కాజులూరు :భర్తతో కలసి బయటకు వెళ్లిన ఓ భార్య డ్రెయిన్‌లో శవమై తేలింది. ఆమె మృతికి భర్తే కారణమని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లరేవు మండలం పత్తిగొందికి చెందిన గుత్తుల సుశీలకుమారి (30)కు రామచంద్రపురంలోని గుబ్బలవారిపేటకు చెందిన రమణతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. రమణ తరచూ మద్యం సేవించి వేధింపులకు గురిచేస్తుండటంతో తొమ్మిది నెలలు క్రితం సుశీల పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా సుశీల ఆదివారం కె.గంగవరం మండలం పామర్రులోని తన సోదరి ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న రమణ పామర్రు వెళ్లి సుశీలను మన ఇంటికి వెళదామని తీసుకుని బయలుదేరాడు.
ఆ రోజు నుంచి సుశీల కనిపించడం లేదు. రమణ ఆచూకీ కూడా లేదు. కుమార్తె కనిపించకపోవడంపై ఆమె తండ్రి బొక్కా జోగిరాజు తాళ్లరేవు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం సాయంత్రం కాజులూరు మండలం నామవానిపాలెం-ఉప్పుమిల్లి మధ్యలో టేకి డ్రెయిన్‌లో మహిళ మృతదేహాన్ని స్థానికులు కనుగొని గొల్లపాలం పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసే వీలులేకపోయింది.
గురువారం మృతదేహాన్ని బయటకు తీసి గుర్తు తెలియని మహిళగా పేర్కొని చుట్టుపక్కల గల తాళ్లరేవు, పామర్రు, రామచంద్రపురం పోలీస్ స్టేషన్లకు సమాచారమందించారు. అప్పటికే సుశీల అదృశ్యంపై తాళ్లరేవు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఉండటంతో ఆమె తండ్రిని వెంట పెట్టుకుని తాళ్లరేవు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండగా దుస్తుల ఆధారంగా మృతురాలు సుశీలగా ఆమె తండ్రి జోగిరాజు గుర్తించారు. కాగా ఆమె భర్త రమణ పరారీలో ఉన్నట్టు గొల్లపాలెం ఎస్‌ఐ సీహెచ్ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు ఎస్‌ఐ సుధాకర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
డ్రెయిన్‌లో వివాహిత మృతదేహం
Published Fri, Sep 19 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM
Advertisement
Advertisement