డ్‌లు ఇంటర్నెట్ సేవలందించే సంస్థ దగ్గర కూడా స్టోర్ కావు. మీ మెయిల్స్ భద్రంగా పంపొచ్చు. చూడొచ్చు.

 మొబైల్ ద్వారా చెల్లింపులు చేసేటపుడు వెబ్‌సైట్ యూఆర్‌ఎల్‌లో హెచ్‌టీటీపీఎస్ ఉందో లేదో చూసుకోండి. ఎస్ అంటే సెక్యూర్ అని అర్థం.

 అప్లికేషన్లను ప్లేస్టోర్ వంటి నమ్మకమైన సోర్స్‌ల నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏ సైట్ పడితే ఆ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవటం {శేయస్కరం కాదు.

మీ మొబైల్స్‌లో, ల్యాప్‌టాప్‌లలో ఎప్పుడూ వ్యక్తిగత సమాచారం స్టోర్ చేయొద్దు. బ్రౌజింగ్ హిస్టరీని, పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి. తరచూ వైరస్ స్కాన్ చేయండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement