భర్త ప్రియురాలి చేతిలో గర్భిణి హత్య
కాజులూరు :వివాహేతర సంబంధం నిండుప్రాణాన్ని బలిగొంది. ఓ వ్యక్తి ప్రియురాలు అతని భార్యను చున్నీతో గొంతునులిమి హతమార్చింది. హతురాలు నాలుగు నెలల గర్భిణి. కాజులూరు శివారు చాకిరేవు మెరకలో గురువారం జరిగిన ఈ సంఘటనపై స్థానికులు, గొల్లపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని తిప్పరాజుపాలెంకు చెందిన ఖండవిల్లి ప్రకాశరావుకు కొత్తపేట మండలం వానపల్లి శివారు సంఘంపాలెంకు చెందిన దుర్గతల్లి (27)తో 2010లో వివాహం జరిగింది. ఏడాది పాటు వీరి కాపురం సుజావుగా సాగింది. వీరికి ఒక పాప పుట్టింది. అనంతరం సంసారంలో కలతలు రావడంతో వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
ఈ సమయంలో ప్రకాశరావుకు యానాంకు చెందిన మందపల్లి సంధ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. సంధ్య భర్తను వదలి తన ఇద్దరు పిల్లలతో ప్రకాశరావుతో ఉం టోంది. కొన్నాళ్ల క్రితం పెద్దలు ప్రకాశరావు, దుర్గతల్లితో చర్చించి వారి మధ్య సఖ్యత కుదిర్చారు. సంధ్య తన పిల్లలతో భర్త వద్దకు వెళ్లిపోయింది. ఇటీవల ప్రకాశరావు కాజులూరులోని ఓ ఇంటర్‌నెట్ సెంటరులో ఆపరేటర్‌గా చేరి చాకిరేవు మెకరలో అద్దె ఇంటిలో భార్య, కుమార్తెతో కలిసి నివాసముంటున్నాడు. ఇటీవల సంధ్య తరచూ ప్రకాశరావు ఇంటికి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలంటూ గొడవపడేది. దీంతో ప్రకాశరావు భార్యతో కలిసి 20 రోజుల క్రితం అత్తవారి ఊరు వెళ్లి గురువారం తిరిగి వచ్చాడు. భార్య, కుమార్తెను ఇంటివద్ద వదలి కూరగాయలు తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లాడు.
అతడు తిరిగివచ్చి తలుపు తట్టేసరికి అతని సంధ్య ఇంటిలోంచి బయటకు వస్తూ దుర్గతల్లిని హత్య చేశానని తాను నిద్రమాత్రలు మింగానని తెలిపింది. స్థానికులు సంధ్యను పట్టుకుని చెట్టుకు కట్టి పోలీసులకు సమాచారమందించారు. గొల్లపాలెం ఎస్సై సీహెచ్ సుధాకర్ సంధ్యను అదుపులోకి తీసుకుని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రకాశరావు, స్థానికులను విచారించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు కాకినాడ రూరల్ సీఐ పల్లపురాజు, ఎస్సై సుధాకర్ తెలిపారు. ఇంట్లో విగతజీవిగా పడిఉన్న తన తల్లి మరణించి ందన్న విషయం తెలియని రెండేళ్ల చిన్నారి ఖ్యాతిశ్రీ బిత్తర చూపులు స్థానికులను కంటతడి పెట్టించాయి.