1996 నవంబర్ 4.. బంగాళాఖాతంలో చిన్న తుపాను పుట్టినట్టు హెచ్చరిక.. ఉరుములు లేవు. మెరుపులూ లేవు. 6వ తేదీన ఒక్క సారిగా దిశ మార్చుకున్న ఆ చిన్న తుపాను రాత్రికి రాత్రి కాకినాడ వద్ద తీరాన్ని తాకింది. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గ్రామాలపైకి దూసుకొచ్చి కల్లోలం సృష్టించింది. వందలాది జాలర్ల ఆచూకీ గల్లంతైంది. 1,077 మంది మరణించగా.. 6,47,554 ఇళ్లు దెబ్బతిన్నాయి.
కాకినాడకు దక్షిణాన గల గ్రామాలతోపాటు కోనసీమలోని తీర గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. వాటిలో కొబ్బరిచెట్లపాలెం ఒకటి. నాటి ఉపద్రవాన్ని తట్టుకోలేక విలవిల్లాడిన ఆ గ్రామం ఇప్పుడు తుపానులన్నా.. కాకినాడ సమీపంలో తీరాన్ని దాటుతాయన్నా నిశ్చింతగా ఉంటోంది. దీనికి కారణం కోరంగి మడ అడవులే.
సాక్షి, అమరావతి: నదీ ముఖద్వారాల వద్ద.. సముద్రం ఆటుపోట్లకు గురయ్యే ప్రదేశంలో పెరిగే ప్రత్యేక జాతికి చెందిన మొక్కలను మడ అంటారు. వందలాది ఎకరాల్లో దట్టంగా అల్లుకుపోయే వీటి సమూహాన్ని మడ అడవులుగా పిలుస్తారు. ఇవి ఉప్పు నీటిని తట్టుకుంటాయి. పోటు సమయంలో నీట మునిగినా చచ్చిపోవు. కొన్ని మొక్కల ఆకుల్లో ఉప్పును స్రవించే గ్రంథులుంటాయి. వీటి వేర్లు ఉప్పు నీటిని వడపోసి మంచినీటిగా మార్చుకుంటాయి. మడ చెట్లు ముఖ్యంగా మత్స్య సంపద పెరగటానికి, సముద్ర కోతను అరికట్టడానికి, తుపాన్లు, సునామీల తీవ్రత నుంచి తీర గ్రామాలను రక్షించటానికి ఉపయోగపడతాయి.
ఇంతటి ప్రాధాన్యత గల మడ అడవుల విస్తీర్ణం 1990 కాలం నుంచి తగ్గిపోవడం ఆరంభమైంది. వంట చెరకు కోసం కొందరు, తీర ప్రాంతాల్లో చేపల చెరువుల కోసం మరికొందరు మడ అడవుల్ని విచక్షణా రహితంగా నరికేశారు. ఫలితంగా 1996లో సంభవించిన తుపానుకు తీర గ్రామాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మడ అడవుల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం వాటిని అభయారణ్యాలుగా ప్రకటించి సంరక్షణ చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలో 58 వేల హెక్టార్లలో..
తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి, సముద్ర తీరం వెంబడి 33 వేల హెక్టార్లు, కృష్ణా, గుంటూరు తీర ప్రాంతాల్లో 25 వేల హెక్టార్లలో మడ అడవులు ఉన్నాయి. వీటి రక్షణతోపాటు విస్తీర్ణాన్ని పెంచేందుకు రాష్ట్ర అటవీ శాఖ నడుం కట్టింది. వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి మడ అడవుల పెంపకాన్ని చేపట్టింది. డాక్టర్ స్వామినాథన్ పరిశోధనా సంస్థతో కలసి కాకినాడ సమీపంలోని కోరంగి అభయారణ్యంలో మడ మొక్కల నర్సరీని ఏర్పాటు చేసింది. ఇందులో 22 రకాల మొక్కలను, కాట్రేనికోన ప్రాంతంలో మాత్రమే ఉన్న ఓ జాతి మొక్కలను కూడా ప్రత్యేకంగా అంటుకట్టి పెంచుతున్నారు. మరికొన్ని జాతులపై పరిశోధనలు సాగిస్తున్నారు.
విస్తీర్ణాన్ని పెంచుతున్నాం
1996లో మడ అడవులు లేకపోవడం వల్ల మా ఊరు భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. దీంతో మడ పెంపకంపై దృష్టి పెట్టాం. స్వామినాథన్ ఫౌండేషన్ వంటి జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు మాకు అండగా నిలిచాయి. ఉన్న మడను కాపాడుకుంటూ.. కొత్త మొక్కలు వేసుకుంటూ వస్తున్నాం. పదేళ్లలో మేం వేసిన మొక్కలు ఇప్పుడు 3 మీటర్ల ఎత్తు పెరిగాయి. ఐదారు వందల హెక్టార్లకు విస్తరించాయి. సుమారు 20 గ్రామాలకు పెట్టని కోటగా నిలుస్తున్నాయి. దీనివల్లే గడచిన దశాబ్ద కాలంలో ఎన్ని తుపాన్లు వచ్చినా ప్రాణనష్టం జరగలేదు.
– ఎం.సత్యారావు, మాజీ సర్పంచ్, కొబ్బరిచెట్ల పాలెం
ఎందుకు పెంచాలంటే..
వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి రుతువులు గతి తప్పాయి. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతోంది. 2,100 నాటికి 0.18 మిల్లీవీుటర్ల నుంచి 0.50 మిల్లీవీుటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇదే జరిగితే తీర ప్రాంతాల్లో చాలా ఆవాసాలు కనుమరుగవుతాయి. మడ అడవుల్ని పెంచితే అలలు ఉధృతి నుంచి, సముద్రం కోత నుంచి గ్రామాలను కాపాడతాయి. ఆస్తి, ప్రాణ నష్టాల్ని నివారిస్తాయి. మడ అడవులు కొంగలు, లకుముకి పిట్టలు, గద్దలు, ఏటి పిల్లులు, నీటి కుక్కలు, డాల్ఫిన్లు, నక్కలు, చేపలు, రొయ్యలు, పీతలు వంటి జీవ జాతులకు ఆవాసాలుగా ఉంటాయి. మడ చెట్లు ఉన్నచోట రొయ్యల సంపద ఎక్కువ.
– డాక్టర్ రామసుబ్రహ్మణ్యం,
స్వామినాథన్ పౌండేషన్ పరిశోధనా సంస్థ
Comments
Please login to add a commentAdd a comment