
అన్యాయం చేసిన వాళ్లే అసూయపడేలా అభివృద్ధి చేద్దాం
* నవ నిర్మాణ దీక్షను విజయవంతం చేయండి
* మారథాన్ టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: అన్యాయం చేసిన వాళ్లే అసూయపడేలా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం తన నివాసం నుంచి 13జిల్లాలకు చెందిన 15 వేల మంది ప్రజా ప్రతినిధులతో 3 దశలుగా సీఎం భారీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ మారథాన్ టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మండల పరిషత్తు అధ్యక్షులు, జేడ్పీటీసీలు, సర్పంచులు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. విభజన వల్ల తలెత్తిన సంక్షోభం, ఏడాది పాలనపై చర్చించారు. అభివృద్ధి, సంక్షేమం తన ప్రభుత్వానికి రెండు కళ్లుగా అభివర్ణించారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు.
పేదరికం మీద విజయం సాధించటమే నవనిర్మాణ దీక్ష లక్ష్యమని, మంగళవారం నుంచి నిర్వహించనున్న ఈ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీక్ష అంటే నిరాహార దీక్ష కాదని, ఇది ఎవరికీ వ్యతిరేకంగా కాదని, పేదరికానికి వ్యతిరేకంగా, అందరూ సమష్టిగా విజయం సాధించటానికి సంకల్పం తీసుకునే దీక్ష అని చెప్పారు.
3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ‘పేదరికంపై గెలుపు’ అనే అంశాన్ని ఫోకస్ చేస్తామన్నారు. నీరు-మీరు, బడి పిలుస్తోంది కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. టెలీకాన్ఫరెన్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కష్ణారావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.గిరిధర్, వ్యవసాయశాఖ కార్యదర్శి విజయకుమార్, సాల్మన్ ఎ.రాజ్, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.