భలే మంచి బేరం! | Management private educational institutions | Sakshi
Sakshi News home page

భలే మంచి బేరం!

Published Fri, Jun 12 2015 11:32 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Management private educational institutions

 శ్రీకాకుళం : అడుగడుగునా వ్యాపారం... అదే ప్రైవేటు విద్యాసంస్థల ధ్యేయం. చదువుకునే పుస్తకాల నుంచి వేసుకునే దుస్తుల వరకూ... వాడుకునే షూస్‌నుంచీ... ధరించే టై వరకూ ఏటా కొనుగోలు చేయిస్తూ... తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఒక సంవత్సరం తీసుకునే యూనిఫాంను రెండో ఏడాదీ వాడుకోవడంవల్ల వారి ధ్యేయం నెరవేరడం లేదో... ఏమో... యూనిఫాం సైతం ఏటా మార్చేస్తున్నారు. బట్టల దుకాణాలకు వ్యాపారం పెంచి తద్వారా వచ్చే కమీషన్‌ను నొక్కేస్తున్నారు.
 
  జిల్లాలోని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తరచూ యూనిఫాం మార్చేస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు ఏటా మార్చేస్తుండగా ఇంకొన్ని రెండు మూడేళ్లకోసారి మార్చేస్తున్నారు. బట్టల దుకాణ యజమానులు కమీషన్ ఆశచూపి కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఎరవేస్తున్నారు. ఒక్కో యూనిఫాంకు కనీసం రూ. 500 వరకు వెచ్చించాలి. ప్రతి విద్యార్థికి కచ్చితంగా రెండు యూనిఫాంలు ఉంటేగానీ సర్దుబాటుకాదు.
 
 ఈ లెక్కన ప్రతి తల్లిదండ్రీ ఏడాదికో... రెండేళ్లకో రూ. 1000 వరకు వెచ్చించాలి. అదే ఇద్దరు పిల్లలైతే రెండువేలు ఖర్చుపెట్టాలి. ఇది తల్లిదండ్రులకు భారమైనా షాపు యజమానులు ఇచ్చే రూ. 100 కమీషన్‌కు కొన్ని విద్యాసంస్థలు కక్కుర్తిపడి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయి. కొన్నేళ్లక్రితం వరకు పాఠశాలల యూనిఫాంను పదేళ్లకో పదిహేనేళ్లకో మార్చేవారు. ఇటువంటి విధానాలకు తిలోదకాలిచ్చి దానిని కూడా వ్యాపారంగా మార్చేశారు. గతంలో విద్యార్థులు వారికి నచ్చే షాపులో యూనిఫాం కొనుగోలు చేసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా యాజమాన్యాలు సూచించిన షాపుల్లోనే కొనుగోలు చేయాల్సి వస్తోంది.
 
 ప్రభుత్వ పాఠశాలల్లో మరో రకమైన సమస్య
 ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాం సమస్య మరోలా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే యూనిఫాం రాజీవ్ విద్యా మిషన్ ద్వారా సరఫరా చేస్తున్నారు. తొమ్మిది, పది తరగతులవారు ఎనిమి దో తరగతిలో ఇచ్చిన యూనిఫాంనే వేసుకోవాలి. ఇలా వ్యత్యాసం ఎందు కు చూపిస్తున్నారన్నది ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. గత ఏడాదికి సంబంధించి నాలుగైదు మండలాల విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాం అందలేదు. జిల్లా అధికారులు వీటిపై దృష్టిసా రించాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement