kajuluru
-
పండుగ వేళ దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: దీపావళి పండుగ వేళ కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాజులూరు మండలం సెలపాకలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. బత్తుల కుటుంబీకులపై పొట్లకాయ ఫ్యామిలీ కత్తులతో దాడి చేశారు. దీంతో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతిచెందారు.మృతులు బత్తుల రమేష్, రాజు, చిన్నిగా గుర్తించారు. దాడి తర్వాత నిందితులు పరారయ్యారు. గాయపడ్డ నాలుగో వ్యక్తిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా ఎస్పీ విక్రాంత్ విచారిస్తున్నారు. సెలపాక గ్రామంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. -
కాకినాడలో విషాదం.. కారులో ఊపిరాడక చిన్నారి మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో విషాదం చోటుచేసుకుంది. పార్క్ చేసి ఉంచిన కారులో ఆడుకునేందుకు వెళ్లిన పాప.. అందులోనే మృత్యువాతపడింది. కారు డోర్లు లాక్ అవడం.. ఎవరూ గమనించకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలిక అఖిలాండేశ్వరి.. దగ్గరల్లో పార్క్ చేసిన కారులోకి వెళ్లి డోర్ వేసుకుంది. మళ్లీ డోర్ లాక్ తీయరాకపోవడంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడింది. ఈ క్రమంలో కారులో గాలి అందకపోవడంతో చిన్నారి స్పృహ కోల్పోయింది. మధ్యాహ్నం కారులోకి వెళ్లిన పాప సాయంత్రం వరకు అందులోనే ఉండిపోయింది. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కలా మొత్తం గాలించారు. చివరికి ఇంటి పక్కన కారులో కొన ఊపిరితో బాలికను గుర్తించిన స్థానికులు హుటాహుటిన యానాం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా ఏడాది క్రితమే బాలిక తండ్రి మరణించగా.. బాలికతో పాటు, పదేళ్ల కొడుకును పాచి పనులు చేసుకుంటూ తల్లి ఆదిలక్ష్మి పోషించుకుంటోంది. తాజాగా కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చదవండి: ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి యువకుడు మృతి -
కరోనా లాక్డౌన్ నుంచి ఇంట్లోనే.. మూడేళ్లుగా బయటకు రాని తల్లీకూతుళ్లు
సాక్షి, కాకినాడ(కాజులూరు): మండలంలోని కుయ్యేరులో మానసిక అనారోగ్యంతో మూడేళ్లుగా ఇంటికే పరిమితమైన తల్లీకూతుళ్ల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి అనారోగ్యం పాలవ్వటంతో విషయం తెలసుకున్న ఆరోగ్యశాఖ సిబ్బంది పోలీసులు, స్థానికుల సహకారంతో బలవంతంగా వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలివీ.. కుయ్యేరు గ్రామ పంచాయతీ సమీపంలో నివాసముంటున్న కర్నిడి సూరిబాబు ఇంటింటికీ తిరిగి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కరోనా లాక్డౌన్ సమయంలో అందరితోపాటు ఇంటికే పరిమితమైన అతని భార్య మణి, కూతురు దుర్గాభవాని మానసిక వ్యధతో నేటికీ బయటకు రాకుండా తలుపులు బిగించుకు ఉండిపోయారు. చుట్టుపక్కల ఇళ్లవారు, బంధువులు వచ్చి పిలిచినా మీరు మాకు చేతబడి చెయ్యటానికి వచ్చారా.. అంటూ తలుపులు తియ్యకుండా లోపలి నుంచే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండేవారు. దీంతో క్రమేపీ ఎవరూ వీరిని పలకరించటం మానేశారు. సూరిబాబు రోజూ కూరగాయల వ్యాపారానికి వెళ్లివస్తూ వీరికి అవసరమైన ఆహారం, వస్తువులు తెచ్చి ఇస్తున్నాడు. కొన్ని రోజులు అతని భార్య ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీంతో సూరిబాబు తన భార్యకు వైద్యం అందించమని దుగ్గుదుర్రు పీహెచ్సీలో సిబ్బందిని కోరాడు. చదవండి: (మళ్లీ అరకు ఇన్స్టెంట్ కాఫీ రెడీ) మంగళవారం వైద్యసిబ్బంది వచ్చి పిలిచినా తలుపులు తియ్యలేదు. గ్రామ సర్పంచ్ పిల్లి కృష్ణమూర్తి, స్థానికుల సహకారంతో తులపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. అయితే తల్లి, కూతుళ్లు వైద్యానికి నిరాకరిస్తూ సిబ్బందిపై దాడి చేశారు. సర్పంచ్ పిల్లి కృష్ణమూర్తి ఫోన్లో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణకు సమాచారమందించగా ఆయన ఆదేశాల మేరకూ గొల్లపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను 108 అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన భార్య, కుమార్తె మానసిక పరిస్థితి బాగోలేదని, ఎప్పటికైనా సరౌతుందనే భావనతో మూడేళ్లుగా ఎవ్వరికీ చెప్పలేదని భర్త సూరిబాబు తెలిపాడు. -
డ్రెయిన్‌లో వివాహిత మృతదేహం
