Flood tide
-
గుండ్లకమ్మ ఉగ్రరూపం
సాక్షి, ఒంగోలు : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. తాళ్లూరు, ముండ్లమూరు, అద్దంకి వంటి ఎగువ మండలాల్లోని వాగులు, చెరువు అలుగులు పొంగిపొర్లటంతో గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు వరద నీరు పొటెత్తింది. దీంతో సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు చెందిన 6 గేట్లను ఎత్తివేశారు. బుధవారం ఉదయం గుండ్లకమ్మకు 35 వేల క్యూసెక్కుల వరద నీరు (ఇన్‌ఫ్లో) చేరుకోవడంతో 6 గేట్ల ఎత్తివేత ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని ఒక్కసారిగా విడుదల చేశారు. అయితే సాయంత్రానికల్లా వరద నీరు తగ్గుముఖం పట్టడంతో (ఇన్‌ఫ్లో 27 క్యూసెక్కులు) నీటి విడుదలను 35 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు తగ్గించారు. ముండ్లమూరు మండలం భీమవరం,ఈదర, మారెళ్ల వద్ద వాగులు, చిలకలేరు, దోర్నపువాగు, నల్లవాగు, అద్దంకి-మేదరమెట్ల మధ్య నల్లవాగు, శింగరకొండ భవనాశి చెరువు పెద్ద ఎత్తున పొంగిపొర్లటంతో ఒక్కసారిగా వరద నీరు గుండ్లకమ్మకు పొటెత్తింది. గుండ్లకమ్మ రిజర్వాయర్ ఎఫ్ఆర్ఎల్ 24.380 మీటర్లుకాగా సంబంధిత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 24.100 మీటర్ల స్థాయి వరకు నీటిని నిల్వ ఉంచుతూ వచ్చారు. డీఈ నాగేశ్వరరావు, ఏఈ జయబాబులు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలను క్రమబద్ధీకరిస్తూ తమ సిబ్బంది ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి గుండ్లకమ్మ రిజర్వాయర్ ఇన్‌ఫ్లో బాగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ నీటిపారుదల శాఖాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జలమయమైన కాలనీలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బుధవారం మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్లపాడు ఎస్సీ, బీసీ కాలనీలు జలమయమయ్యాయి. ఆయా కాలనీల్లో పేద ప్రజలు నివాసం ఉంటున్నారు. అక్కడ సరైన వసతి సౌకర్యాల్లేకపోవడంతో వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబాలు భారీ వర్షాల కారణంగా పనులకు వెళ్లలేకపోతున్నాయి. కాలనీల్లోకి సుమారు 4 అడుగుల ఎత్తు మేరకు నీరు చేరింది. ఒకటిన్నర అడుగుల మేరకు నీరు ఇళ్లలోకి వస్తుండటంతో వారు భయాందోళనలతో పాటు అయోమయానికి గురవుతున్నారు. ఈ ప్రాంత వాసులకు ప్రభుత్వం 25 ఏళ్ల క్రితం నివాసస్థలాలు అందజేసినప్పటికీ వారికి డ్రైనేజీ, రోడ్లు వంటి సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రస్తుతం వారు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కావు. ఇళ్లలోకి వర్షపు నీటితో పాటు పాములు, విషపురుగులు చేరుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇళ్లలోకి చేరుకుంటున్న నీటిని వంటపాత్రల సహాయంతో బయటకు ఎత్తేసుకోవాల్సి వస్తోంది. వర్షం తగ్గే వరకూ తమకు జాగారం తప్పదని వాపోతున్నారు. పాఠశాల చుట్టూ నీరే భారీ వర్షాలు కురిసే సమయంలో ఎస్సీ కాలనీతో పాటు అక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలలు సైతం నీటితో నిండిపోవటం ఇప్పుడేమీ కొత్త కాదు. గతేడాది కూడా ఇదే విధంగా వర్షపు నీరు ప్రాథమిక పాఠశాలల చుట్టూ చేరటం, ఆ నీటిలో చిన్నారులు పడుతున్న అవస్థలను ఁసాక్షి పట్టిచూపిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితులను గమనించిన రాజీవ్ విద్యామిషన్ ఈఈ నాగేశ్వరరావు ఆ భవనాన్ని ఖాళీ చేయమని ఆదేశాలయితే ఇచ్చారు గానీ కొత్త భవనం కట్టిస్తామని ఆయన కాలనీ వాసులకు ఇచ్చిన హామీ మాత్రం నీటిమూటైంది. -
రెండో ప్రవూద హెచ్చరిక ఉపసంహరణ
కొవ్వూరు, న్యూస్‌లైన్: గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద నీటిమట్టం తగ్గినా ఆలయాలు ముంపులోనే ఉన్నాయి. ఇక్కడ రెండు అడుగుల మేరకు వరదనీరు ప్రవహిస్తోంది. రహదారులపై బురద పేరుకుపోయింది. గురువారం సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గే అవకాశముందని అధికారులు అంటున్నారు. ఏడు రోజులుగా వరద ముంచెత్తడంతో గీతామందిరం ప్రాంగణంలో సుమారు మూడు అడుగుల మేర ఒండ్రు మట్టి పేరుకుపోయింది. మద్దూరులంక గ్రామం వరద ముంపు నుంచి తేరుకుంది. అయినా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ఉంది. సముద్రంలోకి 13.02 లక్షల క్యూసెక్కులు ఎగువ నుంచి వచ్చే వరద నీరు తగ్గడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం తగ్గుతుంది. ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 13.70 అడుగులకు తగ్గడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఉదయం 6 గంటలకు 15.10 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం 7 గంటలకు 13.50 అడుగులకు తగ్గింది. ఆనకట్ట నుంచి 13,02,785 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక గురువారం మధ్యాహ్నానికి ఉపసంహరించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దెబ్బతిన్న పంటలు : వరద ముంచెత్తడంతో పోలవరం, కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, పెరవలి, ఆచంట, యలమంచిలి మండలాల్లో వేలాది ఎకరాల లంక భూముల్లోని పంటలు ముంపుబారిన పడ్డాయి. అరటి, దొండ, వంగ, కూరగాయలు, చెరకు, మొక్కజొన్న రైతులు నష్టపోయారు. చెరకు తోటల్లో బురద చేరి పంటలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు. అంటువ్యాధులు వ్యాపించే అవకాశముందని లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. తాగునీటి బోర్లు, చేతిపంపుల్లో నుంచి వరద నీరు వస్తోందని అంటున్నారు. లోతట్టు ప్రాం తాల్లో బురద తొలగించేందుకు పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
వరద పోటుతో ఆంధ్ర, ఒడిశాల మధ్య స్తంభించిన రవాణా
మెళియాపుట్టి, టెక్కలి రూరల్, సంతకవిటి, న్యూస్‌లైన్: గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. నారుమళ్లు నీట మునుగుతున్నాయి. పలు గ్రా మాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోతున్నాయి. సంతకవిటి మండలంలో నారాయణపురం కాలువకు మంగళవారం వరద పోటెత్తడంతో రామారాయపురం, మల్లయ్యపేట, మంతిన, హొంజరాం తదితర గ్రామాల్లోని 400 ఎకరాల్లో నారుమళ్లు నీటిలో చిక్కుకున్నా యి. ఈ ప్రాంత రైతులకు ఆధారమైన నారాయణపురం, సాయన్న కాలువలు అస్తవ్యస్తంగా మారడంతో వరద నీరు నిలిచిపోయి పంటపొలాలను ముంచెత్తుతోంది. దీంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. మెళియాపుట్టి మండలం వసుంధర సమీపంలో పెద్ద ఖానా వంతెన డైవర్షన్ రోడ్డు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఒడిశా ప్రభుత్వం పెద్ద ఖానా పాత వంతెనను కూల్చి కొత్తది నిర్మిస్తోంది. వాహనాల రాకపోకలకు వీలుగా డైవర్షన్ రోడ్డును ఏర్పాటు చేశారు. మంగళవారం వరద తాకిడికి ఈ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పర్లాకిమిడి నుంచి బరంపురం, పలాస, టెక్కలి మధ్య తిరగాల్సిన ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు మెళియాపుట్టి నుంచి ఆల్‌ఆంధ్రా రోడ్డు మీదుగా పాతపట్నం, అక్కడి నుంచి పర్లాకిమిడి చేరుతున్నాయి. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. టెక్కలి ప్రాంతంలో అతి పెద్ద చెరువైన మదనగోపాల సాగరానికి మంగళవారం భారీ గండి పడింది. సుమారు 750 ఎకరాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. 4 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సాగరంలోని నీరంతా పంట పొలాల్లోకి మళ్లింది. అయోధ్యపురంతో పాటు సోమయ్యవలస, కంట్రగడ, సుఖదేవ్ పేట జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జేసీబీ సాయంతో గండిని పూడ్చే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో చేసేది లేక వంశధార అధికారులు చేతులెత్తేశారు. ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుం దోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.