Gundlakamma Reservoir
-
‘గుండ్లకమ్మ’ పాపం గత ప్రభుత్వానిదే
మద్దిపాడు: గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసి.. సుందరీకరణ పేరుతో నిధులు బొక్కేయడానికే ప్రాధాన్యత ఇవ్వడమే ప్రస్తుత దుస్థితికి కారణమని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద విరిగిపోయిన రెండో గేటును శనివారం పరిశీలించిన ఆయన రిజర్వాయర్ ఎస్ఈ ఆబూదలి, ఈఈ నాగమురళీమోహన్తో మాట్లాడారు. రిజర్వాయర్‌లోని మిగిలిన గేట్ల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014–19 కాలంలో వర్షాలు లేక రిజర్వాయర్‌లో నీరు అతి తక్కువగా ఉండటంతో నాయకులు రిజర్వాయర్‌కు వచ్చిన నిర్వహణ నిధులతో ఉపయోగం లేని పనులు చేసి నిధులను తమ ఖాతాల్లో వేసుకున్నారని విమర్శించారు. రిజర్వాయర్ గేటు గత సంవత్సరం విరిగిపోయినప్పుడు గేట్ల మరమ్మతులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.90 లక్షలు మంజూరు చేశారని, ఈ ఏడాది రిజర్వాయర్ గేట్లు పూర్తిగా మరమ్మతు చేయించేందుకు రూ.9 కోట్లు విడుదల చేశారని చెప్పారు. లెగ్మెంట్లు కొట్టుకుపోవడం దురదృష్టకరం మిచాంగ్ తుపాను కారణంగా గుండ్లకమ్మ జలాశయంలోకి నీరు పుష్కలంగా వస్తుండటంతో నిల్వ చేసేందుకు అధికారులు ప్రయత్నించారని.. దురదృష్టవశాత్తు 2వ గేటు లెగ్మెంట్లు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. రిజర్వాయర్‌లో సాగర్ నుంచి ఒక టీఎంసీ నీరు విడుదల చేయించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. గేట్ల మరమ్మతులపై సీఎంవో, నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే హుటాహుటిన తాడేపల్లి వెళ్లారు. అంతకుముందు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో ఫోన్లో మాట్లాడారు. కాగా.. మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మండవ అప్పారావు, ఎంపీపీ వాకా అరుణకోటిరెడ్డి, నాయకులు రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రిజర్వాయర్‌కు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. రిజర్వాయర్ నిర్వహణ కోసం గత ప్రభుత్వంలో మంజూరైన నిధులను నాయకులు తినేశారన్నారు. టీడీపీ హయాంలో ఎన్ని టీఎంసీల నీరు సాగర్ నుంచి గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్రైతుల పక్షపాతి అని, అందుకే రిజర్వాయర్ నిర్వహణకు రూ.9 కోట్లు మంజూరు చేశారన్నారు. టీడీపీ నాయకుల హడావుడి గుండ్లకమ్మ రిజర్వాయర్ గేటు విరిగిందన్న విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు శనివారం ఉదయం రిజర్వాయర్ వద్దకు చేరుకుని కొంతసేపు హడావుడి చేశారు. రిజర్వాయర్ నిర్వహించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, టీడీపీ నాయకుడు ముత్తుముల అశోక్‌రెడ్డి రిజర్వాయర్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు. -
గుండ్లకమ్మకు ‘చంద్ర’ గండం!
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్: సాగునీటి ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం శాపంలా పరిణవిుంచింది! గత సర్కారు నిర్వాకాలతో గుండ్లకమ్మ రిజర్వాయర్ రెండో గేటులో దిగువన తుప్పు పట్టిపోయిన భాగం (8.4 మీటర్ల వెడల్పు, నాలుగు మీటర్ల ఎత్తు) శుక్రవారం రాత్రి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. రిజర్వాయర్ గేట్ల మరమ్మతులు, రంగులు పేరుతో టీడీపీ హయాంలో 2014 –2019లో పనులు చేయకుండానే రూ.3.57 కోట్లు దిగమింగేయడం దీనికి కారణం. సుందరీకరణ పేరుతో మరో రూ.1.58 కోట్లు వెరసి రూ.5.15 కోట్లు స్వాహా చేశారు. గేట్లకు రంగులు పూయకపోవడం వల్ల తుప్పు పట్టి బలహీనంగా మారాయి. దీంతో వరద ఉద్ధృతికి గతేడాది ఆగస్టు 31న మూడో గేటు కొట్టుకుపోగా తాజాగా రెండో గేటులో అడుగు భాగం కొట్టుకుపోయింది. చంద్రబాబు హయాంలో నిధులు కాజేయకుండా గేట్లకు మరమ్మతులు చేసి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరమ్మతు టెండర్ ఖరారైన రోజే.. గతేడాది మూడో గేటు కొట్టుకుపోయినప్పుడు యుద్ధప్రాతిపదికన స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేసిన ప్రభుత్వం రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసి రైతుల ప్రయోజనాలను కాపాడింది. మరో రెండు గేట్లు బలహీనంగా ఉండటంతో యుద్ధప్రాతిపదికన రూ.1.11 కోట్లు వెచ్చించి మరమ్మతు చేసింది. మిగతా 10 గేట్ల మరమ్మతులు, రంగులు పూయడం, దెబ్బతిన్న గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, కొత్త వైర్ రోప్‌లు, గ్యాంట్రీ క్రేన్ ఏర్పాటు పనులకు రూ.9.14 కోట్లతో టెండర్లు పిలిచింది. వాటిని అధికారులు శుక్రవారం ఖరారు చేశారు. రివర్స్ టెండరింగ్ పద్ధతిలో ఆ పనులను రాజస్థాన్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మెషినరీ సంస్థ దక్కించుకుంది. గేట్ల మరమ్మతు టెండర్ ఖరారైన రోజే వరద ఉద్ధృతికి రెండో గేటు కొట్టుకుపోయింది. టీడీపీ సర్కార్ అవినీతితో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టును జలయజ్ఞం కింద చేపట్టిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలో 80,060 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసింది. గేట్ల మరమ్మతులు, రంగులు పూయడం పేరుతో నిధులు కాజేసింది. దీంతో గేట్లు తుప్పు పట్టిపోయాయి. దీని ఫలితంగానే పులిచింతల ప్రాజెక్టులో ఒక గేటు, గుండ్లకమ్మలో రెండు గేట్లు కొట్టుకుపోయాయి. యుద్ధప్రాతిపదికన స్టాప్‌లాగ్ గేటు గుండ్లకమ్మ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 24.380 మీటర్లు కాగా నీటి నిల్వ సామర్థ్యం 3.86 టీఎంసీలు. ప్రాజెక్టు స్పిల్ వేకు 8.4 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తుతో కూడిన 12 గేట్లను అమర్చారు. మిచాంగ్ తుపాను వల్ల ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ పది వేల క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చింది. గేట్లు బలహీనంగా ఉండటంతో 2.30 టీఎంసీలను నిల్వ చేస్తూ వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఈ సమయంలో రెండో గేటు, పదో గేటు మరీ బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఒక్కో స్టాప్ లాగ్ ఎలిమెంట్‌ను అడుగు భాగంలో దించారు. అయితే బలహీనంగా ఉన్న రెండో గేటులో 4 మీటర్ల ఎత్తుతో కూడిన ఒక భాగం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 2.30 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కొట్టుకుపోయిన రెండో గేటు స్థానంలో శనివారం పూర్తి స్థాయి స్టాప్ లాగ్ గేటు అమర్చి నీటిని నిల్వ చేసి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడతామని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. -
గుండ్లకమ్మలో కొట్టుకొచ్చిన శవం
ప్రకాశం : నిన్న సాయంత్రం ఇంట్లో సూసైడ్ నోట్ పెట్టి బయటకు వెళ్లిన వ్యక్తి ఈ రోజు శవమై తేలిన సంఘటన ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అద్దంకికి చెందిన ఓ ప్రైవేట్ టీచర్ గురువారం సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్తున్న సమయంలో సూసైడ్‌నోట్ రాసి ఇంట్లో పెట్టి వెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి 15వ గేటు వద్ద మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన అతడి తల్లిదండ్రులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. పెళ్లి కావాల్సిన వాడు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల కిందటే రక్త పరీక్షలు చేయించుకున్న అతడికి హెచ్ఐవీ ఉందని తెలియడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
తాత కూడా శవమయ్యాడు..
