ఇక సమరమే.. | MLC Pilli Subhash Chandra Bose fire on TDP government | Sakshi
Sakshi News home page

ఇక సమరమే..

Published Sun, Apr 5 2015 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

MLC Pilli Subhash Chandra Bose fire on TDP government

 రామచంద్రపురం :విభిన్న అంశాలకు వేదికగా ఉండే రామచంద్రపురం నియోజకవర్గంలో మరోసారి భిన్న పరిస్థితులు నెలకుంటున్నాయి. నియోజకవర్గంలో 30 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటిగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇంత వరకు ఏకపక్షంగా సాగిన పాలనకు బోస్ ఎమ్మెల్సీగా రావటంతో తెరపడనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన సత్కార సభలో ఇక సమరమే అన్నట్టుగా సాగిన బోస్ ప్రసంగం మరింత బలం చేకూరుస్తుందంటున్నారు. సాధారణ ఎన్నికలు జరిగిన ఏడాదికి ఎమ్మెల్సీ పదవిని పొందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బోస్ తన సాధారణ శైలికి భిన్నంగా ప్రసంగించిన తీరు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
 
 గత నెల 30న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సుభాష్‌బోస్ ఈ నెల 2న నియోజకవర్గానికి విచ్చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గం నలుమూలల నుంచి ఊహించని విధంగా, అభిమానులు ప్రజలు తరలివచ్చిన తీరు టీడీపీ ప్రభుత్వంపైనా, స్థానిక నేత పైనా పెరుగుతున్న అసంతృప్తిని తెలియజేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అధికార పార్టీ నేతలు నివ్వెరపోయేలా జరిగింది బోస్ స్వాగత సత్కార ర్యాలీ. ఈ నెల 2న ద్రాక్షారామలో జరిగిన సత్కార సభలో బోస్ ఎన్నడూ లేని విధంగా మాట్లాడడం అటు అధికార పార్టీ నాయకుల్లోను, అధికారుల్లోనూ గుబులు రేపుతోంది. నిబద్ధతకల నేతగా ఉండే బోస్ ఒక్కసారిగా హెచ్చరికలు జారీ చేయటంతో అధికార పార్టీ నేతలకు, వారికి వంత పాడుతున్న అధికారులకు రాబోయే కాలంలో జరిగే పరిణమాలను ముందుగానే ఎలాగుంటాయోననే భయం ఏర్పడుతుందని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. చట్ట ప్రకారం పనిచేయండని ఎప్పుడూ అధికారులకు చెప్పే ఎమ్మెల్సీ బోస్‌కు..... నేను చెప్పిందే చేయాలనే స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు మధ్య అధికారులు నలిగిపోక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
 
 గత ఏడాది కాలంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో పరిస్థిలు అధ్వానంగా మారిపోయాయి. స్థానిక అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా మారింది. వైఎస్సార్‌సీపీ నాయకులపైనా, కార్యకర్తలపైనా కేసులు పెట్టి వేధింపులకు గురిచేయటం షరా మామూలుగా మారింది. వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులను వేధింపులకు గురిచేస్తు వారి చెక్ పవర్‌లను కూడా రద్దు చేయటం, రేషన్‌షాపు లెసైన్సులను రద్దు చేయటం వంటి కార్యక్రమాలు అధికార పార్టీ నేతలు చేపట్టారనే విమర్శలుకూడా ఉన్నాయి. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన సమయంలో పట్టంచుకోకుండా ఉన్న అధికారుల తీరు బోస్‌ను మారే విధంగా చేశాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
 
 తన కార్యకర్తలకు గానీ, ప్రజలకు గానీ అధికారులను అడ్డం పెట్టుకుని అన్యాయం చేస్తే ఊరుకునే స్థితిలో లేననే సంకేతాలను బోస్ పంపించినట్టు స్పష్టమైందని స్థానిక నేతలు అంటున్నారు. నిబంధనల ప్రకారం పనిచేయకపోతే శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసి తాట తీస్తానని హెచ్చరించిన బోస్ మాటలు ఆ పార్టీ నేతల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపిందనే చెప్పాలి.ఎమ్మెల్సీ బోస్ నాయకత్వంలో పార్టీ నాయకులు ఇక అధికార పార్టీపై పోరాటానికి సిద్దమవుతున్నారనే చెప్పాలని పలువురు అంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement