వివాహిత బలవన్మరణం...
Published Sun, Oct 20 2013 2:58 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
టెక్కలిరూరల్,న్యూస్‌లైన్: పెళ్లి అయిన రెండు నెలలకే వివాహిత శనివారం రాత్రి ఒంటికి నిప్పంటించుకుని మృతి చెందడం టెక్కలి పట్టణంలో సంచలనం కలిగించింది. ఆమె మృతికి భర్తే కారణమని మృతురాలి సోదరులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. టెక్కలి గొల్లవీధికి చెందిన బూరగాన అశ్విని (19) శనివారం రాత్రి తమకు ప్రత్యేకంగా ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటికి నిప్పటించుకుని తీవ్రంగా కాలిపోయింది. ఇంటి నుంచి పొగలు బయటకు రావడాన్ని గమనించిన అత్త చిన్నమ్మి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక శాఖకు సమాచారం అందజేశారు.
సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా అశ్విని గుర్తు పట్టలేని విధంగా తయారై మృతి చెంది ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న అశ్విని సోదరులు రాజేష్, గోవింద్ అక్కడకు చేరుకుని సోదరి మృతికి భర్త లక్ష్మణరావు కారణమని ఆరోపించారు. నందిగాం మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన చెల్లెలిని టెక్కలి గొల్లవీధికి చెందిన తాపీమేస్త్రీ లక్ష్మణరావుతో ఈ ఏడాది ఆగస్టు 21న వివాహం జరిపించామని, సుమారు రూ.2 లక్షల కట్నంతో పాటు 2 తులాల బంగారం ఇచ్చామని తెలిపారు.
అయితే భర్త లక్ష్మణరావు తన చెల్లెలిపై హత్యాయత్నం చేశాడ ని ఆరోపిస్తూ అతడిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. సంఘటన స్థలం వద్ద ఉన్న పోలీసులు అత్త చిన్నమ్మితో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై హెచ్‌సీ వెంకటరమణతో పాటు సిబ్బంది వివరాలు సేకరించారు. ఇంకా కేసు నమోదు కాలేదు. కుటుంబంలో చిన్నపాటి తగాదాలే అశ్విని మృతికి కారణమై ఉండొచ్చని పలువురు స్థానికులు చెబుతుండగా, తన చె ల్లెలిని అనుమానిస్తూ బావే ఈ హత్యకు పాల్పడ్డాడని సోదరులు అంటున్నారు.
Advertisement
Advertisement