మద్దిపాడు : అనుకున్నంతా జరిగింది. గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో గల్లంతైన వ్యక్తి మృతదేహమై కనిపించి కుటుంబ సభ్యులకు కన్నీరుమిగిల్చాడు. ఇప్పటికి కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబం.. యజమాని కూడా దక్కలేదని తెలిసి దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. మండలంలోని ఆన్నంగి గ్రామానికి చెందిన కుంచాల పెద్ద గోవిందు(65) తన మనువడు 11 ఏళ్ల లక్ష్మయ్యతో కలిసి చేపల వేటకు సోమవారం గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. అదే రోజు మనువడు లక్ష్మయ్య మృతదేహాన్ని గుర్తించగా తాతా గోవిందు ఆచూకీ తెలియరాలేదు. అప్పటి నుంచి మత్స్యకారులు రిజర్వాయర్‌లో గాలి స్తూనే ఉన్నారు. మంగళవారం సాయంత్రం అగ్నిమాపక సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం మత్స్యకారులు తెప్పలపై వెళ్లి గాలలతో వెతికారు. గోవిందు గల్లంతైన ప్రదేశానికి కొద్ది దూరంలోనే మృతదేహం గాలానికి తగులుకుంది. గతంలో పాడైపోయిన వలలో చిక్కుకుని బయటకు రాలేక మరణించాడని మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై మహేష్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. -
అన్నంగిలో విషాదం
పరవళ్లు తొక్కుతున్న గుండ్లకమ్మ.. మనువడిని అమాంతం మింగింది సుడులు తిరుగుతున్న నీటి ప్రవాహం.. తాతను క్షణాల్లో మాయం చేసింది ఎప్పుడూ కలిసి ఉండే తాతామనవళ్లు.. ఇప్పుడు వేరై మళ్లీ ఒక్కటయ్యారా? మద్దిపాడు : చేపల వేటకు వెళ్లి తాతామనువడు గల్లంతయ్యారు. కొద్దిసేపటికి మనువడు మృతి చెందగా తాత ఆచూకీ తెలియ రాలేదు. ఈ సంఘటన మండలంలోని ఆన్నంగి వద్ద గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. అన్నంగికి చెందిన కుంచాల పెద్ద గోవిందు(65) చేపల వేట కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు తన కుమారుడు కొడుకు (మనుమవడు)తో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో యథావిధిగా పెద్ద గోవిందు చేపల వేటకు బయల్దేరుతుండగా తానూ వస్తానంటూ మనువడు లక్ష్మయ్య పట్టుబట్టాడు. సముదాయించినా మనువడు పట్టువీడలేదు. చేసేదిలేక తనతో పాటు లక్ష్మయ్యను పెద్ద గోవిందు వేటకు తీసుకెళ్లాడు. అప్పటికే గ్రామంలోని ఇతర మత్స్యకారులు వేట ముగించుకుని తిరిగి ఇంటి ముఖం పట్టారు. గోవిందు తన మనువడితో కలిసి వడివడిగా వేటకు బయల్దేరాడు. వేట అనంరతరం తిరగు ప్రయాణంలో ఉండగా తాతామనువడు ప్రయాణిస్తున్న తెప్ప (థర్మాకోల్ షీట్లతో చేసింది) తిరగబడటంతో తాత ఒకచోట మనువడు మరో చోట నీటిలో పడిపోయారు. ఎంతకీ వారు ఇంటి కి రాకపోవడంతో లక్ష్మయ్య తల్లి ఆదిలక్ష్మి విషయాన్ని తన భర్త అంకమ్మరావుతో చెప్పింది. అంకమ్మరావు చుట్టుపక్కల వారితో కలిసి రిజర్వాయర్ వద్దకు వె ళ్లగా తెప్ప కనిపించింది. స్థానిక మత్స్యకారులు నీటిలోకి దిగి వెతకగా లక్ష్మయ్య (11)వలలో అపస్మారక స్థితిలో కనిపిం చాడు. వెంటనే బాలుడిని ఒడ్డుకు చేర్చి దగ్గరలోని మేదరమెట్ల ఆస్పత్రికి తరలించగా అప్పటికే లక్ష్మయ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని స్వగ్రామం అన్నంగి తరలించారు. పెద్ద గోవిం దు ఆచూకీ కోసం సహచర మత్స్యకారులు గాలిస్తూనే ఉన్నారు. తహశీల్దార్ కేఎల్ నరసింహారావు, ఎస్సై మహేష్‌లు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. నా భర్త ఆచూకీ చెప్పండయ్యా.. గ్రామంలో వడియరాజులపాలెం శోకసంద్రంలో మునిగిపోయింది. రోజూ కలిసి తిరిగే తాతా మనువళ్లను గుర్తుకు తెచ్చుకుని బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కుమారుడు మృతి చెందడం.. తండ్రి ఆచూకీ తెలియకపోవడంతో అంకమ్మరావు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. లక్ష్మయ్య 5వ తరగతి చదువుతున్నాడు. పెద్ద గోవిందు భార్య ఏసు తీరని దుఖంతో కనిపించిన ప్రతివారిని పట్టుకుని మా ఆయన ఏడయ్యా.. అంటూ విలపిస్తోంది. కుమారుడిని పోగొట్టుకుని అంకమ్మరావు భార్య ఆదిలక్ష్మి విలపిస్తున్న తీరు స్థానికులను కలచి వేసింది. -
ప్రకాశంలో భారీ వర్షాలు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో జిల్లాలోని పలు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అందులోభాగంగా గుండ్లకమ్మ రిజర్వాయిర్‌కు వరద నీరు పోటెత్తింది. దీంతో రిజర్వాయిర్లోని నాలుగు గేట్లను అధికారులు ఎత్తివేసి 13 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో వైపు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఒంగోలు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. నగరంలోని భాగ్యనగర్ కాలనీ, బలరాం కాలనీ, వెంకటేశ్వరకాలనీ, మధర్‌థెరిస్సా కాలనీలోని రహదారులపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో సదరు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
జలం..జీవం
గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించిన అపరభగీరథుడు వైఎస్సార్ *80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, *2.56 లక్షల మందికి తాగునీటి సౌకర్యం *రూ. 592 కోట్లు విడుదల చేసిన నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి *మహానేత మరణానంతరం గుండ్లకమ్మను గాలికొదిలేసిన కాంగ్రెస్ బాబు విదిల్చింది కేవలం రూ.33 కోట్లు 2004లో చంద్రబాబు పాలనా కాలం ముగియబోతుండగా ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలనే దురుద్దేశంతో గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తానని మొక్కుబడిగా జీఓ జారీ చేశారు. ఆగమేఘాలపై శిలాఫలకం వేశారు. తీరా ప్రాజెక్ట్ నిర్మాణానికి చంద్రబాబు కేటాయించింది ఎంతా అంటే కేవలం రూ. 33 కోట్లు. గుండ్లకమ్మ నది నుంచి ఏటా 3.5 నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా కలుస్తుంది. ఈ నీటి వృథాను అరికడితే వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కావడంతో పాటు రెండున్నర లక్షల మందికి తాగునీరు అందుతుంది. వైఎస్సార్ కంటే ముందు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. వైఎస్సార్ సీఎం కాగానే జలయజ్ఞంలో భాగంగా * 592 కోట్లు కేటాయించి మద్దిపాడు మండలంలోని చిన్నమల్లవరం వద్ద 3.875 టీఎంసీల సామర్థ్యం గల కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్మించారు. మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, కొరిశపాడు, ఇంకొల్లు, జే.పంగులూరు, చినగంజాం, ఒంగోలు మండలాల పరిధిలోని 80,060 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు ఎడమ కాలువ కింద 27.975 కిలోమీటర్ల పొడవునా 50,060 ఎకరాలను సాగులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కుడి కాలువ కింద 27.262 కి.మీ పొడవునా 28 వేల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో అన్నంగి తప్ప మిగిలిన 11 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించారు. వైఎస్సార్ మరణంతో పనుల్లో జాప్యం వైఎస్సార్ హయాంలో చకచకా సాగిన ప్రాజెక్టు నిర్మాణ పనులు.. ఆయన మరణించాక నత్తనడకన సాగుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావస్తున్న దశలో వైఎస్సార్ మృతి రైతులను కుంగదీసింది. ప్రాజెక్ట్ పూర్తవుతుందా..? అనే అనుమానం రైతుల్లో గుబులు రేపింది. అనుకున్నట్లుగానే కుడి, ఎడమ ప్రధాన కాలువల టెయిల్ ఎండ్ ప్రాంతాల్లో పనులను పూర్తి చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. ల్యాండ్ ఎక్విజేషన్ లబ్ధిదారులకు బకాయిలు చెల్లించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పైసా విడుదల చేయని కిరణ్ సర్కార్ వైఎస్సార్ మరణించాక సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గుండ్లకమ్మ గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ప్రాజెక్ట్‌కు వైఎస్ విడుదల చేసిన నిధులే తప్ప వారు ఒక్క పైసా విడుదల చేయలేదు. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ గడువు పెంచుకుంటున్నారే తప్ప నిర్మాణం పూర్తి చేయాలని ఏనాడూ ఆలోచించలేదు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గురించి మాటమాత్రమైనా ప్రస్తావించిన దాఖలాల్లేవు. రూ.20 కోట్లిస్తే పెండింగ్ పనులు పూర్తి గుండ్లకమ్మ కుడి, ఎడమ ప్రధాన కాలువల పరిధిలోని మేజర్ కెనాల్స్, మైనర్ కెనాల్స్, ఫీల్డ్ చానెల్స్ నిర్మాణ పనులు *20 కోట్లు కేటాయిస్తే పూర్తవుతాయి. కాలువల పొడిగింపు పూర్తయితే శివారు భూములకూ నీరందించవచ్చు. క రవది కాలువను దేవరంపాడు చివరకు పొడిగించి సర్వీస్ రోడ్లు వేయాల్సి ఉంది. పశువులకు తాగునీటి సదుపాయం కోసం ర్యాంపులు, వాటర్ లెవెల్స్ చెక్ చేసుకునేందుకు గేజ్ వెల్స్ నిర్మించాలి. ఈ పనులన్నీ మూడేళ్లుగా ముందుకు కదల్లేదు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏనాడూ నోరెత్తలేదు.. ప్రభుత్వమూ పట్టించుకోలేదు. నిధులు అలాగే ఉన్నాయి ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ కింద భూసేకరణకు, కాలువల పొడిగింపు కోసం కేటాయించిన నిధుల్లో 18 కోట్లు మిగిలి ఉన్నాయని కాలువ బాధ్యతలు చూస్తున్న డీఈ సత్యభూషణ్ తెలిపారు. కుడి కాలువ కింద ఆగిపోయిన పనులకు కేటాయించిన *2.6 కోట్లు కూడా అలాగే ఉన్నాయని సంబంధిత అధికారి నాగేశ్వరరావు తెలిపారు. -
మొండిచేయి
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. నిధుల కేటాయింపులో అంకెల గారడీ తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న శ్రద్ధ ప్రభుత్వ పెద్దల్లో కనిపించడం లేదు. గత ఏడాది కేటాయించిన నిధుల్లో కనీసం పాతిక శాతం కూడా ఖర్చు చేయకపోగా..తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా అంతంత మాత్రంగానే నిధులు విదిల్చారు. ఇదేనా న్యాయం: 6 జిల్లాలో కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టుకు మొత్తం అంచనా వ్యయం రూ.592.18 కోట్లు. అందులో ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.535.68 కోట్లు. అయితే 2013-14లో రూ.29 కోట్లు కేటాయించారు. కానీ ఇంతవరకు ఇందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మళ్లీ మరో రూ.29 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది అంకెల గారడీనే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 6 పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు రూ. 5150 కోట్లు అవసరం. కానీ ఇంత వరకు ఖర్చుచేసింది రూ.3378.12 కోట్లు మాత్రమే. దీనికితోడు 2013-14 బడ్జెట్లో రూ. 402 కోట్లు అన్నారు. కానీ విడుదల చేసింది కేవలం రూ. 105.48 కోట్లు మాత్రమే. ప్రస్తుతం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో రూ. 402 కోట్లు అంటూ ప్రకటించడం గమనార్హం. 6యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి రూ.177 కోట్లు అవసరమని భావించగా ఇప్పటి వరకు ఖర్చుచేసిన మొత్తం రూ.90.47 కోట్లు మాత్రమే. 2013-14 సంవత్సరంలో రూ.17 కోట్లు కేటాయించారు. కానీ అందులో ఇప్పటి వరకు ఖర్చుచేసిన మొత్తం రూ.2.91 కోట్లే. తాజాగా దీనికి మరో రూ.17 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఇదీ పరిస్థితి: కృష్ణా వెస్ట్రన్ డెల్టా కాలువల అభివృద్ధి పనులకు రూ. 130.22 కోట్లకు అగ్రిమెంట్ అయింది. కానీ ఇంతవరకు కేవలం రూ. 10 కోట్ల లోపు మాత్రమే ఖర్చుచేశారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని డ్రైనేజీ కాలువల అభివృద్ధి కోసం దాదాపు రూ.140 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు అందులో ఖర్చుచేసింది రూ. 40 కోట్లలోపు మాత్రమే. ఇంకా వీటికి సంబంధించి కొన్నిచోట్ల టెండరు వేసేందుకు సైతం ఎవరూ ముందుకు రాని పరిస్థితి. 6మాగుంట సుబ్బరామిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు 2013-14లో కోటి రూపాయల నిధులు కేటాయించారు. కానీ ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయకపోవడం గమనార్హం. 6 శ్రీపోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయరు ప్రాజెక్టుకు రూ. 50.50 కోట్లు అవసరమని భావించగా ఇంతవరకు కేటాయించిన మొత్తం రూ.10.85 కోట్లు. 2013-14లో రూ.9 కోట్లు కేటాయించారు. కానీ ఖర్చుచేసిన మొత్తం రూ.15 లక్షలు కావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 6 ఒంగోలులో పోతురాజు కాలువ అభివృద్ధికి రెండో దశలో రూ. 18 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించినా దీనికి సంబంధించి జాడ కూడా లేకపోవడం గమనార్హం. -
గ్రావెల్ స్వాహా
మేదరమెట్ల, న్యూస్‌లైన్: గుండ్లకమ్మ రిజర్వాయర్ ముంపు గ్రామమైన తమ్మవరంలో గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. అక్రమార్కులు లక్షలకు లక్షలు దండుకుంటున్నారు. తమ్మవరంలో గ్రావెల్ అధికంగా లభిస్తుండటంతో కొందరి కన్ను ఆ గ్రామంపై పడింది. పగలు, రాత్రీ తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పది అడుగుల లోతుకుపైగా గుంతలు తీసి గ్రావెల్ తవ్వి మాయం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో గ్రావెల్ తరలిపోతున్నా రెవెన్యూ, మైనింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. ముంపు గ్రామాలను త్వరగా ఖాళీ చేస్తే ఆ ప్రాంతంలో అటవీ శాఖాధికారులు మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పి గ్రామస్తులను ఖాళీ చేయించారు. కానీ నేటికీ అటవీ శాఖకు సంబంధించి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రావెల్ అక్రమార్కులకు వరంగా మారింది. గ్రామం మొత్తం భారీగా గోతులు పెట్టి గ్రావెల్ తరలించుకుపోతున్నారు. గుండ్లకమ్మ నదికి ఆనుకొని రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. పథకాల సమీపంలో 15 అడుగుల లోతులో గోతులు తీయడం వల్ల భారీ వర్షాలకు గోతులు నీటితో నిండిపోయి..పథకాలు సైతం నీటమునిగే పరిస్థితి ఏర్పడనుంది. ట్రాక్టర్ గ్రావెల్‌ను రూ 800 నుంచి వెయ్యి రూపాయల వరకు దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. టిప్పర్ల ద్వారా సమీపంలోని గ్రోత్ సెంటరుకు గ్రావెల్ తరలిస్తున్నారు. ఒక్కో టిప్పరుకు రూ 3 వేల వరకు వసూలు చేయడం గమనార్హం. దీంతో చివరకు ఆ గ్రామంలో గుంతలు తప్ప ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. -
కడ‘గండ్లు’ తీరేదెన్నడు
కారంచేడు, న్యూస్‌లైన్: భారీ వర్షాలకు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి కన్నీటి పర్యంతమవుతున్న రైతులను ఓదార్చేవారే కరువయ్యారు. పాలకులు వచ్చారు..వెళ్లారు అన్నట్లుగా వ్యవహరిస్తుంటే..అధికారులు మాత్రం మాకెందుకులే అన్నట్లు చోద్యం చూస్తున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలు కారంచేడు ప్రాంత రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. రైతులు వరి సాగుకు ఎకరాకు రూ 15 వేల వరకు ఖర్చు చేశారు. తాగు, సాగునీరందించే కొమ్మమూరు కాలువకు జిల్లాలో సుమారు 50 చోట్ల గండ్లు పడ్డాయి. నీటి ఉధృతికి సాగుచేసిన పంటలు కొట్టుకుపోగా..