
ప్రమాణస్వీకారానికి పలువురు ప్రముఖులు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి బిజెపి అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, సినీమా రంగంతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తరలి వస్తున్నారు. గుంటూరు-విజయవాడ మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న 70 ఎకరాల ఖాళీ ప్రదేశంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. టిడిపి కార్యకర్తలు వేలాదిగా తరలివస్తున్నారు.
ఈ కార్యక్రమానాకి బయలుదేరిన బిజేపి అగ్రనేత అద్వానీ, కేంద్ర మంత్రులు మురళీమనోహర్ జోషి, నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్ తదితరులతోపాటు అయిదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా వారు సభాస్థలికి చేరుకుంటారు. అయితే రోడ్డు మార్గంలో వాహనాల రాకపోకల రద్దీ బాగా ఉంది. ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రముఖుల రాకతో విజయవాడ-గుంటూరు నగరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. బిజెపి నాయకులతోపాటు సినిమా నటులు కూడా రావడంతో వారిని చూసేందుకు జనం తరలి వస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు నారా కుటుంబ సభ్యులు గన్నవరం విమానాశ్రయం నుంచి బస్సులలో సభాస్థలికి వస్తున్నారు.
ఈ రోజు రాత్రి 7 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆయనతోపాటు 19 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.