ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
Published Tue, Feb 28 2017 3:48 PM | Last Updated on Mon, Oct 8 2018 7:36 PM
► రేపటి నుంచి ప్రారంభం
► 136 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు
► హాజరుకానున్న
► 99,912 మంది విద్యార్థులు
► సమస్యాత్మక కేంద్రాల్లో
► సీసీ కెమెరాలతో నిఘా
► మార్చి 9న జరగాల్సిన
► పరీక్ష 19కి వాయిదా
► జిల్లా కేంద్రంలో
► కంట్రోల్ రూమ్ ఏర్పాటు
గుంటూరు : మార్చి ఒకటి నుంచి 19 వరకు జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 99,912 మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు 136 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రథమ సంవత్సర పరీక్షలకు 50,632 మంది విద్యార్థులు హాజరవుతుండగా వారిలో ఆర్ట్స్, సైన్స్ గ్రూపుల నుంచి 49,336 మంది, వృత్తి విద్యా కోర్సుల నుంచి 1,296 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు 49,280 మంది హాజరవుతుండగా వారిలో ఆర్ట్స్, సైన్స్ గ్రూపుల నుంచి 48,144 మంది, వృత్తి విద్యాకోర్సుల నుంచి 1,136 మంది విద్యార్థులు ఉన్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు...
ఇంటర్మీడియెట్ పరీక్షలకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని 136 పరీక్షా కేంద్రాల పరిధిలో 136 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అదే సంఖ్యలో శాఖాధికారులతో పాటు 30 మంది కస్టోడియన్లను నియమించింది.
పరీక్షా కేంద్రాలను అణువణువునా తనిఖీ చేసేందుకు నాలుగు ఫ్లయింగ్, ఐదు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ, ఆర్‌ఐవో అధ్యక్షతన జిల్లా పరీక్షల కమిటీ పరీక్షల తీరును పర్యవేక్షిస్తోంది. పరీక్షల్లో అవకతవకలను నిరోధించేందుకు గాను జిల్లాలోని నాలుగు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
దాచేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, అచ్చంపేటలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల, నగరం మండల కేంద్రంలోని ఎస్వీఆర్‌ఎం ఎయిడెడ్ జూనియర్ కళాశాల, గుంటూరులోని యాదవ జూనియర్ కళాశాలలో వీటిని ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా
మార్చి 9 పరీక్ష వాయిదా : ఆర్‌ఐవో
మార్చి 9న జరగాల్సిన పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా మార్చి 19వ తేదీకి వాయిదా వేసినట్లు ఆర్‌ఐవో టీవీ కోటేశ్వరరావు చెప్పారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మార్చి 9న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఆ రోజు జరగాల్సిన మ్యాథ్స్ 2బీ, జువాలజీ–2 పరీక్షలను ప్రభుత్వం మార్చి 19వ తేదీకి వాయిదా వేసిందని, విద్యార్థులు మార్పును గమనించాలని సూచించారు. మార్చి 18న పరీక్షలు ముగియనుండగా, వాయిదా పడిన పరీక్షను మరుసటి రోజున నిర్వహించనున్నట్లు వివరించారు.
జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నిచర్, ఫస్ట్ ఎయిడ్ కిట్‌లను సిద్ధం చేసినట్లు చెప్పారు. విద్యుత్ సరఫరాలో అవరోధం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే విద్యుత్ శాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది గుర్తింపు కార్డులు విధిగా ధరించాలని స్పష్టం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కోడ్ నంబర్, కళాశాల పేరు స్పష్టంగా కనిపించేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించామన్నారు. పరీక్షా కేంద్రాల్లో సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు జిల్లా కేంద్రంలో 0863–2228528 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.
విద్యార్థులూ..
ఈరోజే పరీక్షా కేంద్రాన్ని చూసి రండి
ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఒక రోజు ముందుగానే సంబంధిత పరీక్షా కేంద్రానికి స్వయంగా వెళ్లి రావాలని ఆర్‌ఐవో సూచించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులను అరగంట ముందుగా లోపలికి పంపుతామని తెలిపారు. నిర్దేశిత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్‌టిక్కెట్, పెన్నులు మినహా సెల్‌ఫోన్, కాలిక్యులేటర్ వంటి పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement