సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్: సాగునీటి ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం శాపంలా పరిణవిుంచింది! గత సర్కారు నిర్వాకాలతో గుండ్లకమ్మ రిజర్వాయర్ రెండో గేటులో దిగువన తుప్పు పట్టిపోయిన భాగం (8.4 మీటర్ల వెడల్పు, నాలుగు మీటర్ల ఎత్తు) శుక్రవారం రాత్రి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. రిజర్వాయర్ గేట్ల మరమ్మతులు, రంగులు పేరుతో టీడీపీ హయాంలో 2014 –2019లో పనులు చేయకుండానే రూ.3.57 కోట్లు దిగమింగేయడం దీనికి కారణం.
సుందరీకరణ పేరుతో మరో రూ.1.58 కోట్లు వెరసి రూ.5.15 కోట్లు స్వాహా చేశారు. గేట్లకు రంగులు పూయకపోవడం వల్ల తుప్పు పట్టి బలహీనంగా మారాయి. దీంతో వరద ఉద్ధృతికి గతేడాది ఆగస్టు 31న మూడో గేటు కొట్టుకుపోగా తాజాగా రెండో గేటులో అడుగు భాగం కొట్టుకుపోయింది. చంద్రబాబు హయాంలో నిధులు కాజేయకుండా గేట్లకు మరమ్మతులు చేసి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మరమ్మతు టెండర్ ఖరారైన రోజే..
గతేడాది మూడో గేటు కొట్టుకుపోయినప్పుడు యుద్ధప్రాతిపదికన స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేసిన ప్రభుత్వం రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసి రైతుల ప్రయోజనాలను కాపాడింది. మరో రెండు గేట్లు బలహీనంగా ఉండటంతో యుద్ధప్రాతిపదికన రూ.1.11 కోట్లు వెచ్చించి మరమ్మతు చేసింది.
మిగతా 10 గేట్ల మరమ్మతులు, రంగులు పూయడం, దెబ్బతిన్న గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, కొత్త వైర్ రోప్‌లు, గ్యాంట్రీ క్రేన్ ఏర్పాటు పనులకు రూ.9.14 కోట్లతో టెండర్లు పిలిచింది. వాటిని అధికారులు శుక్రవారం ఖరారు చేశారు. రివర్స్ టెండరింగ్ పద్ధతిలో ఆ పనులను రాజస్థాన్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మెషినరీ సంస్థ దక్కించుకుంది. గేట్ల మరమ్మతు టెండర్ ఖరారైన రోజే వరద ఉద్ధృతికి రెండో గేటు కొట్టుకుపోయింది.
టీడీపీ సర్కార్ అవినీతితో
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టును జలయజ్ఞం కింద చేపట్టిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలో 80,060 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసింది. గేట్ల మరమ్మతులు, రంగులు పూయడం పేరుతో నిధులు కాజేసింది. దీంతో గేట్లు తుప్పు పట్టిపోయాయి. దీని ఫలితంగానే పులిచింతల ప్రాజెక్టులో ఒక గేటు, గుండ్లకమ్మలో రెండు గేట్లు కొట్టుకుపోయాయి.
యుద్ధప్రాతిపదికన స్టాప్‌లాగ్ గేటు
గుండ్లకమ్మ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 24.380 మీటర్లు కాగా నీటి నిల్వ సామర్థ్యం 3.86 టీఎంసీలు. ప్రాజెక్టు స్పిల్ వేకు 8.4 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తుతో కూడిన 12 గేట్లను అమర్చారు. మిచాంగ్ తుపాను వల్ల ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ పది వేల క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చింది. గేట్లు బలహీనంగా ఉండటంతో 2.30 టీఎంసీలను నిల్వ చేస్తూ వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు.
ఈ సమయంలో రెండో గేటు, పదో గేటు మరీ బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఒక్కో స్టాప్ లాగ్ ఎలిమెంట్‌ను అడుగు భాగంలో దించారు. అయితే బలహీనంగా ఉన్న రెండో గేటులో 4 మీటర్ల ఎత్తుతో కూడిన ఒక భాగం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 2.30 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కొట్టుకుపోయిన రెండో గేటు స్థానంలో శనివారం పూర్తి స్థాయి స్టాప్ లాగ్ గేటు అమర్చి నీటిని నిల్వ చేసి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడతామని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment