జలం..జీవం
గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించిన అపరభగీరథుడు వైఎస్సార్
*80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ,
*2.56 లక్షల మందికి తాగునీటి సౌకర్యం
*రూ. 592 కోట్లు విడుదల చేసిన నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి
*మహానేత మరణానంతరం గుండ్లకమ్మను గాలికొదిలేసిన కాంగ్రెస్
బాబు విదిల్చింది కేవలం రూ.33 కోట్లు
2004లో చంద్రబాబు పాలనా కాలం ముగియబోతుండగా ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలనే దురుద్దేశంతో గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తానని మొక్కుబడిగా జీఓ జారీ చేశారు. ఆగమేఘాలపై శిలాఫలకం వేశారు. తీరా ప్రాజెక్ట్ నిర్మాణానికి చంద్రబాబు కేటాయించింది ఎంతా అంటే కేవలం రూ. 33 కోట్లు.
గుండ్లకమ్మ నది నుంచి ఏటా 3.5 నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా కలుస్తుంది. ఈ నీటి వృథాను అరికడితే వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కావడంతో పాటు రెండున్నర లక్షల మందికి తాగునీరు అందుతుంది. వైఎస్సార్ కంటే ముందు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. వైఎస్సార్ సీఎం కాగానే జలయజ్ఞంలో భాగంగా * 592 కోట్లు కేటాయించి మద్దిపాడు మండలంలోని చిన్నమల్లవరం వద్ద 3.875 టీఎంసీల సామర్థ్యం గల కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్మించారు.
మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, కొరిశపాడు, ఇంకొల్లు, జే.పంగులూరు, చినగంజాం, ఒంగోలు మండలాల పరిధిలోని 80,060 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు ఎడమ కాలువ కింద 27.975 కిలోమీటర్ల పొడవునా 50,060 ఎకరాలను సాగులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కుడి కాలువ కింద 27.262 కి.మీ పొడవునా 28 వేల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో అన్నంగి తప్ప మిగిలిన 11 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించారు.
వైఎస్సార్ మరణంతో పనుల్లో జాప్యం
వైఎస్సార్ హయాంలో చకచకా సాగిన ప్రాజెక్టు నిర్మాణ పనులు.. ఆయన మరణించాక నత్తనడకన సాగుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావస్తున్న దశలో వైఎస్సార్ మృతి రైతులను కుంగదీసింది. ప్రాజెక్ట్ పూర్తవుతుందా..? అనే అనుమానం రైతుల్లో గుబులు రేపింది. అనుకున్నట్లుగానే కుడి, ఎడమ ప్రధాన కాలువల టెయిల్ ఎండ్ ప్రాంతాల్లో పనులను పూర్తి చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. ల్యాండ్ ఎక్విజేషన్ లబ్ధిదారులకు బకాయిలు చెల్లించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
పైసా విడుదల చేయని కిరణ్ సర్కార్
వైఎస్సార్ మరణించాక సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గుండ్లకమ్మ గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ప్రాజెక్ట్‌కు వైఎస్ విడుదల చేసిన నిధులే తప్ప వారు ఒక్క పైసా విడుదల చేయలేదు. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ గడువు పెంచుకుంటున్నారే తప్ప నిర్మాణం పూర్తి చేయాలని ఏనాడూ ఆలోచించలేదు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గురించి మాటమాత్రమైనా ప్రస్తావించిన దాఖలాల్లేవు.
రూ.20 కోట్లిస్తే పెండింగ్ పనులు పూర్తి
గుండ్లకమ్మ కుడి, ఎడమ ప్రధాన కాలువల పరిధిలోని మేజర్ కెనాల్స్, మైనర్ కెనాల్స్, ఫీల్డ్ చానెల్స్ నిర్మాణ పనులు *20 కోట్లు కేటాయిస్తే పూర్తవుతాయి. కాలువల పొడిగింపు పూర్తయితే శివారు భూములకూ నీరందించవచ్చు. క రవది కాలువను దేవరంపాడు చివరకు పొడిగించి సర్వీస్ రోడ్లు వేయాల్సి ఉంది. పశువులకు తాగునీటి సదుపాయం కోసం ర్యాంపులు, వాటర్ లెవెల్స్ చెక్ చేసుకునేందుకు గేజ్ వెల్స్ నిర్మించాలి. ఈ పనులన్నీ మూడేళ్లుగా ముందుకు కదల్లేదు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏనాడూ నోరెత్తలేదు.. ప్రభుత్వమూ పట్టించుకోలేదు.
నిధులు అలాగే ఉన్నాయి
ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ కింద భూసేకరణకు, కాలువల పొడిగింపు కోసం కేటాయించిన నిధుల్లో 18 కోట్లు మిగిలి ఉన్నాయని కాలువ బాధ్యతలు చూస్తున్న డీఈ సత్యభూషణ్ తెలిపారు. కుడి కాలువ కింద ఆగిపోయిన పనులకు కేటాయించిన *2.6 కోట్లు కూడా అలాగే ఉన్నాయని సంబంధిత అధికారి నాగేశ్వరరావు తెలిపారు.