
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
రాజమండ్రి రూరల్ :భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత(ఆరు నెలల గర్భిణీ) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజానగరం మండలం హౌసింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం... హౌసింగ్ బోర్డుకాలనీకి చెందిన పడాల చిన్నారెడ్డికి కపిలేశ్వరపురం మండలం పశ్చిమఖండ్రిక గ్రామానికి చెందిన ప్రస్తుతం ముక్కినాడలో ఉంటున్న గరగ మల్లేశ్వరరావు రెండో కుమార్తె పడాల పార్వతి(28)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో రూ.75 వేల నగదు, అరకాసు ఉంగరం పెట్టారు. అయితే పార్వతికి ఇంతకుముందే మోరంపూడి శ్రీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌తో వివాహమైంది. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెద్దల సమక్షంలో విడిపోయారు. ఈ విషయాన్ని చిన్నారెడ్డి, అతడి కుటుంబ సభ్యులందరికీ చెప్పి, ఒప్పించిన తర్వాతే చిన్నారెడ్డి, పార్వతిల వివాహం జరిగింది.
మద్యం తాగి రావడం... పట్టించుకోకపోవడం..
ఓ దినపత్రికలో ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్‌గా పనిచేస్తున్న చిన్నారెడ్డి ప్రతి రోజు మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. అంతేకాదు పార్వతిని, రెండేళ్ల కుమారుడిని పట్టించుకోకపోవడంతో తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవి. అంతేకాదు అదనపు కట్నం తీసుకురావాలని ఆమెను వేధిస్తుండేవాడు. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి పడాల చిన్నారెడ్డి మద్యం సేవించి రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి వెళ్లాడు. కుమారుడిని పక్కనే పడుకోబెట్టుకున్నాడు. శనివారం అర్ధరాత్రి చిన్నారెడ్డి తండ్రి వెంకటరెడ్డి వచ్చి దినపత్రికను కాకినాడ తీసుకువెళ్లాలని నిద్రలేపాడు.
అయితే చిన్నారెడ్డి మంచి నీరు కోసం భార్య పార్వతిని లేపగా, పక్కన ఆమె లేకపోవడంతో లైటు వేసి చూశాడు. మధ్య గదిలో ఫ్యాన్ కొక్కానికి ఆమె ఉయ్యాలతాడు, చీరతో కలిపి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే చిన్నారెడ్డి బొమ్మూరు పోలీసులకు విషయాన్ని తెలిపాడు. సంఘటన స్థలాన్ని బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ సాయిరమేష్,ఎస్సై జాన్‌మియాలు చేరుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పార్వతి తండ్రి మల్లేశ్వరరావు, సోదరి ఆదిలక్ష్మి తదితరులు అక్కడికి చేరుకుని భర్త వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదే చేశారు. సంఘటన స్థలాన్ని తూర్పు మండల డీఎస్పీ కేవీ మురళీకృష్ణ మృతదేహాన్ని పరిశీలించి, పార్వతి భర్తను, ఆమె కుటుంబసభ్యులను విచారించారు. ఈ మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదచాయలు
పార్వతి ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం తెలియగానే ఆమె కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆరునెలల గర్భిణీ పార్వతిని ఈ నెల ఆరో తేదీనే వచ్చి చూసి వెళ్లామని, ఇంతలోనే ఇలా చేసుకుంటుందని అనుకోలేదని తండ్రి మల్లేశ్వరరావు, సోదరి ఆదిలక్ష్మి బోరున విలపించారు.