కాజులూరు :భర్తతో కలసి బయటకు వెళ్లిన ఓ భార్య డ్రెయిన్‌లో శవమై తేలింది. ఆమె మృతికి భర్తే కారణమని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లరేవు మండలం పత్తిగొందికి చెందిన గుత్తుల సుశీలకుమారి (30)కు రామచంద్రపురంలోని గుబ్బలవారిపేటకు చెందిన రమణతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. రమణ తరచూ మద్యం సేవించి వేధింపులకు గురిచేస్తుండటంతో తొమ్మిది నెలలు క్రితం సుశీల పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా సుశీల ఆదివారం కె.గంగవరం మండలం పామర్రులోని తన సోదరి ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న రమణ పామర్రు వెళ్లి సుశీలను మన ఇంటికి వెళదామని తీసుకుని బయలుదేరాడు. ఆ రోజు నుంచి సుశీల కనిపించడం లేదు. రమణ ఆచూకీ కూడా లేదు. కుమార్తె కనిపించకపోవడంపై ఆమె తండ్రి బొక్కా జోగిరాజు తాళ్లరేవు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం సాయంత్రం కాజులూరు మండలం నామవానిపాలెం-ఉప్పుమిల్లి మధ్యలో టేకి డ్రెయిన్‌లో మహిళ మృతదేహాన్ని స్థానికులు కనుగొని గొల్లపాలం పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసే వీలులేకపోయింది. గురువారం మృతదేహాన్ని బయటకు తీసి గుర్తు తెలియని మహిళగా పేర్కొని చుట్టుపక్కల గల తాళ్లరేవు, పామర్రు, రామచంద్రపురం పోలీస్ స్టేషన్లకు సమాచారమందించారు. అప్పటికే సుశీల అదృశ్యంపై తాళ్లరేవు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఉండటంతో ఆమె తండ్రిని వెంట పెట్టుకుని తాళ్లరేవు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండగా దుస్తుల ఆధారంగా మృతురాలు సుశీలగా ఆమె తండ్రి జోగిరాజు గుర్తించారు. కాగా ఆమె భర్త రమణ పరారీలో ఉన్నట్టు గొల్లపాలెం ఎస్ఐ సీహెచ్ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ సుధాకర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త ప్రియురాలి చేతిలో గర్భిణి హత్య
కాజులూరు :వివాహేతర సంబంధం నిండుప్రాణాన్ని బలిగొంది. ఓ వ్యక్తి ప్రియురాలు అతని భార్యను చున్నీతో గొంతునులిమి హతమార్చింది. హతురాలు నాలుగు నెలల గర్భిణి. కాజులూరు శివారు చాకిరేవు మెరకలో గురువారం జరిగిన ఈ సంఘటనపై స్థానికులు, గొల్లపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని తిప్పరాజుపాలెంకు చెందిన ఖండవిల్లి ప్రకాశరావుకు కొత్తపేట మండలం వానపల్లి శివారు సంఘంపాలెంకు చెందిన దుర్గతల్లి (27)తో 2010లో వివాహం జరిగింది. ఏడాది పాటు వీరి కాపురం సుజావుగా సాగింది. వీరికి ఒక పాప పుట్టింది. అనంతరం సంసారంలో కలతలు రావడంతో వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ సమయంలో ప్రకాశరావుకు యానాంకు చెందిన మందపల్లి సంధ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. సంధ్య భర్తను వదలి తన ఇద్దరు పిల్లలతో ప్రకాశరావుతో ఉం టోంది. కొన్నాళ్ల క్రితం పెద్దలు ప్రకాశరావు, దుర్గతల్లితో చర్చించి వారి మధ్య సఖ్యత కుదిర్చారు. సంధ్య తన పిల్లలతో భర్త వద్దకు వెళ్లిపోయింది. ఇటీవల ప్రకాశరావు కాజులూరులోని ఓ ఇంటర్నెట్ సెంటరులో ఆపరేటర్‌గా చేరి చాకిరేవు మెకరలో అద్దె ఇంటిలో భార్య, కుమార్తెతో కలిసి నివాసముంటున్నాడు. ఇటీవల సంధ్య తరచూ ప్రకాశరావు ఇంటికి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలంటూ గొడవపడేది. దీంతో ప్రకాశరావు భార్యతో కలిసి 20 రోజుల క్రితం అత్తవారి ఊరు వెళ్లి గురువారం తిరిగి వచ్చాడు. భార్య, కుమార్తెను ఇంటివద్ద వదలి కూరగాయలు తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లాడు. అతడు తిరిగివచ్చి తలుపు తట్టేసరికి అతని సంధ్య ఇంటిలోంచి బయటకు వస్తూ దుర్గతల్లిని హత్య చేశానని తాను నిద్రమాత్రలు మింగానని తెలిపింది. స్థానికులు సంధ్యను పట్టుకుని చెట్టుకు కట్టి పోలీసులకు సమాచారమందించారు. గొల్లపాలెం ఎస్సై సీహెచ్ సుధాకర్ సంధ్యను అదుపులోకి తీసుకుని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రకాశరావు, స్థానికులను విచారించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు కాకినాడ రూరల్ సీఐ పల్లపురాజు, ఎస్సై సుధాకర్ తెలిపారు. ఇంట్లో విగతజీవిగా పడిఉన్న తన తల్లి మరణించి ందన్న విషయం తెలియని రెండేళ్ల చిన్నారి ఖ్యాతిశ్రీ బిత్తర చూపులు స్థానికులను కంటతడి పెట్టించాయి. -
లారీ, ఆటో ఢీ: ఇద్దరు మృతి
తూర్పు గోదావరి జిల్లా కాజులూరు వద్ద గురువారం ఉదయం ఆటోను ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరోకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టిప్పర్ లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.