ఘోరంగా టీడీపీ పరిస్థితి.. బీజేపీ కూడా అంతే | TDP Faces Problems In Srikakulam District Ahead Municipal Elections | Sakshi
Sakshi News home page

ఝలక్‌ ఇస్తున్న నాయకులు.. టీడీపీ నేతల్లో టెన్షన్‌!

Published Tue, Mar 2 2021 9:17 AM | Last Updated on Tue, Mar 2 2021 2:05 PM

TDP Faces Problems In Srikakulam District Ahead Municipal Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మున్సిపల్‌ పోరులో టీడీపీకి ముందే చుక్కలు కనబడుతున్నాయి. సర్పంచ్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ‘పచ్చ’ పార్టీకి మున్సిపల్‌ ఎన్నికల్లో అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనబడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించగా, మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలే ఝలక్‌ ఇస్తున్నారు. నామినేషన్‌ వేసిన అభ్యర్థులు కూడా బరిలో ఉండలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే పలాస మున్సిపాల్టీలో కౌన్సిలర్లుగా నామినేషన్‌ వేసిన నలుగురు టీడీపీ అభ్యర్థులు వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. నేటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ పర్వం ప్రారంభం కానుంది. ఈ రెండు రోజుల వ్యవధిలో ఇంకెంతమంది ఉపసహకరించుకుంటారోనన్న టెన్షన్‌ టీడీపీ నేతల్లో మొదలైంది.  

టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ప్రజలు ఇచ్చే తీర్పునకు ముందే ఆ పార్టీ నాయకులు పక్కకు తప్పుకుంటున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వైఎస్సార్‌సీపీ ధాటికి తట్టుకోలేమని పోటీకి భయపడుతున్నారు. పార్టీ గుర్తు లేని పంచాయతీ ఎన్నికల్లోనే ప్రజలు దారుణమైన తీర్పు ఇచ్చారని, పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో ఇంకెన్ని దయనీయ పరిస్థితులు ఎదురవుతాయోనన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుంది. కరోనాకు ముందు నామినేషన్‌ వేసిన అభ్యర్థులు సైతం పోటీ చేయలేమని తప్పుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

పలాస మున్సిపాలిటీలో టీడీపీ తరఫున నాలుగో వార్డుకు నామినేషన్‌ వేసిన వాయిలపల్లి శ్రీనివాసరావు, 20వ వార్డుకు నామినేషన్‌ వేసిన బమ్మిడి వెంకటలక్ష్మి, 29వ వార్డుకు నామినేషన్‌ వేసిన సనపల దీప్తి ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు.  
తాజాగా ఎనిమిదో వార్డుకు నామినేషన్‌ వేసిన రోణంకి మురళీకృష్ణ కూడా వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు.   
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ముందు నిలవలేమని, సీఎం పరిపాలనకు ఆకర్షితులై మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో పార్టీలో చేరిపోయారు. ఉప సంహరణల సమయంలో పోటీ నుంచి విరమించుకోనున్నారు.  
ఒక్క పలాసలోనే కాదు ఇచ్ఛాపురం, పాలకొండలో కూడా అదే పరిస్థితి ఉంది. 

బీజేపీకీ అదే పరిస్థితి... 
బీజేపీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. పలాసా మున్సిపాలిటీలోని 21వ వార్డుకు నామినేషన్‌ వేసిన దేవరశెట్టి బాలాజీ గుప్తా, 26వ వార్డుకు నామినేషన్‌ వేసిన మళ్లా రమ్య ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. ఒకటి రెండు చోట్ల నామినేషన్‌ వేసిన బీజేపీ అభ్యర్థులు కూడా బరిలో నుంచి తప్పుకుంటున్నారు.

ముందే తప్పుకోవడం మంచిదంటూ...   
పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 81.61 శాతం సర్పంచ్‌ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు.. పార్టీ గుర్తుపై జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించడం నల్లేరుపై నడకేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో సునాయాసంగా గెలుపు సాధించే పరిస్థితి కని్పస్తుండటంతో టీడీపీ నేతలు ఎన్నికలకు ముందే హడలెత్తిపోతున్నారు.

చదవండిహైడ్రామా: చంద్రబాబు ‘కపట’ దీక్ష

 గొల్లపూడిలో టీడీపీకి చావుదెబ్బ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement