సాక్షి, ఒంగోలు : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. తాళ్లూరు, ముండ్లమూరు, అద్దంకి వంటి ఎగువ మండలాల్లోని వాగులు, చెరువు అలుగులు పొంగిపొర్లటంతో గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు వరద నీరు పొటెత్తింది. దీంతో సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు చెందిన 6 గేట్లను ఎత్తివేశారు. బుధవారం ఉదయం గుండ్లకమ్మకు 35 వేల క్యూసెక్కుల వరద నీరు (ఇన్‌ఫ్లో) చేరుకోవడంతో 6 గేట్ల ఎత్తివేత ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని ఒక్కసారిగా విడుదల చేశారు. అయితే సాయంత్రానికల్లా వరద నీరు తగ్గుముఖం పట్టడంతో (ఇన్‌ఫ్లో 27 క్యూసెక్కులు) నీటి విడుదలను 35 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు తగ్గించారు.
ముండ్లమూరు మండలం భీమవరం,ఈదర, మారెళ్ల వద్ద వాగులు, చిలకలేరు, దోర్నపువాగు, నల్లవాగు, అద్దంకి-మేదరమెట్ల మధ్య నల్లవాగు, శింగరకొండ భవనాశి చెరువు పెద్ద ఎత్తున పొంగిపొర్లటంతో ఒక్కసారిగా వరద నీరు గుండ్లకమ్మకు పొటెత్తింది. గుండ్లకమ్మ రిజర్వాయర్ ఎఫ్‌ఆర్‌ఎల్ 24.380 మీటర్లుకాగా సంబంధిత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 24.100 మీటర్ల స్థాయి వరకు నీటిని నిల్వ ఉంచుతూ వచ్చారు. డీఈ నాగేశ్వరరావు, ఏఈ జయబాబులు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలను క్రమబద్ధీకరిస్తూ తమ సిబ్బంది ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి గుండ్లకమ్మ రిజర్వాయర్ ఇన్‌ఫ్లో బాగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ నీటిపారుదల శాఖాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
జలమయమైన కాలనీలు
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బుధవారం మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్లపాడు ఎస్సీ, బీసీ కాలనీలు జలమయమయ్యాయి. ఆయా కాలనీల్లో పేద ప్రజలు నివాసం ఉంటున్నారు. అక్కడ సరైన వసతి సౌకర్యాల్లేకపోవడంతో వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబాలు భారీ వర్షాల కారణంగా పనులకు వెళ్లలేకపోతున్నాయి. కాలనీల్లోకి సుమారు 4 అడుగుల ఎత్తు మేరకు నీరు చేరింది. ఒకటిన్నర అడుగుల మేరకు నీరు ఇళ్లలోకి వస్తుండటంతో వారు భయాందోళనలతో పాటు అయోమయానికి గురవుతున్నారు. ఈ ప్రాంత వాసులకు ప్రభుత్వం 25 ఏళ్ల క్రితం నివాసస్థలాలు అందజేసినప్పటికీ వారికి డ్రైనేజీ, రోడ్లు వంటి సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రస్తుతం వారు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కావు. ఇళ్లలోకి వర్షపు నీటితో పాటు పాములు, విషపురుగులు చేరుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇళ్లలోకి చేరుకుంటున్న నీటిని వంటపాత్రల సహాయంతో బయటకు ఎత్తేసుకోవాల్సి వస్తోంది. వర్షం తగ్గే వరకూ తమకు జాగారం తప్పదని వాపోతున్నారు.
పాఠశాల చుట్టూ నీరే
భారీ వర్షాలు కురిసే సమయంలో ఎస్సీ కాలనీతో పాటు అక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలలు సైతం నీటితో నిండిపోవటం ఇప్పుడేమీ కొత్త కాదు. గతేడాది కూడా ఇదే విధంగా వర్షపు నీరు ప్రాథమిక పాఠశాలల చుట్టూ చేరటం, ఆ నీటిలో చిన్నారులు పడుతున్న అవస్థలను ఁసాక్షి పట్టిచూపిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితులను గమనించిన రాజీవ్ విద్యామిషన్ ఈఈ నాగేశ్వరరావు ఆ భవనాన్ని ఖాళీ చేయమని ఆదేశాలయితే ఇచ్చారు గానీ కొత్త భవనం కట్టిస్తామని ఆయన కాలనీ వాసులకు ఇచ్చిన హామీ మాత్రం నీటిమూటైంది.