నాలుగేళ్ల క్రితం మూడుముళ్లు పడ్డాయి. మూడు నెలలకే అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. మొదట ఆడబిడ్డ పుట్టింది. వేధింపులు మరింత పెరిగాయి. పుట్టింటి వైపు కన్నెత్తి చూడకుండా నిర్బంధానికి గురి చేశారు. నెల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చినా.. ఆ బిడ్డ అదే రోజు చనిపోవడం.. ఇప్పుడు బాలింత అయిన ఆ ఆడకూతురు ఈ లోకాన్నే వీడిపోవడం విషాదమైతే.. ఆమె శరీరంపై ఉన్న గాయాలు అత్తింటి ఆరళ్లను వేలెత్తి చూపుతున్నాయి. వారిపైనే అనుమానాలు పెంచుతున్నాయి.
పొందూరు : అత్తింటి ఆరళ్లకు మరో అబల బలి అయ్యింది. పచ్చి బాలింత అయిన ఆమెను బలవన్మరణానికి గురి చేశారన్న అనుమానాలను ఆమె శరీరంపై ఉన్న గాయాలు రేపుతున్నాయి. పోలీసులు సైతం ఆ కోణంలోనే కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. జి.సిగడాం మండలం దవళపేటకు చెందిన కల్యాణికి పొందూరు మండలం అలమాజీపేటకు చెందిన బాడాన నర్సింగరావుకిచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. ఎకరా పొలం, రూ. 5 లక్షల నగదు, 10 తులాల బంగారం కట్నకానుకలుగా సమర్పించారు. అయితే పెళ్లయిన మూడు నెలల నుంచే అదనపు కట్నం కోసం కల్యాణికి అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయం తెలుసుకొని దవళపేట సర్పంచ్ కంచరాన సూరన్నాయుడు తదితర పెద్దలు పలుమారు కల్యాణి అత్తమామలతో మాట్లాడి సర్ది చెప్పారు. ఈ తరుణంలో కల్యాణి ఆడపిల్లకు జన్మనిచ్చింది.
దాంతో వేధింపులు మరింత పెరిగాయి. పండుగలకు, శుభకార్యాలకు కూడా ఆమెను పుట్టింటికి పంపించకుండా చేసేవారు. కూతురిని, మనవరాలిని చూసేందుకు వెళ్లిన కల్యాణి తల్లిదండ్రులకు సైతం వారిని చూపించకుండా చేసేవారు. ఇటీవల కల్యాణి మళ్లీ గర్భం దాల్చినా పుట్టింటికి పంపకపోగా భర్త, అత్తమామలు ఆమెను రోజూ హింసించేవారు. ఫలితంగా నెల రోజుల క్రితం కల్యాణి జన్మనిచ్చిన మగబిడ్డ అదే రోజు మరణించాడు. కొడుకు మరణించిన బాధలో ఉన్న బాలింత అయిన కల్యాణిని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆమె తల్లిదండ్రులను నిర్ధాక్షిణ్యంగా బయటకు తోసేశారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున మీ కూతురు చనిపోయిందంటూ అల్లుడు ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు భోరున రోదిస్తూ అలమాజీపేటకు వెళ్లారు.
ఒళ్లంతా గాయాలే
ఈ సమాచారం అందున్న మహిళా పోలీస్ విభాగం డీస్పీ ఎ.శ్రీనివాసరావు, తహశీల్దార్ భువన్‌మోహన్, ఎస్సై శ్యామలరావు, వీఆర్వోలు జనకచక్రవర్తి, రామ్మూర్తి నాయుడు సంఘటన స్థలానికి చేరుకొని కల్యాణి మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులను విచారించి వివరాలు సేకరించారు. ఒంటిపైన గాయాలను నమోదు చేసుకున్నారు. ముఖం కింద ఎడమ దవడ నుంచి కుడి దవడ వరకు గాయాలు, ముక్కు ఎడమ వైపున రక్తపు గాయం, ఎడమ భుజం దిగువన తట్లు, కుడి, ఎడమ మోకాళ్ల దిగువన, పైన గీరుకుపోయిన గాయాలు, ఎడమ మడంపైన రగుడు గాయం, వీపుపైన తట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ మేరకు సెక్షన్ 302, 304 సబ్‌సెక్షన్-బి కింద హత్య, వరకట్న వేధింపుల కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు.
పాపం చిన్నారి
తల్లి మరణించినట్లు తెలుసుకోలేని కల్యాణి మూడేళ్ల కూతురు ప్రవల్లిక తీరు అక్కడున్న వారిని కలచివేసింది. తల్లి నేలమీద పడుకొని ఉందనుకొని పిలిచింది. ఎంతకీ ఆమె పలక్కపోవడంతో బిక్కమొహంతో ఏడవడం మొదలుపెట్టింది. ఆ చిన్నారిని సముదాయించడం ఎవరి తరం కాలేదు. ఆ సంఘటన చూసిన వారందరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. చిన్నారి ప్రవల్లిక భవిష్యత్తును, తమ కూతురి మరణాన్ని తలచుకొని కల్యాణి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
అల్లుడు, కుటుంబ సభ్యులే చంపేశారు
నా కూతురిని అల్లుడు, అత్తమామలు, కుటుంబ సభ్యులు కలిసి చంపేశారు. పుట్టిన బిడ్డ చనిపోయిన బాధలో ఉన్నప్పుడైనా మా ఇంటికి పంపించకుండా ఈ దారుణానికి ఒడిగట్టారు.
-ఎన్ని సత్తెమ్మ, మృతురాలి తల్లి
ఆగిపోయిన ‘కల్యాణి’ రాగం
Published Sun, Mar 15 2015 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement
Advertisement