వెంకయ్యా.. బ్లాక్‌మెయిల్ రాజకీయాలొద్దు | marri rajasekhar takes on Telugu Desam Party | Sakshi
Sakshi News home page

వెంకయ్యా.. బ్లాక్‌మెయిల్ రాజకీయాలొద్దు

Published Mon, Dec 1 2014 1:16 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

వెంకయ్యా.. బ్లాక్‌మెయిల్ రాజకీయాలొద్దు - Sakshi

వెంకయ్యా.. బ్లాక్‌మెయిల్ రాజకీయాలొద్దు

వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పానెం హనిమిరెడ్డి నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం క్రోసూరులోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. తొలుత  హనిమిరెడ్డిని సమావేశానికి పరిచయం చేసిన అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ ఐదవ తేదీన గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని రైతులు, మహిళలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.

క్రోసూరు
కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు రాష్ట్ర రాజధాని విషయంలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయద్దని, ఈ విషయంలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం కావాలనే  కోరుతున్నామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పానెం హనిమిరెడ్డి నియమితులైనవిషయం విదితమే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశానికి పార్టీ మండల కన్వీనర్ షేక్ మస్తాన్ అధ్యక్షత వహించారు. సమావేశంలో మర్రి మాట్లాడుతూ రాజధాని విషయంలో గుంటూరు జిల్లా వద్దని ఏ పార్టీకూడా చెప్పలేదన్నారు.

అయితే, అక్కడి రైతులు, రైతు కూలీలు, పనులు కోల్పోయే స్థానికులకు న్యాయం జరిగేలా రాజధాని నిర్మాణం ఉండాలని కోరినట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని విషయమై పూర్తి మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు రాజధాని అక్కడ కాదంటే అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ప్రభుత్వంపై తిరగబడతారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ ఐదున కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని మర్రి కోరారు.
 
నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ పర్యవేక్షకుడు ఆళ్ల పేరిరెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోది జపం చేస్తూ అవినీతి నేతల పంచెలూడగొట్టాలని ఉపన్యాసాలు ఇచ్చిన సినీనటుడు పవన్‌కల్యాణ్ ఇప్పుడేం చేస్తున్నాడని విమర్శించారు. అధికార తెలుగుదేశం పార్టీ అవినీతి, ప్రజావ్యతిరేక పనులు పవన్‌కల్యాణ్‌కు కనపడడం లేదా అని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలని నూటికి నూరుశాతం కృషిచేస్తోంది ఒక్క వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. ప్రజాసమస్యలకు సంబంధించి జిల్లా పరిషత్ సమావేశాల్లో పార్టీ వాణిని వినిపిస్తానని చెప్పారు.

వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో విషసంస్కృతి మొదలైందన్నారు. అధికారపార్టీ నాయకులు ప్రభుత్వకార్యాలయాలు, పోలీసుస్టేషన్‌లలో ఒత్తిళ్లు తీసుకువస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ధోరణిలో ఉందని, ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటాలు చేస్తుందన్నారు. వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఎక్కడున్నా పార్టీ కోసం, తనపై నమ్మకం పెట్టుకున్న పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకోసం ఎప్పుడు అండగా ఉంటానని, పానెం హనిమిరెడ్డికి సహాయసహకారాలు అందిస్తానని చెప్పారు.

తొలుత పెదకూరపాడు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన పానెం హనిమిరెడ్డిని సమావేశంలో పరిచయం చేశారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ నర్సిరెడ్డి, అచ్చంపేట, పెదకూరపాడు, అమరావతి, బెల్లంకొండ మండలాల కన్వీనర్లు సందెపోగు సత్యం, బెల్లంకొండ మీరయ్య, మంగిసెట్టి కోటేశ్వరరావు, మర్రి ప్రసాదరెడ్డి, పార్టీ నాయకులు ఆళ్ల దశరథరామిరెడ్డి, ఈదా సాంబిరెడ్డి, ఆవుల అంకిరెడ్డి, బెల్లంకొండ ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీరెడ్డి, అచ్చంపేట సొసైటీ అధ్యక్షులు తులశమ్మ, షేక్ సుభాని, నాయకులు రవీంద్రబాబు, కోటిరెడ్డి, కొత్త చిన్నప్పరెడ్డి, కోట హరిబాబు, రోశిరెడ్డి, కోట మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు మర్రి కోటిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement