వరద పోటుతో ఆంధ్ర, ఒడిశాల మధ్య స్తంభించిన రవాణా
Published Wed, Aug 7 2013 3:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
మెళియాపుట్టి, టెక్కలి రూరల్, సంతకవిటి, న్యూస్‌లైన్: గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. నారుమళ్లు నీట మునుగుతున్నాయి. పలు గ్రా మాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోతున్నాయి. సంతకవిటి మండలంలో నారాయణపురం కాలువకు మంగళవారం వరద పోటెత్తడంతో రామారాయపురం, మల్లయ్యపేట, మంతిన, హొంజరాం తదితర గ్రామాల్లోని 400 ఎకరాల్లో నారుమళ్లు నీటిలో చిక్కుకున్నా యి. ఈ ప్రాంత రైతులకు ఆధారమైన నారాయణపురం, సాయన్న కాలువలు అస్తవ్యస్తంగా మారడంతో వరద నీరు నిలిచిపోయి పంటపొలాలను ముంచెత్తుతోంది. దీంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మెళియాపుట్టి మండలం వసుంధర సమీపంలో పెద్ద ఖానా వంతెన డైవర్షన్ రోడ్డు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఒడిశా ప్రభుత్వం పెద్ద ఖానా పాత వంతెనను కూల్చి కొత్తది నిర్మిస్తోంది. వాహనాల రాకపోకలకు వీలుగా డైవర్షన్ రోడ్డును ఏర్పాటు చేశారు. మంగళవారం వరద తాకిడికి ఈ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పర్లాకిమిడి నుంచి బరంపురం, పలాస, టెక్కలి మధ్య తిరగాల్సిన ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు మెళియాపుట్టి నుంచి ఆల్‌ఆంధ్రా రోడ్డు మీదుగా పాతపట్నం, అక్కడి నుంచి పర్లాకిమిడి చేరుతున్నాయి. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది.
టెక్కలి ప్రాంతంలో అతి పెద్ద చెరువైన మదనగోపాల సాగరానికి మంగళవారం భారీ గండి పడింది. సుమారు 750 ఎకరాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. 4 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సాగరంలోని నీరంతా పంట పొలాల్లోకి మళ్లింది. అయోధ్యపురంతో పాటు సోమయ్యవలస, కంట్రగడ, సుఖదేవ్ పేట జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జేసీబీ సాయంతో గండిని పూడ్చే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో చేసేది లేక వంశధార అధికారులు చేతులెత్తేశారు. ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుం దోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement