నల్లబెల్లం కొనుగోలులో మాటమార్చిన మార్క్‌ఫెడ్
ఎక్సైజ్‌శాఖ నిధులివ్వలేదంటూ తప్పించుకునే యత్నం
కొనుగోలు కేంద్రం ప్రారంభించి మిన్నకుంటున్న వైనం
గగ్గోలు పెడుతున్న బెల్లం రైతులు
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్క్‌ఫెడ్ 60 మంది రైతులకు అమ్మకపు టోకెన్లిచ్చి ఒక్క బెల్లం ముద్దనూ కొనకుండానే దుకాణం కట్టేసింది. పక్షం రోజులు దాటుతున్నా బెల్లం కొనకపోవడం పై మార్క్‌ఫెడ్‌ను ప్రశ్నిస్తే, ఎక్సైజ్ శాఖ నిధులివ్వలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో బెల్లం అమ్మకంపై ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మార్క్‌ఫెడ్ మాయజాలం
మార్క్‌ఫెడ్ జిల్లాలో నల్లబెల్లం కొనుగోలు కేంద్రాన్ని చిత్తూరులోని మార్కెట్ యార్డులో ఏప్రిల్ 2న ప్రారంభించింది. పాలసముద్రం, వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం, కార్వేటినగరం ప్రాంతాల్లో మరో నాలుగు కొనుగోలు కేంద్రాలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు చెప్పారు. కిలో బెల్లం రూ.27 వంతున కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది 700 నుంచి వెయ్యి టన్నుల వరకు బెల్లం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు రైతుల వద్ద ఎంత మోతాదులో బెల్లం ఉన్నా కొంటామన్నారు. రైతులు పట్టాదారు పాసుబుక్కులతోపాటు ఆధార్ కార్డు, రేషన్‌కార్డు లేదా ఓటరు కార్డు తీసుకురావాలన్నారు. దీంతో మార్క్‌ఫెడ్ ప్రకటనతో ఆర్థిక ఇబ్బందులతో బెల్లం అమ్ముకున్న రైతులు తప్ప.. అప్పటి వరకు బెల్లం నిల్వ ఉంచుకున్న రైతుల్లో ఆనందం వెల్లివెరిసింది. మార్క్‌ఫెడ్ గిట్టుబాటు ధరకు బెల్లం కొంటే పెట్టుబడులు పోను అంతోఇంతో చేతికి వస్తుందని ఆశించారు. కానీ ఆ ఆశలు ఎన్నో రోజులు నిలవలేదు.
ఒక్కరోజుకే.. బంద్
తొలిరోజు 60 మంది బెల్లం రైతులకు అమ్మకపు టోకెన్లు మంజూరు చేసిన మార్క్‌ఫెడ్ అధికారులు సాయంత్రానికే దుకాణం కట్టేశారు. మరుసటి రోజు నుంచే ఇప్పట్లో బెల్లం కొనుగోలు చేయడం లేదంటూ రైతులకు అమ్మకపు టొకెన్లు ఇవ్వడం నిలిపేశారు. ఇదేమని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నల్లబెల్లం కొనుగోలు నిలిపివేశామని చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఖరాకండిగా చెప్పేశారు. ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే నల్లబెల్లం కొనుగోలుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిధులివ్వాల్సి ఉందని, ఆ నిధులు వస్తేనే బెల్లం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
నిధులివ్వని ఎక్సైజ్ శాఖ
ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు మార్క్‌ఫెడ్ జిల్లాలో 700 టన్నుల నల్లబెల్లం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.2 కోట్లు నిధులు అవసరమవుతాయి. ఎక్సైజ్ శాఖ నిధులిస్తేనే మార్క్‌ఫెడ్ బెల్లం రైతులకు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిఉంది. అయితే గత ఏడాది సైతం ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు మార్క్‌ఫెడ్ 627 టన్నుల బెల్లాన్ని కొనుగోలుచేసింది. దీనికి సంబంధించి దాదాపు రూ.2 కోట్ల నిధులు రైతులకు చెల్లించాల్సి ఉండగా ఎక్సైజ్ శాఖ కేవలం కోటి రూపాయలు మాత్రమే నిధులిచ్చి చేతులు దులుపుకుంది. ఇంకా కోటి రూపాయలు రావాల్సి ఉండడంతో మార్క్‌ఫెడ్ నల్లబెల్లం కొనుగోలును అర్థాంతరంగా నిలిపివేసినట్లు సమాచారం.
చిత్తశుద్ధిలేని ప్రభుత్వం..
నల్లబెల్లం కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని ఆశలు కల్పించిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు ఇవ్వడంలో మాత్రం సీత కన్నేసింది. ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో స్పందించపోవడంపై రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.