ఏలూరు అర్బన్ : భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మనస్తాపానికి గురైన భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబం««ధించి మృతురాలి తండ్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నగరంలో సివిల్ సప్‌లైస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న కులుకుర్తి సత్యనారాయణ కుమార్తె దుర్గాభవానీకి ఏలూరు నగరానికి చెందిన దిమిలి శివకుమార్ అనే వ్యక్తితో 2013లో వివాహం జరిగింది. నాటి నుంచి దుర్గాభవానీ, శివకుమార్‌లు స్థానిక గ్జేవియర్‌నగర్ ఏటిగట్టు సమీపంలో నివాసం ఉంటున్నారు. అయితే శివకుమార్ కొంతకాలంగా పొరుగింట్లో ఉంటున్న మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇది గమనించిన దుర్గాభవానీ, శివకుమార్‌ను నిలదీసింది.
దాంతో వారిద్దరూ తగవులు పడుతున్న నేపథ్యంలో కుమార్తె ద్వారా విషయం తెలుసుకున్న తండ్రి సత్యనారాయణ ఈ నెల 17న ఏలూరు వచ్చి అల్లుడిని అక్రమసంబంధం విషయంలో నిలదీశాడు. దాంతో అల్లుడు శివకుమార్ దుర్గాభవానీ గొడ్రాలని, పిల్లలు పుట్టలేదని ప్రియురాలిని విడిచి పెట్టేదిలేదని తెగేసి చెప్పాడు. ఈ క్రమంలో శనివారం తన కూతురు దుర్గాభవానీ ఉరివేసుకుని మరణించిందని వార్త తెలియడంతో ఏలూరు వచ్చానని సత్యనారాయణ తెలిపారు. తన కూతురు మరణానికి భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పాటు ఇటీవలే ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిసిందని ఈ కారణంతో మనస్తాపానికి గురైన తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తన కుమార్తె మరణానికి పరోక్షంగా కారణమైన అల్లుడు శివకుమార్‌తో పాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment