ఒంగోలు సెంట్రల్ : ప్రభుత్వం వద్ద నిధులు లేవనే సాకుతో మహిళా గ్రూపులకు ఉపయోగకరమైన ఆమ్‌ఆద్మీ బీమాను నిలిపి వేసింది. ఈ పథకానికి సంబంధించి తక్షణం రెన్యూవల్స్‌ను నిలిపి వేయాలని డీఆర్‌డీఏ అధికారులకు మంగళవారం ఆదేశించింది. దీంతో ఈ పథకంలో సభ్యులుగా ఉన్న మొత్తం 1,70,735 మంది పరిస్థితి అయోమయంగా తయారైంది. వీరందరినీ రెన్యూవల్ చేయాల్సిందిగా గత నెలలో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటి వరకూ జిల్లాలో కేవలం 27,000 మందిని మాత్రమే రెన్యూవల్ చేశారు.
మిగిలిన వారిని కుడా రెన్యూవల్ చేసే హడావుడిలో ఉండగా మంగళవారం ఈ ఉత్తర్వులు విడుదల కావడంతో నిలిపేశారు. 1,70,735 మందికి రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు కలిపి చెల్లించేది సంవత్సరానికి 5,12,20,500, అయితే ప్రస్తుతం రెన్యూవల్ అయిన 27,000 మంది లబ్ధిదారులకు 8,10,000 మాత్రము చెల్లిస్తే సరిపోతుంది. మిగతా సభ్యులకు సాయం అర్ధంతరంగా ఆపేయడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
ఆమ్ ఆద్మీ పథకం ప్రయోజనం ఇలా...
తెల్ల కార్డుదారులు, భూమిలేని వ్యవసాయదారులు ఈ పథకం కింద అర్హులు. రూ.15 సర్వీసు చార్జీలు కింద చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.150, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.150 చెల్లిస్తారు. లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలు, శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.75 వేలు, పాక్షిక వైకల్యానికి రూ.37,500 సాధారణ మరణానికి రూ.30 వేలు బీమాగా చెల్లిస్తారు. ఒక కుటుంబంలో ఒక పాలసీ ఉంటే ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1200 చొప్పున ఉపకార వేతనాలను కుడా అందిస్తారు.
సరాసరిన ఏటా జిల్లాలో 2000 మంది మరణిస్తుంటారు. వీరికి ఒక్కొక్కరికి కనీసంగా 30,000 వేలు చెల్లించినా సంవత్సరానికి రూ. 6 కోట్లు అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది. దాదాపు 20,000పైగా విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉపకార వేతనాలకుగానూ రెండున్నర కోట్లు ప్రతి సంవత్సరం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిధులన్నీ ఇక ముందు విడుదలయ్యే అవకాశం లేదు.
ఆమ్ ఆద్మీకి మంగళం
Published Wed, Mar 11 2015 3:59 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement