కారంచేడు, న్యూస్‌లైన్: భారీ వర్షాలకు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి కన్నీటి పర్యంతమవుతున్న రైతులను ఓదార్చేవారే కరువయ్యారు. పాలకులు వచ్చారు..వెళ్లారు అన్నట్లుగా వ్యవహరిస్తుంటే..అధికారులు మాత్రం మాకెందుకులే అన్నట్లు చోద్యం చూస్తున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలు కారంచేడు ప్రాంత రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. రైతులు వరి సాగుకు ఎకరాకు రూ 15 వేల వరకు ఖర్చు చేశారు. తాగు, సాగునీరందించే కొమ్మమూరు కాలువకు జిల్లాలో సుమారు 50 చోట్ల గండ్లు పడ్డాయి. నీటి ఉధృతికి సాగుచేసిన పంటలు కొట్టుకుపోగా..మిగిలిన 10-20 శాతం పంటలను బతికించుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కాలువకు గండ్లు పడటంతో అధికారులు నీటి సరఫరా నిలిపేశారు. దీంతో కాలువ పూర్తిగా ఎండిపోయింది. యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
వర్షాలు తగ్గి పదిహేను రోజులవుతున్నా పాలకులు, అధికారుల్లో స్పందన లేదు. కారంచేడు, చీరాల, వేటపాలెం, పర్చూరు, చినగంజాం, సంతనూతలపాడు మండలాల్లో కొమ్మమూరు కింద సుమారు లక్ష ఎకరాల్లో అధిక భాగం పంట తుడిచిపెట్టుకుపోయింది. మిగిలిన పంటలను కాపాడుకోవాలంటే రైతులకు నీరు అవసరం. అవి లేకపోవడంతో తీరేదెన్నడు పంటలు ఎండుముఖం పడుతున్నాయి. చివరకు మురుగు కుంటల్లో నిలిచిన నీటిని రైతులు డీజిల్ ఇంజన్ల ద్వారా పొలాలకు తరలిస్తూ అదనపు ఖర్చుతో అల్లాడుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ తుడిచిపెట్టుకు పోయింది. రబీకి సిద్ధపడుతున్న అన్నదాతలు నార్లు పోసుకోవాలంటే నీరు కావాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొమ్మమూరుకు పడిన గండ్లు పూడ్చి కాలువకు నీరు వదిలి తమ కడగండ్లు తీర్చాలని రైతులు కోరుతున్నారు.