మిగిలిన 10-20 శాతం పంటలను బతికించుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కాలువకు గండ్లు పడటంతో అధికారులు నీటి సరఫరా నిలిపేశారు. దీంతో కాలువ పూర్తిగా ఎండిపోయింది. యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాలు తగ్గి పదిహేను రోజులవుతున్నా పాలకులు, అధికారుల్లో స్పందన లేదు. కారంచేడు, చీరాల, వేటపాలెం, పర్చూరు, చినగంజాం, సంతనూతలపాడు మండలాల్లో కొమ్మమూరు కింద సుమారు లక్ష ఎకరాల్లో అధిక భాగం పంట తుడిచిపెట్టుకుపోయింది. మిగిలిన పంటలను కాపాడుకోవాలంటే రైతులకు నీరు అవసరం. అవి లేకపోవడంతో తీరేదెన్నడు పంటలు ఎండుముఖం పడుతున్నాయి. చివరకు మురుగు కుంటల్లో నిలిచిన నీటిని రైతులు డీజిల్ ఇంజన్ల ద్వారా పొలాలకు తరలిస్తూ అదనపు ఖర్చుతో అల్లాడుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ తుడిచిపెట్టుకు పోయింది. రబీకి సిద్ధపడుతున్న అన్నదాతలు నార్లు పోసుకోవాలంటే నీరు కావాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొమ్మమూరుకు పడిన గండ్లు పూడ్చి కాలువకు నీరు వదిలి తమ కడగండ్లు తీర్చాలని రైతులు కోరుతున్నారు. -
గుండ్లకమ్మకు భారీగా వరదనీరు, 10గేట్లు ఎత్తివేత
ఒంగోలు : ప్రకాశం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. తాళ్లూరు, ముండ్లమూరు, అద్దంకి వంటి ఎగువ మండలాల్లోని వాగులు, చెరువు అలుగులు పొంగిపొర్లటంతో గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు వరద నీరు పొటెత్తింది. దీంతో సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు చెందిన పది గేట్లను ఎత్తివేశారు. దిగువకు 85వేల క్యూసెక్కుల వదర నీటిని దిగువకు విడుదల చేశారు. మద్దిరాలపాడు బ్రిడ్జి వద్ద 15 అడుగులకుపై నీరు ప్రవహిస్తోంది. దాంతో ఒంగోలు-చీరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పల్లికురవ బలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు మార్టురులోనూ భారీ వర్షం కురుస్తోంది. లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వరద నీరు చేరటంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇక యద్దనపూడి మండలంలో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. భారీ వర్షాలకు నీట మునిగిన అద్దంకి ఎన్టీఆర్ కాలనీలో వైఎస్ఆర్సీపీ నేత గొట్టిపాటి రవికుమార్ పర్యటించి, బాధితుల్ని పరామర్శించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ విజయ్ కుమార్ భారీ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. -
గుండ్లకమ్మ ఉగ్రరూపం
సాక్షి, ఒంగోలు : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. తాళ్లూరు, ముండ్లమూరు, అద్దంకి వంటి ఎగువ మండలాల్లోని వాగులు, చెరువు అలుగులు పొంగిపొర్లటంతో గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు వరద నీరు పొటెత్తింది. దీంతో సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు చెందిన 6 గేట్లను ఎత్తివేశారు. బుధవారం ఉదయం గుండ్లకమ్మకు 35 వేల క్యూసెక్కుల వరద నీరు (ఇన్‌ఫ్లో) చేరుకోవడంతో 6 గేట్ల ఎత్తివేత ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని ఒక్కసారిగా విడుదల చేశారు. అయితే సాయంత్రానికల్లా వరద నీరు తగ్గుముఖం పట్టడంతో (ఇన్‌ఫ్లో 27 క్యూసెక్కులు) నీటి విడుదలను 35 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు తగ్గించారు. ముండ్లమూరు మండలం భీమవరం,ఈదర, మారెళ్ల వద్ద వాగులు, చిలకలేరు, దోర్నపువాగు, నల్లవాగు, అద్దంకి-మేదరమెట్ల మధ్య నల్లవాగు, శింగరకొండ భవనాశి చెరువు పెద్ద ఎత్తున పొంగిపొర్లటంతో ఒక్కసారిగా వరద నీరు గుండ్లకమ్మకు పొటెత్తింది. గుండ్లకమ్మ రిజర్వాయర్ ఎఫ్ఆర్ఎల్ 24.380 మీటర్లుకాగా సంబంధిత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 24.100 మీటర్ల స్థాయి వరకు నీటిని నిల్వ ఉంచుతూ వచ్చారు. డీఈ నాగేశ్వరరావు, ఏఈ జయబాబులు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలను క్రమబద్ధీకరిస్తూ తమ సిబ్బంది ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి గుండ్లకమ్మ రిజర్వాయర్ ఇన్‌ఫ్లో బాగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ నీటిపారుదల శాఖాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జలమయమైన కాలనీలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బుధవారం మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్లపాడు ఎస్సీ, బీసీ కాలనీలు జలమయమయ్యాయి. ఆయా కాలనీల్లో పేద ప్రజలు నివాసం ఉంటున్నారు. అక్కడ సరైన వసతి సౌకర్యాల్లేకపోవడంతో వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబాలు భారీ వర్షాల కారణంగా పనులకు వెళ్లలేకపోతున్నాయి. కాలనీల్లోకి సుమారు 4 అడుగుల ఎత్తు మేరకు నీరు చేరింది. ఒకటిన్నర అడుగుల మేరకు నీరు ఇళ్లలోకి వస్తుండటంతో వారు భయాందోళనలతో పాటు అయోమయానికి గురవుతున్నారు. ఈ ప్రాంత వాసులకు ప్రభుత్వం 25 ఏళ్ల క్రితం నివాసస్థలాలు అందజేసినప్పటికీ వారికి డ్రైనేజీ, రోడ్లు వంటి సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రస్తుతం వారు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కావు. ఇళ్లలోకి వర్షపు నీటితో పాటు పాములు, విషపురుగులు చేరుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇళ్లలోకి చేరుకుంటున్న నీటిని వంటపాత్రల సహాయంతో బయటకు ఎత్తేసుకోవాల్సి వస్తోంది. వర్షం తగ్గే వరకూ తమకు జాగారం తప్పదని వాపోతున్నారు. పాఠశాల చుట్టూ నీరే భారీ వర్షాలు కురిసే సమయంలో ఎస్సీ కాలనీతో పాటు అక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలలు సైతం నీటితో నిండిపోవటం ఇప్పుడేమీ కొత్త కాదు. గతేడాది కూడా ఇదే విధంగా వర్షపు నీరు ప్రాథమిక పాఠశాలల చుట్టూ చేరటం, ఆ నీటిలో చిన్నారులు పడుతున్న అవస్థలను ఁసాక్షి పట్టిచూపిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితులను గమనించిన రాజీవ్ విద్యామిషన్ ఈఈ నాగేశ్వరరావు ఆ భవనాన్ని ఖాళీ చేయమని ఆదేశాలయితే ఇచ్చారు గానీ కొత్త భవనం కట్టిస్తామని ఆయన కాలనీ వాసులకు ఇచ్చిన హామీ మాత్రం నీటిమూటైంది. -
వాన జోరు
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లావ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పలు మార్గాల్లో వాగులు పొంగి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గుండ్లకమ్మ రిజర్వాయర్ దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ పీ ప్రమోద్ కుమార్ ఆదేశించారు. రవాణాకు, ప్రజా జీవనానికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్న చోట్ల గస్తీ పెట్టారు. గుండ్లకమ్మ రిజర్వాయరు గేట్లు నాలుగు ఎత్తివేశారు. రిజర్వాయర్‌లోకి వాన జోరు 12 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 17 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో మద్దిరాలపాడు-చదలవాడ మధ్య ఉన్న బ్రిడ్జిపై నీరు ఉధృతంగా పారుతోంది. ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఈ మార్గంలో ఆర్టీసీ సర్వీసులు నిలిపేశారు. నాగులుప్పలపాడు ఎస్సై రంగనాథ్ బ్రిడ్జి వద్ద పరిస్థితిని పరిశీలించి వాహనాల రాకపోకలు పూర్తిగా ఆపేశారు. ఒంగోలు- చీరాల మధ్య వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడకుండా ఆర్టీసీ అధికారులు తిమ్మనపాలెం, హనుమాపురం, బీ నిడమానూరు మీదుగా నాగులుప్పలపాడు వైపు మళ్లించారు. అలాగే ఒంగోలు-కొత్తపట్నం రహదారిలో ఉన్న ఉప్పువాగు బ్రిడ్జిపై భారీ లోడు వెళ్లడంతో ఇటీవల కుంగింది. సోమవారం ఉదయం నుంచి వర్షానికి ఈ బ్రిడ్జికి బీటలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలపరంగా నష్టంలేదని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.