ఒంగోలు : ప్రకాశం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. తాళ్లూరు, ముండ్లమూరు, అద్దంకి వంటి ఎగువ మండలాల్లోని వాగులు, చెరువు అలుగులు పొంగిపొర్లటంతో గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు వరద నీరు పొటెత్తింది. దీంతో సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు చెందిన పది గేట్లను ఎత్తివేశారు.
దిగువకు 85వేల క్యూసెక్కుల వదర నీటిని దిగువకు విడుదల చేశారు. మద్దిరాలపాడు బ్రిడ్జి వద్ద 15 అడుగులకుపై నీరు ప్రవహిస్తోంది. దాంతో ఒంగోలు-చీరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పల్లికురవ బలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు మార్టురులోనూ భారీ వర్షం కురుస్తోంది. లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
విద్యుత్ సబ్స్టేషన్లోకి వరద నీరు చేరటంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇక యద్దనపూడి మండలంలో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. భారీ వర్షాలకు నీట మునిగిన అద్దంకి ఎన్టీఆర్ కాలనీలో వైఎస్‌ఆర్‌సీపీ నేత గొట్టిపాటి రవికుమార్ పర్యటించి, బాధితుల్ని పరామర్శించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ విజయ్ కుమార్ భారీ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.