బెల్లంపల్లి, న్యూస్‌లైన్ :
తెలంగాణ బిల్లు వెనక్కి పంపిస్తామని సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యల కు మనస్తాపం చెంది ఒంటిపై కిరోసి న్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న రాజ్‌కుమార్(30) అంతిమయాత్ర సోమవారం బెల్లంపల్లిలో జరిగింది. పట్టణంలోని బాబుక్యాంప్‌బస్తీలోని రాజ్‌కుమార్ ఇంటికి తెలంగాణవాదులు, ఆర్యవైశ్యులు తరలివచ్చారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సీహెచ్ శంకర్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు మేడి పున్నం చంద్రు, టీ-జేఏసీ మహి ళా విభాగం బెల్లంపల్లి నియోజకవర్గ
అధ్యక్షురాలు సువర్ణ తదితరులు రాజ్‌కుమార్ భౌతికకాయంపై పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రాజ్‌కుమార్ భార్య పద్మ, కుమారుడు హరికృష్ణను ఓదార్చారు.
పలువురి నివాళి
మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందిన రాజ్‌కుమార్ భౌతికకాయాన్ని రాత్రి ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో అంతిమయాత్ర ప్రారంభమైంది. బాబుక్యాంప్‌బస్తీ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కాగా సింగరేణి కళావేదిక వద్దకు చేరుకోగానే తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురిజాల రవీందర్‌రావు, టీ-జేఏసీ తూర్పు జిల్లా చైర్మన్ గోనె శ్యాంసుందర్‌రావు, మందమర్రి టీ-జేఏసీ కో-కన్వీనర్ హెచ్.రవీందర్, టీ-జేఏసీ తూర్పు జిల్లా అధికార ప్రతినిధి గజెల్లి వెంకటయ్య భౌతికకాయంపై పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ప్రధాన రహదారి, కాంటా చౌరస్తా, పాతబస్టాండ్ ఏరియా మీదుగా షంషీర్‌నగర్‌లోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. వందలాది మంది తెలంగాణవాదుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. రాజ్‌కుమార్ అమర్ రహే.. తెలంగాణ సాధిస్తాం.. అమరుల ఆశయాలు కొనసాగిస్తాం.. జై తెలంగాణ.. ముఖ్యమంత్రి కిరణ్ డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ అంతిమయాత్రలో తెలంగాణవాదులు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.
బంద్ సంపూర్ణం
రాజ్‌కుమార్ మృతికి సంతాపంగా టీ-జేఏసీ, ఆర్యవైశ్య సంఘం ఇచ్చిన పిలుపు మేరకు బెల్లంపల్లిలో సోమవారం బంద్ విజయవంతమైంది. పట్టణంలోని బజార్ ఏరియా, కాల్‌టెక్స్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లోని కిరాణ షాపులు, హోటళ్లు, టేలాలు బంద్ ఉన్నాయి. ఆటోలు, జీపులు, బస్సుల రాకపోకలు నిలిచాయి. పెట్రోల్ బంక్‌లు మూసి ఉంచారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పని చేయలేదు. విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన తెలిపారు. సినిమా థియేటర్లలో ఉదయం పూట ప్రదర్శనలను నిలిపి ఉంచారు. వ్యాపార, వాణిజ్యవర్గాలు సామూహికంగా దుకాణాలు మూసి ఉంచడంతో బజార్ ఏరియా నిర్మానుష్యంగా మారింది. ఉదయం పూట ఆటోలు నడవడంతో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. కాంటా చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కన్నీటి వీడ్కోలు
Published Tue, Jan 28 2014 2:34 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement